- Telugu News Photo Gallery Barsala Function For Calf Inviting All The Villagers And Arranging Dinner In Karimnagar
Karimnagar : అందరినీ ఆకట్టుకున్న లేగదూడ బారసాల.. బంధుమిత్రుల ఆశీస్సులతో ఘనంగా నామకరణోత్సవం..
లెగదూడకు నామకరణం అట్టహాసంగా నిర్వహించారు దాని యజమాని. లేగదూడ పుట్టిన 21 రోజుల తర్వాత పండుగల నిర్వహించిన బారసాల వేడుకకు బంధుమిత్రులను కూడా ఆహ్వానించారు. అందంగా అలంకరించిన ఊయలలో వేసి ఆ బుల్లి లేగదూడకు ఆశీస్సులు అందజేశారు తరలి వచ్చిన బంధుమిత్రులు. ఈ అద్భుత, అందమైన వేడుక కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Updated on: Mar 28, 2024 | 11:07 AM

కరీంనగర్ జిల్లాలో గోమాత నామకరణ వేడుక ఘనంగా జరిగింది.. గోవును దేవత గా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం.. అలాంటి.. గోమాత కు నామకరణం చేసి భక్తి భావాన్ని చాటుకున్నారు ఓ దంపతులు. ఈ నామకరణ వేడుక.. ఎక్కడ జరిగింది..? బారసాల సందర్భంగా ఆ యజమాని ఏయే కార్యక్రమాలు నిర్వహించారో తెలిస్తే ఔరా అనాల్సిందే..!

21రోజుల పండుగ సందర్బంగా గో మాతను అందంగా ముస్తాబు చేసి.. నూతన బట్టలు వేసి.. పసుపు, కుంకుమ తో అలంకరణ చేశారు. ఈ నామకరణ వేడుకకు సుమారు 500 మంది హాజరయ్యారు. లేగదూడకు రాధారాణి అనే నామకరణం చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

కరీంనగర్ కు చెందిన గౌరీశెట్టి మునిందర్, అనురాధ దంపతులకు గోవులు అంటే ఎంతో ప్రేమ.. వారు కూడా గోవులు పెంచుకుంటున్నారు. అయితే.. ఇటీవల ఆవు లేగదూడ కు జన్మనిచ్చింది. లేగ దూడ జన్మించడం తో కుటుంబ సభ్యులు సంబరాలు నిర్వహించుకున్నారు. 21 రోజులు తరవాత నామకరణ వేడుకను నిర్వహించారు.

లేగదూడను ఊయలలో వేసి జోల పాట పాడారు. భక్తి పాటలు పాడారు. ఈ లేగ దూడ నామకరణ వేడుక చూసి స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నామకరణం తరవాత విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. బారసాల వేడుకకు వచ్చిన బంధువులు, మిత్రులు, గ్రామస్తులకు తులసీ మొక్కలను బహుమతిగా అందజేశారు.

ఇంట్లో గోవులు ఉండటం శుభం జరుగుతుందని ఈ దంపతులు చెబుతున్నారు.. వారు పెంచుకుంటున్న ఆవుదూడలను తమ కుటుంబ సభ్యులు గా చూసుకుంటామని అంటున్నారు.. అందుకే ఆవుదూడ బారసాల వేడుకను ఒక రోజంతా నిర్వహించారు. తమ ఇంటిని కూడా అందంగా అలంకరించారు. ఈ రాధా రాణి చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు.
