
వృషభం: ఎంత కష్టానికైనా, ఎంతటి శ్రమకైనా ఓర్చుకునే తత్వం వృషభ రాశిది. లక్ష్యసాధన కోసం ఎంత కాలమైనా నిరీక్షించడానికి ఈ రాశివారు సిద్ధపడతారు. ఈ రాశివారిని సంపన్నులను చేయడానికి, ఆరోగ్యవంతుల్ని చేయడానికి శని అనేక అవకాశాలను కల్పించడం జరుగుతుంది. ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినా, వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా అంతిమంగా ఈ రాశివారే ఊహించని విధంగా లబ్ధి పొందుతారు.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో వక్ర సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారికి శ్రమ, తిప్పట బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారులు ఈ రాశివారి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, మందలించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ రాశివారు ఎంత శ్రమ పడితే అంత మంచిది. వీరు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. అధికారులు తరచూ వీరి బాధ్యతలను పెంచడం జరుగుతుంది. దీనివల్ల హోదా, వేతనాలు పెరిగే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి వక్ర సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా బాధ్యతలు, పని భారం పెరుగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ రాశివారిలోని దూరదృష్టి, ఆచితూచి వ్యవహరించే తత్వం, ప్రణాళికాబద్ధంగా పనిచేసే తీరు అధికారులకు నచ్చి పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, వీటి వల్ల బాగా లబ్ధి పొందడం జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శని వక్రగతి వల్ల కొద్దిగా ఆలస్యంగానైనా వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ రాశివారిలోని ఓర్పు, సహనాలు, శ్రమపడే తత్వం వీరికి అనేక విధాలుగా లబ్ధిని చేకూరుస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో బాగా శ్రమ ఉన్నప్పటికీ వీరిలోని కష్టించేతత్వం వల్ల ఆదాయం పెరిగి, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారులను తమ పనితీరుతో మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి.

మకరం: ఈ రాశికి తృతీయంలో శని వక్ర సంచారం వల్ల ఈ రాశివారిలోని ‘పట్టు వదలని విక్రమార్కుడి తత్వం’ మరింతగా వెలుగులోకి వస్తుంది. ఈ ఏడాదంతా వీరు ఓటమిని దగ్గరకు రానివ్వకపో వచ్చు. వీరిలోని పట్టుదల, శ్రమపడే తత్వం, కార్యదక్షత బాగా రాణిస్తాయి. తప్పకుండా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. శని బలంతో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తప్పకుండా నెరవేరడం జరుగుతుంది.

మీనం: ప్రస్తుతం ఈ రాశిలో వక్ర సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. అయితే, ఈ రాశివారు ఎంత శ్రమకైనా ఓర్చుకునే తత్వం కలిగినవారు కావడం వల్ల అంతిమంగా అనేక ప్రయత్నాల్లో వీరు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.