- Telugu News Photo Gallery Kashmir pahalgam These are amazing places to explore Natural Beauty and Activities
భూతల స్వర్గమే పహల్గామ్.. పర్యాటకులను ఆకర్షించే అందం, ఆధ్యాత్మిక ప్రదేశాలు దీని సొంతం..
కాశ్మీర్‌లోని పహల్గామ్ ఖచ్చితంగా పర్యాటకుల పర్యటన జాబితాలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. పైన్ అడవులు, రాళ్ల మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది నీరు, పచ్చని గడ్డి భూములు, చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలతో ప్రకృతి ప్రేమికుల హృదయాన్ని దోచుకుంటాయి. ఈ రోజు పహల్గామ్ లోని ఆరు అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Updated on: Apr 23, 2025 | 11:45 AM

భూమిపై స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉండే ఈ ప్రాంతం అందం కవులకు సైతం మాటల్లో వర్ణించడం కష్టం అని అంటారు. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా నిలిచే కొన్ని ఉత్తమ గమ్యస్థానాలున్నాయి. అలాంటి ప్రదేశాలలో పహల్గామ్ ఒకటి. పహల్గామ్ ప్రకృతి అందాలను చూసిన వారికీ ఎవరికైనా అక్కడే స్థిరపడాలని అనిపిస్తుంది. విశాలమైన గడ్డి భూములు, ఎత్తైన శిఖరాలు, స్వచ్చంగా ప్రవహించే నది, పచ్చని లోయలు... ఇక్కడి వీచే గాలి.. ప్రశాంత మైన వాతావరణం ప్రతి ఒక్కరినీ అంతర్గత శాంతితో నింపుతుంది. ముఖ్యంగా పహల్గామ్ పైన్ అడవులకు ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సౌందర్యమే కాదు ఇక్కడ ప్రజలను ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయి.

మంచుతో కప్పబడిన పర్వతాలను చూడాలనుకోవచ్చు లేదా తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం కోసం పర్వతాల నుంచి వీచే తాజా గాలిలో ప్రశాంతమైన క్షణాలు గడపాలని అనుకోవచ్చు. కాశ్మీర్ ప్రతి సీజన్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. ప్రస్తుతానికి కాశ్మీర్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటైన పహల్గామ్ గురించి తెలుసుకుందాం.

ఇతర వన్యప్రాణుల అభయారణ్యాలు: పహల్గామ్ లో రక్షిత ప్రాంతమైన అరు వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఇది సహజ సౌందర్యానికి, వివిధ రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం వన్యప్రాణులకు, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది. హంగుల్, గోధుమ ఎలుగుబంటి, చిరుతపులి నుంచి కస్తూరి జింక వరకు ఇక్కడ అనేక వన్యప్రాణులు ఉన్నాయి. అంతేకాదు ఈ అభయారణ్యంలో అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి.

బైసరన్ లోయ: బైసరన్ లోయ సహజ సౌందర్యం కారణంగా దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం పహల్గామ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విశాలమైన గడ్డి భూములు, దట్టమైన పైన్ అడవులు . ఎత్తైన మంచుతో కప్పబడిన శిఖరాలను చూసినవారికి తాము కలల అందమైన ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది.

కోలహోయ్ హిమానీనదం: పహల్గామ్ సమీపంలోని లిడ్డర్ లోయ పైన ఉన్న కోలాహోయ్ హిమానీనదం ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం. ఇక్కడి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. లిడ్డర్ నది ఇక్కడే ఉద్భవించింది. ప్రకృతి ప్రేమికులకు, సాహసయాత్రలు ఇష్టపడే వారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.

లిడ్డర్ అమ్యూజ్‌మెంట్ పార్క్: పహల్గాంలో లిడ్డర్ అమ్యూజ్‌మెంట్ పార్క్ కూడా ఒక గొప్ప ప్రదేశం. అందమైన దృశ్యాల మధ్య ఉన్న ఈ ఉద్యానవనం ప్రయాణ బకెట్ జాబితాలో చేరాల్సిందే అనిపిస్తుంది చూపరులకు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయల నుంచి అందమైన దృశ్యాలను చూడటం ఒక ఉత్తేజకరమైన అనుభవం.

లిడ్డర్ నది: పహల్గామ్‌లోని లిడ్డర్ నది దృశ్యాలు కూడా మీలో కొత్త శక్తిని నింపుతాయి. ఈ నది జీలం నదిలో కలుస్తుంది. నది నీరు పూర్తిగా స్పష్టంగా ఉండి నీలం రంగులో కనిపిస్తుంది. ఈ నది రాఫ్టింగ్ కు కూడా ఉత్తమమైన ప్రదేశం. ఈ నది ప్రత్యేక అందానికి కూడా ప్రసిద్ధి చెందింది.

చందన్వాడి: పహల్గామ్ లోని చందన్ వాడి దాని సహజ సౌందర్యానికి కూడా ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఈ దృశ్యాలు అందంగా ఉండటమే కాదు ఆశ్చర్యకరంగా కూడా కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం పరంగా చూసినా ఈ ప్రదేశం ఉత్తమమైనది. ఇది అమర్‌నాథ్ యాత్ర వెళ్లేందుకు ప్రధాన లోయ మార్గం

పహల్గామ్ సహజ సౌందర్యాన్ని మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రశాంతను ఇస్తుంది. ఇక్కడ మార్తాండ సూర్య దేవాలయం, మామలేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. దీనితో పాటు పహల్గామ్‌లో చేపలు పట్టడం, గుర్రపు స్వారీ, స్కీయింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు.




