- Telugu News Photo Gallery Science photos Alien attack on Earth in November, Harvard scientists warn about mysterious object coming towards us
Alien Attack: నవంబర్‌లో గ్రహాంతరవాసుల దాడి.. గంటకు 60 కిమీల వేగంతో భూమివైపు దూసుకొస్తోన్న వింత వస్తువు
Alien attack on Earth in November: మాన్‌హట్టన్ నగర పరిమాణంలో ఉన్న ఒక రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకు వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది కలిగించే ప్రమాదం ఎవరూ ఊహించలేరని చెబుతున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఆ అంతరిక్ష వస్తువు భూమిపై దాడి చేసేందుకు వచ్చే గ్రహాంతర అంతరిక్ష నౌక కావచ్చు అని, నవంబర్ 2025లో ఈ విధ్వంసం జరగొచ్చని చెబుతున్నారు.
Updated on: Sep 03, 2025 | 5:33 PM

Alien Attack in November: భూమి వైపు దూసుకువస్తున్న ఒక రహస్యమైన అంతరిక్ష వస్తువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఆవీ లోబ్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ వస్తువుపై చేసిన అధ్యయనం సంచలనం రేపుతోంది. ఈ వస్తువు ఒక ఏలియన్ అంటే అంతరిక్ష నౌక అయ్యే అవకాశం ఉందని, ఇది 2025 నవంబర్‌లో భూమిపై దాడి చేయవచ్చని వారు హెచ్చరించారు.

ఈ వస్తువును మొదట చిలీలోని 'ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్' (ATLAS) టెలిస్కోప్ గుర్తించింది. దీనికి "3I/ATLAS" అని పేరు పెట్టారు. ఇది మాన్‌హట్టన్ నగర పరిమాణంలో ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోందని, దీని కదలికలు సాధారణ ధూమకేతువుల కదలికలకు భిన్నంగా ఉన్నాయని వారు తెలిపారు.

హార్వర్డ్ శాస్త్రవేత్త ఆవీ లోబ్ ప్రకారం, ఈ వస్తువు సహజ వస్తువు అయ్యే అవకాశం చాలా తక్కువ. ఆయన గతంలో కూడా "ఓమూవామూవా" అనే వస్తువు ఏలియన్ నాగరికతకు చెందిన కృత్రిమ వస్తువు కావచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు 3I/ATLAS విషయంలో కూడా అలాంటి వాదననే వినిపిస్తున్నారు. ఈ వస్తువు సూర్యుడికి దగ్గరగా చేరుకున్నప్పుడు, అది భూమి నుంచి కనిపించకుండా దాక్కునే అవకాశం ఉందని, ఆ సమయంలో అది తన దిశను మార్చుకుని దాడి చేసే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.

ఆవీ లోబ్ తన పరిశోధనా పత్రంలో, ఈ విషయం నిజమైతే మానవాళికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల నాయకులు ఇప్పుడే అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎదురయ్యే కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, గ్రహశకలాల తాకిడి వంటి ప్రమాదాలపై మనం ఆలోచిస్తామని, కానీ గ్రహాంతరవాసుల నుంచి వచ్చే ముప్పుపై ఎప్పుడూ చర్చించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అధ్యయనం ఇంకా పరిశీలన దశలోనే ఉంది. పరిశోధకులు ఇది కేవలం ఒక ఊహాత్మక సిద్ధాంతం మాత్రమే అని, ఇది తప్పనిసరిగా జరుగుతుందని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ ఇది నిజమైతే, మానవాళి భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.




