AP Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన మాజీ మంత్రి అనిల్.. నెల్లూరు జిల్లాలో రాజకీయ సెగలు
Nellore Politics: శత్రువుకు శత్రువు మిత్రుడు. ఇది అందరికీ తెలిసిన పాత సామెతనే. కాకపోతే రాజకీయాల్లో ఇది బాగా పాపులర్. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనూ ఇదే హాట్ టాపిక్.
Nellore Political News: శత్రువుకు శత్రువు మిత్రుడు. ఇది అందరికీ తెలిసిన పాత సామెతనే. కాకపోతే రాజకీయాల్లో ఇది బాగా పాపులర్. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనూ ఇదే హాట్ టాపిక్. అదీ రాజకీయ ప్రత్యర్థుల మధ్య కాకుండా.. అధికార వైసీపీలోనే ఈ చర్చ జరుగుతోంది. మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల్లో ఏ ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేదన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్న టాక్. గతం గత: అనుకున్నారో.. మరేదైనా రాజకీయ కారణమో కానీ ఇప్పుడు కోటంరెడ్డి, అనిల్ తమ విభేదాలను పక్కనబెట్టి ఒకటయ్యారు. స్వయంగా అనిల్ యాదవ్ కోటంరెడ్డిని వెళ్లి కలవడం ఆసక్తిగా మారింది. వీరి భేటీపై నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే జగన్ కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న కాకానితో కోటంరెడ్డికి, అనిల్‌కు పడదు. ఇటీవల కాకాని తనకు ఏ రకంగా సహకరించారో దానికి డబుల్ సహకరిస్తానంటూ మాజీ మంత్రి హోదాలో పెట్టిన తొలి మీడియా సమావేశంలో అనిల్ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు కాకాని నుంచి సరైన సహకారం అందకపోవడంతో ఆయన ఇలా స్పందించినట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మాజీ మంత్రి అనిల్ కలవడం ఆసక్తిగా మారింది. కోటంరెడ్డి చేస్తున్న గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో అనిల్ పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధరన్న నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని అనిల్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి మూడోసారి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో శ్రీధరన్నకు సంఘీభావం తెలిపేందుకే తాను ఆయనతో కలిసినట్లు తెలిపారు.
అనిల్ చెబుతున్నది ఎలా ఉన్నా.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో ఆయన భేటీ కావడం వైసీపీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశమయ్యింది. జిల్లాలో మంత్రి కాకాని పెత్తనం చేయకుండా చెక్ పెట్టేందుకు అనిల్, శ్రీధర్ రెడ్డి కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరి కొత్త మంత్రి కాకాని వీరితో రాజీ కుదుర్చుకుంటారో? కయ్యానికి కాలుదువ్వుతారో? వేచి చూడాల్సింది. పైకి ఏమీ లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నా.. లోపల ఏదో జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం నెల్లూరు జిల్లాలో రాజకీయ సెగలు రేపుతోంది.
Also Read..
Hyderabad: తక్కువ ధరలో, సురక్షిత ప్రయాణానికి కేరాఫ్ MMTS సేవలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్