కళ్లు జిగేల్ మనిపించే విద్యుత్ కాంతులు.. ఆకర్షించే టపాసుల మధ్య విశ్వక్రీడా ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తున్న 32వ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ అబ్బురపరిచింది. జపాన్ చక్రవర్తి నరుహిటో ఈ గేమ్స్‌ను ప్రారంభించారు.
అయితే ప్రతిసారీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను ఈసారి ప్రేక్షకులు లేకుండా నిర్వహించారు. టీమ్స్ పరేడ్‌లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి పరిమితం చేశారు. ఇండియా తరఫున కేవలం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు. భారత్ టీమ్‌ను మేరీకోమ్ లీడ్ చేశారు. భారతీయ జెండాలు పట్టుకుని స్టేడియంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ మినిస్టర్ అనురాగ్ ఠాగూర్.. వారికి అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాన్ని టీవీలో చూసిన ప్రధాని మోదీ.. చప్పట్లతో క్రీడాకారులను ఎంకరేజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కూడా మన దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ గేమ్స్‌లో అత్యధికంగా భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. మొత్తంగా ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌లో 11,500 మంది అథ్లెట్లు తలపడనున్నారు. 42 వేదికల్లో జరిగే విశ్వక్రీడల్లో 205 దేశాలతో పాటు ఓ శరణార్థి జట్టు కూడా పాల్గొననుంది. ఈ ఓపెనింగ్ వేడుకలకు హాజరైన అతిథుల్లో అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్ రెండో రోజున (జులై 24) ఆర్చరీ, బ్యాడ్మింటన్ సహా మరో ఎనిమిది క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. 10 క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ తొలి రౌండ్లలో తెలుగు తేజాలు పోటీ పడనున్నారు. అందులో ఆర్చరీ మిక్స్డ్ ఎలిమినేషన్ రౌండ్లో అతాను దాస్, దీపికా కుమారి ఆడనున్నారు.
మరోవైపు భారత పురుషుల హాకీ టీమ్ న్యూజిలాండ్ జట్టుతో పోటీ పడనుంది. వీరితో పాటు మహిళల హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, పెడ్లింగ్, రోవింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో భారథ అథ్లెట్లు పాల్గొననున్నారు.