Egg: ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..?
Boiled Egg Vs Omelette: గుడ్లు అత్యంత చౌకైన, సులభంగా అందుబాటులో ఉండే సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఆహారంలో గుడ్లు ఒక ముఖ్యమైన భాగం. అయితే కేవలం గుడ్లు తినడం మాత్రమే కాకుండా, మీరు వాటిని ఏ విధంగా వండుతున్నారు అనేదానిపైనే బరువు తగ్గడంలో వాటి ప్రభావం ఆధారపడి ఉంటుందని కొత్త పరిశోధన వెల్లడిస్తోంది.
Updated on: Nov 13, 2025 | 7:08 AM

అమెరికన్ కెమికల్ సొసైటీ యొక్క జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ఈ విషయంపై కీలక వివరాలను అందించింది. పరిశోధన ప్రకారం.. గుడ్లు ఉడికించే విధానం, గుడ్డులోని ప్రోటీన్ శరీరం ఎలా గ్రహిస్తుంది, జీర్ణం చేస్తుంది అనేదానిని నిర్ణయిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు గుడ్లను ఏ పద్ధతిలో వండుతున్నారనేది చాలా ముఖ్యం.

గుడ్డును ఉడకబెట్టినప్పుడు, అదనంగా నూనె లేదా కొవ్వు పదార్థాలు వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఉడికించిన గుడ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ నిర్మాణం స్థిరంగా ఉండటం వలన, శరీరం దానిని సులభంగా ఉపయోగించుకోగలుగుతుంది. త్వరగా జీర్ణమవుతుంది.

ఉడకబెట్టిన గుడ్లు వ్యాయామం తర్వాత కండరాలు కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా గుడ్డులో ఉండే అధిక ప్రోటీన్ కారణంగా కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల తరచుగా ఆకలి వేయదు. దాంతో అనవసర స్నాక్స్ లేదా అధిక ఫుడ్ తినకుండా ఉంటారు.

ఆమ్లెట్ లేదా వేయించిన గుడ్లను చేసేటప్పుడు, నూనె, నెయ్యి లేదా వెన్న వంటి కొవ్వు పదార్థాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దీని కారణంగా గుడ్డుకు అదనపు కేలరీలు యాడ్ అవుతాయి. దీనితో పాటు కొంతమంది ఆమ్లెట్‌లో చీజ్, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి కలుపుతారు. ఇది కొవ్వు, సోడియం పరిమాణాన్ని మరింత పెంచుతుంది. తద్వారా బరువు తగ్గే ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతుంది.

బరువు తగ్గడానికి మీ డైట్‌లో గుడ్లను చేర్చుకోవాలని మీరు భావిస్తే.. ఉడికించిన గుడ్లు తీసుకోవడమే అత్యంత ప్రయోజనకరం అని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి తక్కువ కేలరీలతో అధిక ప్రోటీన్‌ను అందిస్తాయి.




