- Telugu News Photo Gallery Spiritual photos Tirupati Salakatla Brahmotsavam: Snapana Thirumanjanam Held at Tirumala
Tirupati : ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. 3వ రోజున స్వపన తిరుమంజనం..
తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో 3 వ రోజు స్వపన తిరుమంజనం శాస్త్రొక్తంగా జరిగింది. తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Raju M P R | Edited By: Shiva Prajapati
Updated on: Sep 20, 2023 | 9:59 PM

తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో 3 వ రోజు స్వపన తిరుమంజనం శాస్త్రొక్తంగా జరిగింది. తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు. ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేస్తూ వేదపారాయణం చేశారు.

అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పఠించగా పవిత్రమాలలతో దండలు, ఆకుపచ్చ పవిత్రమాలలతో దండలు, పసుపురంగు పట్టుదారం దండలు, తామర గింజలు, తులసి గింజలతో దండలు, గోల్డ్ గ్రేప్స్ మాలలు, బాదం మాలలు, నందివర్ధనం, రోజ్ పెటల్స్, మల్టీకలర్ రోజ్ పెటల్స్ మాలలు, కిరీటాలు, తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన భక్తులు మాలలను విరాళంగా అందించగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డిలు స్నపన తిరుమంజనం లో పాల్గొన్నారు.