
స్టార్ హీరోల తీరుతో టాలీవుడ్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్.. హీరో ఎవరైనా ఒక్కో సినిమా కోసం వాళ్లు తీసుకుంటున్న సమయం మాత్రం ఒక్కటే. తక్కువలో తక్కువ రెండేళ్ళకు పైగానే టైమ్ తీసుకుంటున్నారు. దానివల్ల ఇండస్ట్రీ దారుణంగా నష్టపోతుంది. ఎందుకంటే వీళ్ళ గ్యాప్ ఇండస్ట్రీ రెవిన్యూపై ప్రభావం చూపిస్తుంది.

స్టార్ హీరోలు రాకపోతే రాకపోయారు.. కనీసం మీడియం రేంజ్ హీరోలైనా రెగ్యులర్‌గా వస్తారనుకుంటే.. అదీ లేదు. పాన్ ఇండియన్ మత్తులో పడి ఒక్కో సినిమా కోసం కనీసం రెండేళ్లకు పైగానే తీసుకుంటున్నారు స్టార్ హీరోలు.

నాని, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు.వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోల సినిమాలేమో రెండు మూడేళ్లకోసారి వస్తున్నాయి.

50 కోట్ల మార్కెట్ ఉన్న హీరోల సినిమాలేమో వచ్చినా కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు. దాంతో అప్పుడప్పుడూ మెరిసే టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలే ఇండస్ట్రీకి ఊతమిస్తున్నాయి. కానీ అలాంటి సినిమాలు వచ్చేదెప్పుడో ఒక్కసారి మాత్రమే.. ఏడాదంతా అవే కాపాడాలంటే కష్టమే.

పాన్ ఇండియన్ మార్కెట్ మంచిదే.. కానీ దాని మత్తులోనే హీరోలందరరూ ఉంటే పరిస్థితులు ఇదిగో ఇలాగే దారుణంగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు. పెద్ద సినిమాలు రాక.. మీడియం రేంజ్ లేక.. చిన్న సినిమాలు ఆడక అగమ్యగోచరంగా మారింది టాలీవుడ్ పరిస్థితి. ఇది మారాలంటే హీరోలు వేగం పెంచాల్సిందే.. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేయాల్సిందే.