
శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది తలెత్తినా మనుగడ కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి సరైన ఆక్సిజన్ అందితే, కార్బన్ డై ఆక్సైడ్ శరీరం నుంచి సక్రమంగా బయటకు వెళ్లి.. ఆరోగ్యంగా ఉంటారు. అందుకే శ్వాసకోశ వ్యవస్థపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ధూమపానం వల్ల ఆస్తమా, అలర్జీలు, శ్వాసకోశంలో సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు శ్వాస సమస్యలను కలిగిస్తాయి.
ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణంగా నిమిషానికి 12 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటాడు – వదులుతాడు. అలాగే శ్వాసను ఎక్కువసేపు పట్టుకోగలిగితే, శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి తన శ్వాసను ఎంతకాలం పట్టుకోగలడు అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఒక వ్యక్తి తన శ్వాసను పట్టుకునే సమయం సాధారణంగా మారుతూ ఉంటుంది. అయితే శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని బట్టి మీ శ్వాసను ఎంతసేపు పట్టుకోగలరో అంచనా వేయవచ్చు.
గురుగ్రామ్‌లోని నారాయణ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ వర్మ మాట్లాడుతూ.. సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తి తన శ్వాసను 30 సెకన్ల నుంచి 90 సెకన్ల వరకు ఎటువంటి సమస్య లేకుండా శ్వాసను బిగబట్టగలడు. అయితే ఈ సమయం వరకు శ్వాసను పట్టుకోవడం మంచి ఆరోగ్యానికి సంకేతం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రొఫెషనల్ అథ్లెట్‌లా నిత్యం ప్రాక్టీస్ చేసేవారికి శ్వాస నిలుపుదల సమయం మరికొంత పెరుగుతుంది.
ధూమపానం, ఇతర శారీరక సమస్యలు ఉన్న వారిలో శ్వాస నిలుపుదల సమయం తక్కువగా ఉంటుంది. వైద్యులు ప్రకారం.. శ్వాస నిలుపుదల కోసం నిర్దిష్ట స్థాయి అంటూ ఏమీ లేదు. అయితే 30 నుంచి 90 సెకన్ల పాటు ఊపిరి నిలపగలిగిన వారిని ఆరోగ్యవంతులుగా పరిగణిస్తారు. మరి 30 సెకన్లలోపు శ్వాస పడిపోతే వారిలో శ్వాసకోశ సమస్యలు ఉన్నాయని సంకేతం. వీరు జీవనశైలిని మెరుగుపరచుకోవాలి.
శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని ధూమపానం మానేయడం. అలాగే, రోజువారీ దినచర్యలో రెగ్యులర్ వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ ఉండాలి. దీనితోపాటు పోషక ఆహారం తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.