
కావాల్సిన పదార్థాలు : మటన్, కందిపప్పు, శనగపప్పు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మటన్ మసాలా, సోరకాయ, చింత పండు, జీలకర్ర పొడి, కారం, కరివేపాకు, ఆవాలు, నూనె, ఉల్లిపాయలు

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కంది పప్పు, శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే చింత పండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి.

దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, యాలకులు, పచ్చి మిర్చీ , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. వేగి బంగారు రంగు వచ్చిన తర్వాత అందులో మటన్ వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మటన్ 70 శాతం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగ పప్పు, కంది పప్పు వేసి మళ్లీ 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు దాల్చా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా సోరకాయ తీసుకొని శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి, అందులో నూనె పోసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, సోరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చింత పండు రసం, ఉప్పు కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి, గ్లాస్ వాటర్ పోసి నీరు బాగా మరిగి, సోరకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికేలా చూసుకోవాలి.

ఇప్పుడు సోరకాయ ముక్కలు ఉడికి, రసం సగం గ్లాస్‌కి వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్, పప్పుల మిశ్రమాన్ని వేసి, మరో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర, పూదీనా వేయాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ దాల్చా రెడీ.