
ఇటు కీర్తి సురేష్.. అటు సాయి పల్లవి.. ఇద్దరూ ఇద్దరే. ఇంకా చెప్పాలంటే మోడ్రన్ మహా నటీమణులు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ.. పర్ఫార్మెన్సుతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకేసారి ఛలో బాలీవుడ్ అంటున్నారు. మరి అక్కడ కూడా కీర్తి, సాయి పల్లవి మాయ చేస్తారా..? గ్లామర్ షో చేయకుండా స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తారా..?

పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక.. సింగిల్ లాంగ్వేజ్‌కు పరిమితం కావడానికి హీరోయిన్లు కూడా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ముంబైలోనూ జెండా ఎగరేయాలని చూస్తున్నారు.

తాజాగా కీర్తి సురేష్, సాయి పల్లవి కూడా ముంబై ట్రైన్ ఎక్కేసారు. తెరీ రీమేక్‌లో వరుణ్ ధావన్‌తో కీర్తి జోడీ కడుతుంటే.. అమీర్ ఖాన్ తనయుడు జునైద్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సాయి పల్లవి.

జవాన్‌తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ.. ప్రస్తుతం హిందీలో నిర్మాతగా మారారు. తెరీని వరుణ్ ధావన్‌తో తనే నిర్మాతగా రీమేక్ చేస్తున్నారు. ఖలీస్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ మధ్యే మూవీ ఓపెనింగ్ జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో కీర్తి ఫోటో పోస్ట్ చేస్తే.. డేట్స్ ఇవ్వు అమ్మా అంటూ వరుణ్ ధావన్ రిప్లై ఇచ్చారు.. ఇది వైరల్ అవుతుందిప్పుడు. మరోవైపు సాయి పల్లవి చెల్లి పెళ్లి పనులతో కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నారు.

త్వరలోనే నాగ చైతన్య తండేల్ సెట్‌లో జాయిన్ కానున్నారు. దాంతో పాటు జునైద్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జపాన్‌లో జరగనుంది. తండేల్ షెడ్యూల్ తర్వాత అమీర్ కొడుకు సినిమాకు వెళ్లనున్నారు సాయి పల్లవి. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్ల జాతకాలు బాలీవుడ్‌లో ఎలా మారనున్నాయో చూడాలి.