RAHUL GANDHI: రైతాంగానికి సందేశం.. పార్టీ వర్గాలకు వార్నింగ్.. కీలకాంశాలపై స్పష్టతనిచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆశించింది తన పర్యటన తొలిరోజే. తమ అధినేత ఓసారి వచ్చి ప్రసంగిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహమే కాదు.. ప్రజల్లో తమ సత్తా ఏ మేరకు మిగిలి వుందో కూడా తేలుతుందని భావించారు టీ.కాంగ్రెస్ నేతలు.

RAHUL GANDHI: రైతాంగానికి సందేశం.. పార్టీ వర్గాలకు వార్నింగ్.. కీలకాంశాలపై స్పష్టతనిచ్చిన రాహుల్ గాంధీ
Rahul Gandhi
Follow us
Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Updated on: May 06, 2022 | 8:31 PM

RAHUL GANDHI GIVEN MESSAGE TO FARMERS WARNING TO PARTY LEADERS: ఎస్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆశించింది తన పర్యటన తొలిరోజే. తమ అధినేత ఓసారి వచ్చి ప్రసంగిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహమే కాదు.. ప్రజల్లో తమ సత్తా ఏ మేరకు మిగిలి వుందో కూడా తేలుతుందని భావించారు టీ.కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ భావించారు. రైతాంగానికి స్పష్టమైన సందేశం ఇప్పించాలని తలపెట్టారు. సరిగ్గా అదే జరిగింది రాహుల్ తొలిరోజు పర్యటనలో. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో తొలిరోజే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ప్రస్ఫుటించింది. తొలిరోజు కేవలం ఓరుగల్లు సభకే రాహుల్ గాంధీ పరిమితమైనా.. తన ప్రసంగం ద్వారా.. రైతు కుటుంబాలను పరామర్శించడం ద్వారా ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీ తరపున భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ఓరుగల్లు సభలో ప్రసంగించారు. కీలకాంశాలను టచ్ చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీ ప్రచార అస్త్రాలను ప్రకటించారు. ముఖ్యంగా రైతు సంఘర్షణ సమితి అనే పేరిట నిర్వహించిన సభా వేదిక నుంచి తెలంగాణ రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ యత్నించారు. ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతులకు ఉపయోగపడే అంశాలను ప్రస్తావించారు. కర్షకులకు రుణభారాన్ని తగ్గించేందుకు రెండు లక్షల రూపాయల వరకు రైతురుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి.. కనీస మద్దతుధర ఇస్తామని, 15 వేల రూపాయల మేరకు ప్రతీ రైతుకు నేరుగా నగదు సాయమందించేలా వరంగల్ డిక్లరేషన్ అంశాలను రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తాము ప్రకటించింది కేవలం డిక్లరేషన్ మాత్రమే కాదని.. ఇది పార్టీ తరపున ఇస్తున్న గ్యారెంటీ ఫారమ్ అని ఉద్ఘాటించారు. తమ డిక్లరేషన్‌ను రాష్ట్రంలో వున్న ప్రతి రైతు చదవాలని, ప్రతీ అక్షరానికి కాంగ్రెస్ పార్టీ తరపున తాను గ్యారెంటీ ఇస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణ రైతులు ఆశించింది తాము సాధించుకున్న స్వరాష్ట్రంలో జరగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేస్తామన్నారు.

రైతులను, ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించిన రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులకు కూడా చాలా స్పష్టంగా ఓ అంశాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టం చేసిన వారితోను, రాష్ట్రాన్ని లూఠీ చేసిన వారితోను, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి ఎన్నికల ఒప్పందం వుండదని తేల్చేశారు. ఏ పార్టీతో అయినా పొత్తు వుంటుందని ఏ కాంగ్రెస్ నేత అయినా మాట్లాడితే వారిని పార్టీ నుంచి వెంటనే బహిష్కరిస్తామని హెచ్చరించారు. పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా పొత్తు గురించి మాట్లాడితే పార్టీ నుంచి వెలివేస్తామని తేల్చేశారు. టీఆర్ఎస్ పార్టీతో ఎవరైనా పొత్తు కావాలని కోరుకుంటే వారు కాంగ్రెస్ పార్టీలో వుండవద్దని, అయితే గులాబీ దళంలో చేరాలని, లేదా బీజేపీలో చేరిపోవచ్చని కూడా సలహా ఇచ్చారు రాహుల్ గాంధీ. సొంత బలం మీద నమ్మకం లేని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని చెప్పేశారు. టీఆర్ఎస్ పార్టీతో విధానపరమైన విభేదాలున్నాయి.. నేరుగా ఆ పార్టీని ఓడించి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదేసమయంలో తెలంగాణలో ప్రధానపోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే వుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను, ఉద్యోగులను నష్టం చేసిన, అవినీతికి పాల్పడిన వారిని వదిలేది లేదని రాహుల్ గాంధీ హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారి వెంట పడేందుకు త్వరలో తమ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం పని చేస్తుందని అధికార టీఆర్ఎస్ పార్టీకి వార్నింగిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున కష్టపడిన వారికి, పని చేయని వారికి టిక్కెట్లివ్వబోనని చెబుతూ పార్టీ నాయకులకు కచ్చితమైన సందేశం ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాటం చేయని ఏ వ్యక్తికి టిక్కెటిచ్చే ప్రసక్తే వుండదని చెప్పడం ద్వారా పార్టీ వర్గాలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ విషయంలో ఎంత సీనియర్ నేతలైనా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందన్న సందేశాన్ని పదేపదే చెప్పుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. తెలంగాణ అభివృద్ధికి తన అవసరం ఎప్పుడు వచ్చినా తరలివచ్చేందుకు ప్రజల పక్షాన నిలబడేందుకు తాను సిద్దమని చెప్పుకున్నారు రాహుల్. తెలంగాణ అంశాలను ఏ మేరకు ప్రస్తావించారో అదే స్థాయిలో పార్టీ విధాన పరమైన అంశాలను కూడా బహిరంగ సభ వేదికగా వెల్లడించారు. ఏ పార్టీతోను పొత్తు వుండబోదని తేల్చేశారు. అదేసమయంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం వుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ప్రతీ చట్టానికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిదంటూ ఆ రెండు పార్టీల మధ్య అవగాహనకు అదే నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ తన తొలిరోజు పర్యటనలో వచ్చే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లయ్యింది. ఆయన ప్రసంగం అదే ధోరణిలో కొనసాగించడం విశేషం. రైతుల కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ తన నెక్స్ట్ పర్యటనలో ఆదీవాసీల ప్రధాన సమస్య అయిన రిజర్వేషన్ డిమాండ్‌పై స్పష్టత ఇస్తానని చెప్పారు. రైతులను ఆకట్టుకునేందుకు రెండు లక్షల రూపాయల మేరకు రుణ మాఫీ, కనీస మద్దతు ధర, పదిహేను వేల రూపాయల డైరెక్టు నగదు సాయం చేస్తానంటూ ఎన్నికల ప్రచారాంశాలను ప్రకటించేశారు రాహుల్ గాంధీ. రాష్ట్ర రైతాంగాన్ని ఆకట్టుకునే అంశాలను వెల్లడించారు. అదేసమయంలో పార్టీ నేతలకు రెండంశాలపై ప్రజల సమక్షంలో క్లారిటీ ఇచ్చారు. పొత్తుపై తేల్చేశారు. కష్టపడితేనే పార్టీ టిక్కెట్ అని కుండబద్దలు కొట్టారు. మొత్తానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛనివ్వనున్నట్లు రాహుల్ పరోక్షంగా హింట్ ఇచ్చారు.