Foot Bath: గోరువెచ్చని నీటిలో కాళ్లు నానబెట్టే అలవాటు మీకూ ఉందా? వీరికి యమ డేంజర్..
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా కొంత మందికి పాదాల్లో తరచూ నొప్పి సంభవిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొంద డానికి చాలా మంది పాటించే ట్రిక్.. వేడి నీటిలో ఉప్పు కలిపి అందులో కాసేపు పాదాలు ఉంచడం. ఈ ఇంటి చిట్కా చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అందరికీ కాదు...
Updated on: Dec 02, 2025 | 8:58 AM

నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా కొంత మందికి పాదాల్లో తరచూ నొప్పి సంభవిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొంద డానికి చాలా మంది పాటించే ట్రిక్.. వేడి నీటిలో ఉప్పు కలిపి అందులో కాసేపు పాదాలు ఉంచడం. ఈ ఇంటి చిట్కా చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అందరికీ కాదు... కొన్ని సమస్యలు ఉన్నవారు వేడి నీటిలో పాదాలు అస్సలు ఉంచకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు వేడి నీటిలో పాదాలు ఉంచడం అంత మంచిది కాదు. న్యూరోపతి సమస్య కారణంగా వీరికి నీరు చాలా వేడిగా ఉన్నట్లు అనుభూతి చెందలేకపోవచ్చు. దీంతో కాళ్లపై కాలిన గాయాల ప్రమాదం పెరుగుతుంది.

పాదాలకు, కాళ్ళకు రక్త ప్రసరణ సరిగా లేని వ్యక్తులు వేడి నీటి స్నానాలకు కూడా దూరంగా ఉండాలి. అలాంటి వారి చర్మాన్ని వేడి నీరు దెబ్బతీస్తుంది లేదంటే గాయపరుస్తుంది. రక్త ప్రవాహంలో ఆకస్మిక మార్పు నొప్పి, వాపును పెంచుతుంది.

చర్మ వ్యాధులు, గాయాలు, పుండ్లు ఉన్నవారు కూడా వేడి నీటి స్నానాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల గాయాలు పగిలిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎగ్జిమా, సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గర్భిణీలు కూడా పాదాలను వేడి నీటిలో నానబెట్టడం మానుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. శరీరం వేడెక్కే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అధిక రక్తపోటు (హై బీపీ) ఉన్నవారు కూడా వేడి నీటి షేక్‌లను తీసుకోకూడదు. వేడి నీరు.. గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. రక్త ప్రవాహం, హృదయ స్పందన రేటు మార్పులు కారణం అవుతుంది.




