- Telugu News Photo Gallery Spiritual photos Historical Significance of Lord venkateswara swamy Nijapada Darshanam in tirumala tirupati
Nija Rupa Darshanam: వారంలో ఒక్క రోజు మాత్రమే శ్రీవారి నిజ రూపాన్ని దర్శించుకునే భాగ్యం.. నేత్ర దర్శనం ఎందుకు అంటారో తెలుసా..
కలియుగంలో మానవాళిని రక్షించడానికి భగవంతుడు వెలసిన క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠంలో కొలువై పూజలను అందుకుంటున్న వెంకన్నను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపిస్తారు. అయితే వారంలో ఒక్కరోజు మాత్రమే శ్రీవారి నిజ రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీవారి గురువారం రోజున ఎటువంటి ఆభరణాలు లేకుండా నిజరూప దర్శనం ఇస్తారు. ఈ దర్శనం గురించి మీకు తెలుసా.
Updated on: Nov 24, 2022 | 10:57 AM

వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాట్టుని ఎటువంటి అలంకారాలు, ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజ సరూపంతో భక్తులకు దర్శనమిస్తారు.

దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. దీంతో ఈరోజు అంతా శ్రీవారి నేత్రాలను భక్తులు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఈ దర్శనాన్ని నేత్ర దర్శనం అని అంటారు.

శ్రీవారు గురువారం రోజున ఎటువంటి ఆభరణాలను ధరించరు. నగలకు బదులు కేవలం పట్టుధోవతిని ధరింపజేస్తారు. పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్కతో స్వామివారు చూడచక్కగా భక్తులకు దర్శనం ఇస్తారు.

శ్రీవారి కిరీటాన్ని తీసి తలకు చుట్టూ సొగసుగా పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు. గురువారం పరివీటం, పరివేష్ఠనం.. నగుమోముతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తాడు స్వామి.

శ్రీవారి గురువారం నిజరూపంలో భాగంగా ఆభరణాలకు బదులు 24/ 4 కొలతలు గల పట్టుధోవతి ధరింపచేస్తారు. 12/ 2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాను చుడతారు.

ప్రతి గురువారం, నిజ రూప దర్శనం సమయంలో, స్వామిని తెల్లటి చందనం పేస్ట్ తో అలంకరిస్తారు. ఈ అలంకరణను బయటకు తీసినప్పుడు, లక్ష్మీదేవి ముద్ర అలాగే ఉంటుంది. ఈ ముద్రను ఆలయ అధికారులు విక్రయిస్తారు.

స్వామివారి మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు.

గురువారం రోజున వెంకన్న ను చూస్తే.. ద్వాపర యుగంలో కన్నయ్యే నేడు గోవిందుడు అని భక్తులు భావించే రీతిలో దర్శనమిస్తారు.

గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు. ఎందుకంటే పుణ్యకార్యాలు చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం.




