Kishan Reddy: కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా.. తెలంగాణ నుంచి బీజేపీ సర్కారులో కేబినెట్ ర్యాంక్ పొందిన తొలి నేత

|

Jul 07, 2021 | 9:57 PM

రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి.. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు...

Kishan Reddy: కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా.. తెలంగాణ నుంచి బీజేపీ సర్కారులో కేబినెట్ ర్యాంక్ పొందిన తొలి నేత
Kishan Reddy
Follow us on

Central Minister Kishan Reddy Profile: తెలంగాణ బీజేపీలో సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్‌ మంత్రిగా ఎదిగారు కిషన్‌రెడ్డి. హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఇవాళ మోదీ మంత్రివర్గంలో ప్రమోషన్‌ లభించింది. తెలంగాణ బీజేపీ నుంచి కేబినెట్‌ మంత్రి పదవి లభించడం ఇదే తొలిసారి. ఇంతవరకూ తెలంగాణ బీజేపీ నేతలకు సహాయ మంత్రి పదవులే లభించాయి. సహాయ మంత్రిగా చురుకైన పాత్ర నిర్వహించిన కిషన్‌రెడ్డి పనితీరును మెచ్చిన ప్రధాని మోదీ ఆయనకు నేడు మరింత ఉన్నత హోదా కల్పించారు.

1960లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి.. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వరుసగా రెండోసారి రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాధన కోసం 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో బీజేపీ పోరుయాత్ర నిర్వహించారు.

2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. ఫలితంగా తెలంగాణ నుంచి బీజేపీలో తొలి కేబినెట్ మంత్రిగా నిలిచారు కిషన్‌రెడ్డి.

కిషన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కృషి, దీక్ష, పట్టుదల, నేర్పరితనం, ఓర్పు, స్పష్టమైన వైఖరితో ఉన్న వ్యక్తిత్వమే కిషన్‌రెడ్డిని ఆ స్థాయికి తీసుకు వెళ్లింది. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాసం ఉంటూనే పార్టీ కార్యక్రమాలతోపాటు,  చదువునూ కొనసాగించారు కిషన్ రెడ్డి. ఇబ్రహింపట్నంలో ఉన్నత పాఠశాల.. పాతపట్నంలో ఇంటర్‌.. కేంద్ర ప్రభుత్వం సంస్థ సీఐటీడీలో టూల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు.

Read also: Adulterated oil : టీవీ9 ఎఫెక్ట్ : గుట్టు చప్పుడు కాకుండా నడిపేస్తోన్న కల్తీ నూనెల దందాలపై ఉక్కుపాదం