ఆ తర్వాత కొండవీటి దొంగ సినిమాకు హీరోయిన్‌గా మొదట శ్రీదేవిని అనుకున్నారు. నిర్మాత త్రివిక్రమరావు, దర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీదేవిని కలిసి, హీరోయిన్‌గా నటించమని అడిగారు. తమ కాంబినేషన్‌లో మొదలైన సినిమా కుదరలేదు కనీసం ఇదైనా చేద్దామని కోదండరామిరెడ్డి శ్రీదేవిని కోరారు. సినిమా పేరు అడిగినప్పుడు, కొండవీటి దొంగ అని చెప్పారు. శ్రీదేవి ఆలోచించుకుని చెబుతానని అన్నారు. అప్పుడు త్రివిక్రమరావు, ఆమె రికార్డ్ చేసిన పాటల్లో రెండు తమకు ఇవ్వమని, ఎంత ఖర్చయ్యిందో చెబితే ఇచ్చేస్తానని అడిగారు. అయితే, తాను పాటలను అమ్ముకునే రకం కాదని, ఆ పాటలెవరికీ ఇవ్వనని శ్రీదేవి స్పష్టం చేశారు. తర్వాత తల్లితో ఆలోచించుకుని కొండవీటి దొంగ సినిమాలో నటించడానికి అంగీకరించారు. శ్రీదేవి సొంత సినిమాలో ఆమె పాత్ర పేరు శ్రీజ. ఆ సినిమా ఆగిపోయినా, ఆ పేరు చిరంజీవి మదిలో నిలిచిపోయింది. కొన్నేళ్ల తర్వాత తన చిన్న కూతురికి శ్రీజ అని పేరు పెట్టుకున్నారు చిరంజీవి.