
Alipiri Mandapam development: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. తిరుమల క్షేత్రంలోని 1000ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన కట్టడాలు రాత్రి మండపాలు మెట్ల మార్గాలను పధిల పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏఎస్ఐ తరహాలో శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తోంది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ సెల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే తిరుపతిలోని పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. పునరుద్ధరణ పనులను చేపట్టింది.

చారిత్రక కట్టడాల పరిరక్షణకు టిటిడి చర్యలు.. టీటీడీ పరిధిలో ఉన్న ఎన్నో చారిత్రక కట్టడాలు శిథిలం కాకుండా చరిత్రను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. తిరుపతి, తిరుమలలో వెయ్యి ఏళ్లకు పైబడ్డ కట్టడాలను పరిరక్షించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఈఓ హోదా అధికారి పర్యవేక్షణలో కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. పురావస్తు శాఖలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారి నియామకానికి చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదన పై చర్చించిన టిటిడి.. ఈ మేరకు ప్రభుత్వ అనుమతిని కోరింది.

పాదాల మండపానికి పూర్వ వైభవం.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పురాతన కట్టడాల పరిరక్షణ పనులు చేపట్టిన టిటిడి.. కట్టడాల పటిష్టత చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించబోతోంది. ఇందులో భాగంగానే పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు రూ. 5 కోట్లతో మండప జీర్ణోద్ధరణ పనులు చేపట్టింది. ఈ మేరకు డాక్యుమెంటేషన్ ప్రక్రియతో పనులను టిటిడి ప్రారంభించింది.

చారిత్రక విశిష్టతకు భంగం కలగకుండా.. ఇక విజయనగర రాజుల కాలంలో నిర్మించిన పురాతన మండపం కాలక్రమంగా దెబ్బతింది. చారిత్రక విశిష్టతకు భంగం కలగకుండా ఆధ్యాత్మిక సాంకేతికతను సంప్రదాయ నిర్మాణ శైలిని మేడ నుంచి అలిపిరి పాదాల మండపం పనులు చేపట్టింది. 30 సీసీ కెమెరాలతో విజిలెన్స్ కనుసన్నల్లో పనులను చేపట్టింది. పునరుద్ధరణ పనుల్లో సాధ్యమైనంతవరకు పాత రాళ్లని వినియోగిస్తోంది. రాళ్లు పగిలి ఉంటే వాటిని అతికిస్తారేమో తప్ప కొత్తరాళ్లతో భర్తీ చేయకుండానే పనులు చేస్తారు. ఒకవేళ అసలు రాయి పూర్తిగా కనపడకుండా ద్వంసమై ఉంటే తప్ప కొత్త రాళ్లను వాడకూడదన్న నిర్ణయంతో కట్టడం ప్రాచీనత చెక్కుచెదరనీయకుండా ఉంచుతుంది.

పాత రాళ్లతోనే పునరుద్ధరణ 8 దశల్లో పనులు.. ఇక 8 దశల్లో అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణతో పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మండపంలోని పైకప్పులు, గోడలు నేల రాళ్లు ఇలా నిర్మాణ భాగానికి సంబంధించిన ప్రతి రాయికి నంబర్ వేసి డాక్యుమెంటేషన్ జరుగుతుంది. రాళ్ళను తొలగించడానికి ముందే ఆటోకాడ్ వంటి సాఫ్ట్‌వేర్ సహాయంతో ప్లాన్లు, ఎలివేషన్లు, డ్రాయింగ్స్ సిద్ధం చేస్తూ ప్రతి రాయి ఏ నెంబర్‌లో ఉందో నిక్షిప్తం చేస్తోంది. మరోవైపు మండపం లోపల బయట ప్రతి అంగుళాన్ని హెచ్‌డీ కెమెరాలు డ్రోన్లు ఫోటోగ్రామెట్రి పద్ధతులు వీడియో ఫోటో డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. రాళ్లకు ఏమాత్రం దెబ్బ తగలకుండా స్కఫోల్డింగ్ ఏర్పాటు చేసి నిపుణుల పర్యవేక్షణలో ఒక్కోరాయిని జాగ్రత్తగా శాస్త్రీయత దించుతున్నారు. తొలగించిన రాళ్లను పక్కనే ఉన్న స్థలంలో క్రమ పద్ధతిలో పేర్చి భద్రపరుస్తున్నారు. ఏ రాయిని ఎక్కడ పెట్టారో లేఔట్ మ్యాప్ రూపొందిస్తున్నారు.

పురాతన పద్ధతులతోనే పూర్వ వైభవం.. పురాతన పద్ధతుల ఆధారంగానే కొత్త పునాదిని నిర్మించనున్నారు. ముందుగా సిద్ధం చేసుకున్న డాక్యుమెంటేషన్ ప్రకారమే ఏ రాయి ఎక్కడ ఉందో మళ్లీ అదే స్థానంలో అదే లెవెల్‌లో అమర్చుతారు. ఇక పైకప్పు నుంచి నీరు కారకుండా సాంప్రదాయ పద్ధతిలోనే వాటర్ టైటనింగ్ పనులతో పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.