- Telugu News Photo Gallery Cinema photos Manchu's third generation Vishnu's son Avram will play the role in Kannappa's film
Kannappa: కన్నప్పతో మంచు వారి మూడోతరం.. కొడుకు, మనవడితో మోహన్ బాబు..!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమాపై రోజురోజుకీ ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విధానంతోనే ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తుంది కన్నప్ప. న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న కన్నప్ప టీమ్ ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి మేకర్లు మరో అప్డేట్‌ను ఇచ్చారు.
Praveen Vadla | Edited By: Prudvi Battula
Updated on: Jan 10, 2024 | 3:38 PM

ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించారు. ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్న విషయం వెల్లడైంది. మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు రాగా.. మంచు విష్ణు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మంచు విష్ణు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని 'కన్నప్ప'తో మొదలు పెట్టాడు. లెజెండరీ నటుడు మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది. న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ కన్నప్ప చిత్రం కోసం 90 రోజులు నిర్విరామంగా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై మంచు విష్ణు స్పందించాడు. "ఈ 'కన్నప్ప' సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబ మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం" అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.

కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే మంచు విష్ణు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పాడు. ఇప్పుడు తన కొడుకు ఎంట్రీపై స్పందించాడు. "అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను.

'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది" అని పేర్కొన్నాడు. మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో హేమాహేమీలు నటిస్తుండడంతో బాగా హైప్ వచ్చింది. ఇందులో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తోంది.





























