- Telugu News Photo Gallery Spiritual photos Ugadi 2025 Astrology: Mars Transit in Cancer Good Impact on Career and Jobs for these Zodiac Signs
Ugadi 2025: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఉగాది తర్వాత వారికి కెరీర్‌లో శుభ యోగాలు..!
Career Astrology 2025: ఉగాది తర్వాత మొదటగా రాశి మారబోయే గ్రహాల్లో కుజుడు మొదటి స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ 3వ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్న కుజుడు ఆ రాశిలో జూన్ 5వ తేదీ వరకూ కొనసాగుతాడు. కుజుడు రాశి మారిన దగ్గర నుంచి వృత్తి, ఉద్యోగాల్లో భారీ మార్పులు జరగడం ప్రారంభం అవుతుంది. కుజుడికి కర్కాటకం నీచ స్థానమే అయినప్పటికీ ఫలితాలనివ్వడంలో వేగంగా, చురుకుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. కుజుడి కర్కాటక రాశి సంచారం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Mar 21, 2025 | 7:54 PM

మేషం: రాశినాథుడైన కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేసుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విస్తృతంగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి.

కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. శీఘ్ర పురోగతికి, ఉన్నత పదవులు లభించడానికి అవకాశముంది. ఉద్యోగంలో ఈ రెండు నెలల కాలంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలున్నాయి. జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఈ రెండు నెలల కాలంలో తప్పకుండా పదోన్నతులకు అవకాశం ఉంటుంది. జీతభత్యాలతో పాటు, అదనపు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ తో పాటు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా అనేక శుభ పరిణామాలకు అవకాశం ఉంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం జరుగుతుంది. ఒక సంస్థకు అధిపతిగా మారే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభ దాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు కల నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలే బాగా కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం లభించడంతో పాటు అక్కడే స్థిరపడే అవకాశం కూడా కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు క్రమంగా అభివృద్ది బాటపడతాయి. అదనపు రాబడికి అవకాశాలు అందివస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

మీనం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు పంచమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగంలో అనుకో కుండా, అప్రయత్నంగా ఉన్నత పదవులు లభిస్తాయి. సమర్థతకు ఊహించని గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా అత్యంత ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది.





























