ధ్యానం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా..? రోజులో మీ కోసం 5 నిమిషాలు చాలు..
మీ దినచర్య నుండి కేవలం 5 నిమిషాలు మీకోసం కేటాయించడం ద్వారా మీరు మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చు. ధ్యానం అనేది యోగాలో ఒక శక్తివంతమైన అభ్యాసం. ఇది మనకు ఎంతో విశ్రాంతిని కలిగిస్తుంది. ధ్యానం ద్వారా మీరు మీ మనస్సును నియంత్రించుకోవచ్చు. దీంతో పాటు మీరు ధ్యానం చేయడం ద్వారా మీ మొత్తం శరీరంపై నియంత్రణ పొందవచ్చు. నేటి బిజీ జీవనశైలిలో తమకోసం సమయం కేటాయించడం చాలా కష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో మీరు ధ్యానం కోసం 5 నిమిషాలు కేటాయించినా చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తప్పక తెలుసుకోవాలి.
Updated on: Feb 06, 2025 | 8:18 AM

ధ్యానం రక్తపోటును తగ్గించే మందుల వలె పనిచేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం చేయడం ద్వారా, శరీరం ఒత్తిడి హార్మోన్లకు తక్కువగా స్పందిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రశాంతతతో కూడిన మనస్సు, మంచి ఏకాగ్రత, అవగాహన స్పష్టత, సమాచార అభివృద్ధి, మానసిక నైపుణ్యాలు ధ్యానం వల్ల వృద్ధి చెందుతాయి.

ధ్యానంతో మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మనలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి. మీరు చేసే పనులపై ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.

చాలా మంది భవిష్యత్తు గురించి ఒత్తిడికి గురవుతారు. తరచుగా ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఆందోళనపడుతుంటారు. కానీ మీరు ధ్యానం చేస్తే మీ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. ప్రస్తుత క్షణంపై మీ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు.

నిద్రపోయే ముందు ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీనితో పాటు, ధ్యానం నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ధ్యానం ద్వారా కలిగే నిద్ర మరింత దివ్యంగా ఉంటుందని పలువురు నిపుణులు సైతం చెబుతారు.

ఒత్తిడి జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి వల్ల వాపు, యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్లు, ఆహార అలెర్జీలు కూడా వస్తాయి. మీరు ధ్యానం చేసినప్పుడు, శరీరం రిలాక్స్‌గా అనిపిస్తుంది. దీని కారణంగా ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం లక్షణాలు గణనీయంగా మెరుగుపడతాయి.




