AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TELANGANA POLITICS: తెలంగాణాలో రాజకీయ కలకలం.. యాత్రల జోరు.. అధికార పార్టీ ఎదురు దాడి.. నిండువేసవిలో రాజకీయ పండగ

గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తమకున్న ఎమ్మెల్యేలను కోల్పోయి చతికిలా పడ్డా.. తిరిగి నిలబడి కలబడేందుకు సమాయత్తమవుతోంది. టీపీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్రాలు రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతూ పోరాట బాట పట్టారు.

TELANGANA POLITICS: తెలంగాణాలో రాజకీయ కలకలం.. యాత్రల జోరు.. అధికార పార్టీ ఎదురు దాడి.. నిండువేసవిలో రాజకీయ పండగ
కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి
Rajesh Sharma
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 14, 2022 | 3:15 PM

Share

TELANGANA POLITICS HEATING UP POLITICAL YATRAS ON FULL SWING: తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా చురుకుగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా ప్రతివ్యూహాలు రచిస్తున్న ప్రతిపక్ష పార్టీలు యాత్రల పేరిట జనం మధ్యకు వెళుతున్నారు. రాష్ట్రంలో అనూహ్యంగా బలం పెంచుకున్న భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళుతోంది. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అటు కాంగ్రెస్ నేతలు కూడా వివిధ యాత్రలు, పోరాటాల పేరిట ప్రజలతో మమేకమవుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తామేమాత్రం తక్కువ తినలేదన్నట్లు ఎదురు దాడి చేస్తోంది. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని ఆధారం చేసుకుని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేంద్ర ప్రభుత్వంపైనా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపైనా విరుచుకు పడింది తెలంగాణ రాష్ట్ర సమితి. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రైతాంగాన్ని విస్మరిస్తోందని, కార్పొరేట్ వ్యవసాయం పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు మోదీ సిద్దమవుతున్నారని కేసీఆర్ ఘాటైన ఆరోపణలు చేశారు. అంతకు ముందు తెలంగాణలోని జాతీయ రహదారులను దిగ్బంధం చేసిన గులాబీ శ్రేణులు కేంద్రంపై పోరుబాటను తీవ్రతరం చేశారు. దానికి కొనసాగింపుగా ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించి, రైతుల సంఘాల సమాఖ్య కన్వీనర్ రాకేశ్ టికాయత్‌ను ఆహ్వానించింది టీఆర్ఎస్. కేంద్రంలో సమగ్ర వ్యవసాయ విధానం అమల్లోకి తెచ్చే దాకా తమ ఐక్య పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఏప్రిల్ 12వ తేదీన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్ర మంత్రులు జిల్లాల పర్యటనలను ముమ్మరం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర విధానాన్ని తప్పు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో బలమైన పార్టీగా ఎదుగుతున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. జాతీయ నేతలు అమిత్ షా, జెపీ నడ్డాల వ్యూహాలకు అనుగుణంగా తరుణ్ చుగ్, మురళీధరన్ వంటి ఇంఛార్జుల మార్గదర్శకత్వంలో తెలంగాణ బీజేపీ శ్రేణులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సవాళ్ళకు ప్రతిసవాళ్ళు, వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తూ టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జోరును ప్రదర్శిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగినట్లుగా వుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గద్వాల జిల్లాలోని అయిదో శక్తి పీఠం ఆలంపూర్ జోగులాంబ ఆలయం దగ్గర ప్రారంభమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, నిరుద్యోగులను మోసం చేస్తోందని, ఉద్యోగులను సమయానికి జీతాలివ్వకుండా వేధిస్తోందని ప్రజా సంగ్రామ యాత్రలో కమలం నేతలు ఆరోపిస్తున్నారు. జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లోని పది నియోజకవర్గాలు కవర్ చేస్తూ మొత్తం 105 గ్రామాల గుండా కొనసాగనున్నది. యాత్ర ప్రారంభానికి బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ ఛుగ్ రాగా.. యాత్ర కొనసాగినన్ని రోజులు జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా పాల్గొనేలా ప్లాన్ చేశాయి కమలం శ్రేణులు. మే 14వ తేదీ వరకు అంటే మొత్తం 31 రోజులు నిండు వేసవిలో కొనసాగనున్న ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ మొత్తం 387 కిలోమీటర్ల మేరకు కాలినడకన పయనించనున్నారు. మే 14వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగిసేలా ప్లాన్ చేశారు. సంగ్రామ యాత్రకు కనీసం ఒకసారైనా అమిత్ షాని రప్పించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతోపాటు కేసీఆర్‌కు సవాల్ విసిరేలా బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తమకున్న ఎమ్మెల్యేలను కోల్పోయి చతికిలా పడ్డా.. తిరిగి నిలబడి కలబడేందుకు సమాయత్తమవుతోంది. టీపీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్రాలు రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతూ పోరాట బాట పట్టారు. ధర్నాలు నిర్వహిస్తూనే గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో వున్న వారికి ఫిర్యాదులు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తాజాగా గవర్నర్ తమిళిసైని రేవంత్ రెడ్డి సారథ్యంలో కలిసిన కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ మాటలు నమ్మి వరి వేయక నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి వేయొద్దని కేసీఆర్ పిలుపునివ్వడం, అదే అంశాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల చాలా మంది రైతులు ఏం పంట వేయాలో అర్థం కాక అసలు పంట వేయకుండా వుండిపోయారని, అలాంటి వారికి ఎకరాకు 15 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని టీ.కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన విధానం వల్ల ధాన్యం సేకరణ కేంద్రాల ప్రారంభాల్లో జాప్యం జరిగిందని, అందువల్ల చాలా మంది రైతులు అప్పుల బాధ భరించలేక తక్కువ ధరకే ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలా నష్ట పోయిన రైతులకు నష్టపరిహారంగా క్వింటాలుకు 600 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, వరి ధాన్యం విక్రయించేందుకు వెయిట్ చేస్తూ కుప్పలపై మరణించిన, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు. ఇవే డిమాండ్లతో కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని ముఖ్య కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. భట్టి యాత్రకు కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షాలు కూడా జత కల్వడం భవిష్యత్తు రాజకీయ పొత్తులపై ఊహాగానాలకు తెరలేపింది. ఏప్రిల్ 14వ తేదీన ఖమ్మం జిల్లా బోనకల్ ఏరియాలో భట్టి పాదయాత్ర కొనసాగుతుండగా.. అందులో తెలుగుదేశం, వామపక్షాల నేతలు కూడా పాల్గొన్నారు. తమ తమ పార్టీల కండువాలను భట్టి మెడలో వేసి.. సంఘీభావం ప్రకటించారు. దాంతో వచ్చే ఎన్నికల్లోను 2018 ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ కూటమిలోనే టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు కొనసాగే సంకేతాలు వెలువడ్డాయి. మొత్తమ్మీద తెలంగాణలో రాజకీయ పార్టీల కదలికలు చురుకుగా మారడంతో మండు వేసవిలో నిండు పండగ వాతావరణం కనిపిస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.