- Telugu News Photo Gallery Spiritual photos Guru Transit 2025: Jupiter Transit in Gemini Wealth, Career and Marriage Predictions
Jupiter Transit 2025: ఈ రాశులకే గురువు అనుగ్రహం.. వారి దశ తిరిగిపోవడం ఖాయం..!
Guru Gochar 2025: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ రాశివారికైనా గురువు అనుగ్రహం కలిగిందంటే వారు ఆకాశమే హద్దుగా జీవితంలో బాగా రాణిస్తారు. వారి జీవితం వైభవంగా గడిచిపోతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు మే 25న మిథున రాశిలోకి మారి అక్కడే 2026 మే వరకూ కొనసాగుతాడు. ప్రయత్నం, చొరవ, సాహసం, తెగువ వంటి లక్షణాలకు సంబంధించిన మిథున రాశిలో ధన కారకుడు, గృహ కారకుడు, పుత్ర కారకుడైన గురువు సంచారం వల్ల కొన్ని రాశుల వారు ఎంత ప్రయత్నిస్తే అంతగా జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి గురువు రాశి మార్పుతో దశ తిరిగే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Mar 23, 2025 | 8:41 PM

వృషభం: ఈ రాశివారికి ధన స్థానంలో గురువు ప్రవేశం వల్ల వచ్చే ఏడాది మే చివరి వరకూ ఆదాయ పరంగా వీరికి పట్టపగ్గాలు ఉండవు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలోకి వస్తున్న గురువు వల్ల ఈ రాశివారికి జీవితంలో ఊహించని పురోగతి కలుగుతుంది. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సిద్ధిస్తాయి.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల అదృష్టం అనేక పర్యాయాలు వీరి తలుపు తడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభిస్తాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి వీరి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. ఏడాదిపాటు అర్ధాష్టమ శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతోంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. పెద్దలతో పరిచయాలు విస్తరిస్తాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం ఏడాది పాటు చాలా వరకు తగ్గిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం: రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి.





























