- Telugu News Photo Gallery Spiritual photos Srivari Brahmotsavam 2022, Fourth day night with sarva bhoopala Vahanam in bakasura vadha Alankaram and blessed the devotees
Srivari Brahmotsavam: బకాసుర వధ అలంకారంలో శ్రీవారు.. సర్వభూపాల వాహనంపై దర్శనం..
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
Updated on: Oct 01, 2022 | 7:20 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.

సర్వభూపాల వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.

వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు.. దర్శనంతోనే యశోప్రాప్తి




