- Telugu News Photo Gallery Over 1 lakh women attends PM Modi’s Lakhpati Didi Sammelan In Jalgaon See Pics
PM Modi: ‘రూ.లక్షల కోట్లు సాయం చేశాం’.. ప్రధాని మోదీ సభకు భారీగా తరలివచ్చిన మహిళలు.. ఫొటోలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన 'లఖపతి దీదీ' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.. జల్గావ్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో నిర్వహించిన లఖపతి దీదీ కార్యక్రమానికి లక్షలాది మంది మహిళలు తరలివచ్చి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
Updated on: Aug 25, 2024 | 7:13 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన 'లఖపతి దీదీ' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.. జల్గావ్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో నిర్వహించిన లఖపతి దీదీ కార్యక్రమానికి లక్షలాది మంది మహిళలు తరలివచ్చి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది.. మహిళలంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో లక్షన్నర వరకు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.. దాదాపు పదేళ్ల తర్వాత నరేంద్ర మోదీ జలగావ్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన మహారాష్ట్ర మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడిన మోదీ.. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షపడేలా చేస్తామని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. ఇందుకోసం కఠిన చట్టాలను రూపొందించామని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు క్షమించరాని పాపమని ప్రతి రాజకీయ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతానని మోదీ పేర్కొన్నారు.

దోషులు ఎవరైనప్పటికీ వారిని విడిచిపెట్టబోమని ఆయన అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి సహాయం చేసేవారిని కూడా వదిలిపెట్టకూడదన్నారు. ఆసుపత్రి, పాఠశాల, ప్రభుత్వం లేదా పోలీసు వ్యవస్థ ఏదైనా, ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా, ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని ప్రధాని అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి గత పాలనలతో పోలిస్తే గత 10 సంవత్సరాలలో తన ప్రభుత్వం మహిళా-కేంద్రీకృత విధానాన్ని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25,000 కోట్ల రుణాలు ఇచ్చామని, అయితే గత 10 ఏళ్లలో రూ.9 లక్షల కోట్ల సాయం అందించామని మోదీ చెప్పారు.

జల్‌గావ్‌లో లఖపతి దీదీలతో సంభాషించిన ప్రధానమంత్రి, 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 48 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చే రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేశారు.

లఖ్‌పతి దీదీ పథకం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలకు సాధికారత చేకూరుస్తుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు.




