- Telugu News Photo Gallery Cricket photos Pakistan Cricket Board may lose Rs 1804 crores if Champions Trophy 2025 is shifted to another country
Champions Trophy: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.. బీసీసీఐ దెబ్బకు పాక్ బోర్డుకు రూ. 1804 కోట్ల నష్టం
PCB May Lose rs 1804 Crores Because of BCCI: బీసీసీఐ, పీసీబీ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం నడుస్తోంది. దీంతో ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాలేదు. ఐసీసీకి కూడా ఈ సమస్య ఓ తలనొప్పిలా తయారైంది. ఈ క్రమంలో పీసీబీకి బిసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
Updated on: Nov 15, 2024 | 1:15 PM

PCB May Lose rs 1804 Crores Because of BCCI: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ టోర్నమెంట్ నిర్వహించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. కానీ, టోర్నమెంట్ ఆతిథ్యాన్ని మరే ఇతర దేశంతో పంచుకోవడానికి పిసిబి ఇష్టపడడంలేదు. ఇటువంటి పరిస్థితిలో, టోర్నమెంట్‌ను వాయిదా వేసినా లేదా వేరే దేశానికి మార్చినా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోట్ల రూపాయలను కోల్పోతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసిసి ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించని టోర్నీని వేరే దేశానికి తరలిస్తే.. బోర్డు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో నిర్వహిస్తే, దానికి ఐసిసి నుంచి 65 మిలియన్ యుఎస్‌ఎ డాలర్లు లభిస్తాయి. కానీ, టోర్నీని వేరే దేశంలో నిర్వహిస్తే, ఈ మొత్తం ఆతిథ్య దేశానికి వెళ్తుంది. ఈ మొత్తం పాకిస్థానీ రూపాయల్లో సుమారు రూ.1804 కోట్లు. ఇది పీసీబీకి పెద్ద నష్టమే.

పాకిస్తాన్‌లో టోర్నమెంట్‌ను నిర్వహించడానికి పిసిబి చాలా సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. లాహోర్, రావల్పిండి, కరాచీ స్టేడియాల మరమ్మతులకు దాదాపు రూ.1300 కోట్లు వెచ్చించింది. పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోతే ఈ స్టేడియాలకు ఇంత డబ్బు వెచ్చించి ఏం లాభం అంటోంది పాకిస్తాన్.

బీసీసీఐ తన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీకి ప్రతిపాదించింది. 2023లో ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్లలేదు. ఈ కారణంగా, పిసిబి శ్రీలంకతో టోర్నమెంట్ హోస్టింగ్‌ను పంచుకోవాల్సి వచ్చింది. భారత జట్టు శ్రీలంకలో అన్ని మ్యాచ్‌లు ఆడింది. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ కూడా శ్రీలంక వెళ్లాల్సి వచ్చింది.




