- Telugu News Photo Gallery Jaggery Purity Test: How to test the purity of jaggery you buy from the market? Here's an easy way to find out
Jaggery Purity Test: మీరు వాడే బెల్లం అసలైనదా? కల్తీదా? ఇలా చిటికెలో తెలుసుకోండి..
చాలా మంది ఆరోగ్య స్పృహ ఉన్నా వారు ఆహారంలో చక్కెరకు బదులు బెల్లం వినియోగిస్తుంటారు. అయితే కొందరు కల్తీ రాయుళ్లు లాభాలకు కక్కుర్తిపడి కల్తీ బెల్లం తయారు చేసి అమాయక జనాలను మోసం చేస్తుంటారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటే మీరు కొనే బెల్లం అసలేందో.. కాదో.. ఇలా చిటికెలో టెస్ట్ చేయొచ్చు..
Updated on: Jan 26, 2025 | 12:25 PM

ఏదైనా తీపిగా స్నాక్స్ తయారు చేయాలంటే చక్కెర కంటే బెల్లం ఉపయోగిస్తే రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ప్రతి ఇంటి వంటగదిలో బెల్లం అధికంగా వినియోగిస్తుంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన బెల్లం వినియోగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ మార్కెట్‌లో కొందరు వ్యాపారులు కల్తీ బెల్లం కూడా విక్రయిస్తున్నారు. కల్తీ బెల్లం తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ కొన్ని పద్ధతుల ద్వారా బెల్లం అసలైనదా లేదా నకిలీదా అనే విషయం తెలుసుకోవచ్చు.

బెల్లం డిజైన్ చూస్తే అది అసలైనదో నకిలీదో తెలుస్తుంది. స్వచ్ఛమైన బెల్లం తేలికగా, మెత్తగా, కొద్దిగా జిగటగా ఉంటుంది. ఈ బెల్లం సులభంగా పగలవచ్చు. కానీ కల్తీ బెల్లం మరీ గట్టిగా ఉంటుంది. పగలగొట్టడం చాలా కష్టం.

బెల్లం సల్ఫర్ సమ్మేళనంతో కల్తీ చేస్తే దానిని సులభంగా పరీక్షించవచ్చు. కాబట్టి బెల్లం ముక్కపై కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. దీనిపై బుడగలు కనిపిస్తే, అందులో సల్ఫర్ ఉందని అర్ధం చేసుకోవాలి.

స్వచ్ఛమైన బెల్లం రంగు గోధుమ, పసుపు రంగులో ఉంటుంది. బెల్లం రంగు చాలా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటే, దానిలో కృత్రిమ రంగులు కలిపారని అర్ధం. కాబట్టి ఒక చిన్న ముక్కను నీటిలో కరిగించి చూడాలి. నీటి రంగు మారితే, అందులో రంగు కలిపారని అర్ధం.

స్వచ్ఛమైన బెల్లం రుచిలో తియ్యగా ఉంటుంది. కొద్దిగా మట్టి వాసనను వెదజల్లుతుంది. కానీ కల్తీ బెల్లం చాలా తీయగా.. మసాలా వాసన ఘాటుగా వస్తుంది. స్వచ్ఛమైన బెల్లం వేడిచేసినప్పుడు అది కరిగి చిక్కటి ద్రవంగా మారుతుంది. కానీ బెల్లం కల్తీ అయినట్లయితే, దానిని వేడిచేసినప్పుడు చక్కెర స్ఫటికాలు మాదిరి ఏర్పడుతుంది. ఇలా సులువుగా మార్కెట్లో దొరికే కల్తీ బెల్లంను గుర్తించవచ్చు.




