
Hardik Pandya Promise: టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తరచుగా తన విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన కార్ల కారణంగా వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈసారి ఆయన ఒక గొప్ప కారణంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ముంబైలోని వాంఖడే స్టేడియంలో పనిచేసే దాదాపు 11 మంది గ్రౌండ్ స్టాఫ్ సభ్యులకు హార్దిక్ భారీ నజరానా ప్రకటించాడు.

సాధారణంగా ఐపీఎల్ లో మంచి పిచ్‌లు తయారు చేసినందుకు ఆటగాళ్లు బహుమతులు ఇస్తుంటారు. కానీ హార్దిక్ ఈ పది లక్షల రూపాయల చెక్కులను ఇచ్చింది కేవలం ఐపీఎల్ కోసం కాదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. కొన్ని నెలల క్రితం హార్దిక్ చేసిన ఒక వాగ్దానమే దీనికి ప్రధాన కారణం.

రిపోర్ట్స్ ప్రకారం టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో కఠినమైన ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో ఆయన అర్ధరాత్రి వరకు మైదానంలోనే గడిపేవాడంట. హార్దిక్ ప్రాక్టీస్ కోసం అక్కడి గ్రౌండ్ స్టాఫ్ తమ విధులు ముగిసినా కూడా అదనపు గంటలు వేచి ఉండి ఆయనకు కావాల్సిన సౌకర్యాలను కల్పించారంట. నెట్స్ సిద్ధం చేయడం నుంచి పిచ్ పర్యవేక్షణ వరకు సిబ్బంది హార్దిక్ కు ఎంతో సహకరించారంట.

ఆ సమయంలోనే హార్దిక్ వారందరికీ ఒక మాట ఇచ్చాడు. తాను తిరిగి ముంబైకి వచ్చినప్పుడు ఈ కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తానని ప్రాగ్దానం చేశాడు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత హార్దిక్ ఆ 11 మంది సిబ్బందిని పిలిచి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చెక్కును అందజేశాడు. తన ఎదుగుదలలో భాగమైన సామాన్య సిబ్బందిని గుర్తుంచుకుని మరీ సత్కరించడం పట్ల క్రీడా విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చెక్కులు అందుకున్న సిబ్బంది హార్దిక్ పాండ్యాతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు హార్దిక్ ను రియల్ హీరో అని అభివర్ణిస్తున్నారు. ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ చేసిన ఈ పని జట్టులో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. మార్చి 28న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో హార్దిక్ నాయకత్వంలోని ముంబై జట్టు ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.