Polavaram Project: పోలవరం సాకారం దిశగా ‘మేఘా’ వేగంతో పనులు

|

Jul 13, 2021 | 11:29 AM

పోలవరం ప్రాజెక్ట్ సాకారం దిశగా అడుగులు వేస్తోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్..

Polavaram Project: పోలవరం సాకారం దిశగా మేఘా వేగంతో పనులు
Polavaram Project
Follow us on

Megha Engineering And Infrastructures Limited: పోలవరం ప్రాజెక్ట్ సాకారం దిశగా అడుగులు వేస్తోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ సంస్థ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ అధికారుల సహకారం, పర్యవేక్షణతో పనులు ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి.

ఒక వైపు భారీ వరదలు, మరోవైపు కలవరపెడుతున్న కరోనా.. అయినా కానీ, పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో ఊపందుకున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు ప్రభుత్వం, అధికారుల సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలను మించి పనులు జరుగుతున్నాయి.

Polavaram

పోలవరం పనులు మేఘా సంస్థ చేపట్టిన తరువాత వేగం పుంజుకుంది. సీఎం ఆదేశాలు, అధికారుల సహకారం, ఎంఈఐఎల్ సంస్థ వేగం వెరశి పోలవరం నిర్మాణం ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. ఏప్రిల్ 2020 నుంచి 2021 మార్చి వరకు 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేఘా ఇంజనీరింగ్ 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని చేసి తన సత్తాను చాటి చూపించింది. ముఖ్యంగా గత ఏడాది మే, జూన్, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్ పని జరిగింది.

Polavaram Gates

గత మే నెలలో కరోనాను తట్టుకొని 53 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 85,300 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. అలాగే జూన్-2020లో 70 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రికార్డు స్థాయిలో 1,20,100 క్యూబిక్ మీటర్ల పూర్తి చేసింది. ఫిబ్రవరి 2021లో 47 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని టార్గెట్ పెట్టుకుని 83 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేసింది. ఇక ఈ ఏడాది మార్చిలో 68,600 క్యూబిక్ మీటర్ల లక్ష్యం పెట్టుకోగా 81,200 క్యూబిక్ మీటర్ల పనులు చేసి అబ్బురపరుస్తోంది. ఇలా ప్రతి నెలా అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ సాగుతోంది.

Polavaram Project

ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం తుది రూపు దాల్చింది. కాంక్రీట్ పనులు, గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఇప్పటి వరకు స్పిల్ వేలో 2,98034 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసింది. ఇక స్పిల్ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లకు గానూ 42 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. 12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది.

అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ లకు గానూ 24 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 48 గేట్లను ఒకేసారి ఎత్తవచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను నిర్వహించవచ్చు. ఇప్పటికే 42గేట్లను ఎత్తి ఉంచి వరదనీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. పోలవరం స్పిల్ వేలో 10 కి 10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరికతోపాటు, వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్ సిలిండర్ల పనులు పూర్తయ్యాయి. వీటిని ఆపరేట్ చేయడానికి అమర్చే 10 పవర్ ప్యాక్ లకు గానూ పదీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10 రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తి ఉంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

పోలవరం అప్రోచ్ ఛానెల్ మట్టితవ్వకం పనులు రికార్డు స్దాయిలో చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.116 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పనులు చేయాల్సి ఉండగా కేవలం 60 రోజుల్లోనే దాదాపు 70లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసి గోదావరి నదికి అడ్డుకట్ట వేయడంతో అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ లోకి గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ఇలా దాదాపు 6.6 కి.మీ గోదావరి నదిని ఎడమ వైపు నుండి కుడివైపు మళ్ళించి ఇంజనీరింగ్ అద్భుతం సృష్టించింది.

వరదలను సైతం తట్టుకొని స్పిల్ ఛానెల్లో ఇప్పటి వరకు 241826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో పాటు, దాదాపు 33,39,809 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది మేఘా సంస్థ. పోలవరంలో అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 5,72,087క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి.

Polavaram Gates

ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం పూర్తి స్దాయి ఎత్తు దాదాపు 42.5మీటర్లకు గానూ ఇప్పటికే దాదాపు 39 మీటర్లు నిర్మాణం పూర్తి అయింది.త్వరలోనే పూర్తి స్దాయి ఎత్తులో నిర్మించేందుకు భారీ ఎత్తున పనులు రేయింబవళ్ళూ సాగుతున్నాయి. ఎంత భారీ ఎత్తున వరద వచ్చినా తట్టుకునే విధంగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఎగువ కాఫర్ డ్యాంలో దాదాపు 15,65,357 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం సేఫ్ జోన్లో ఉండే విధంగా నిర్మాణం పూర్తి అయింది.

అదేవిధంగా దిగువకాఫర్ డ్యాం నిర్మాణం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దీని పూర్తి స్దాయి ఎత్తు దాదాపు 30మీటర్లకు గానూ ఇప్పటికే దాదాపు 21మీటర్ల ఎత్తుకు పూర్తి చేయడం జరిగింది. ప్రాజెక్ట్ గ్యాప్-2 లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) కూడా కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు. ఇక్కడ రాతినేల ఎక్కడో లోతుగా ఉండడం వల్ల నిర్మాణ పని పటిష్టంగా ఉండడం కోసం కేంద్ర జలసంఘం ఆధీనంలోని డిడిఆర్పి (డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్) సూచనల మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక పనులన్నీ చకచకా సాగుతున్నాయి.

Polavaram Project

2 ఏళ్లలో పోల‌వ‌రం ప‌రుగులుపెట్టిందిలా..

* 2019 న‌వంబ‌ర్ 8న MEIL చేతికి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు
*21-11-2019 లో ప్రాజెక్టు స్పిల్ వే ”O” బ్లాకు వ‌ద్ద కాంక్రీట్ ప‌నులు
* ఫిబ్రవరి -17-2020 న గడ్డర్ల నిర్మాణ పనులు
* 2020 జూలై – 6 స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల అమరిక మొద‌లు
* 2020 ఆగష్ట్‌ – 19న వ‌ర‌దలోనూ స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు
* 2020 సెప్టెంబర్ 09న స్పిల్ వే బ్రిడ్జి శ్లాబ్ కాంక్రీట్ ప‌నులు ప్రారంభం
* 2020 నవంబర్-12 నాటికి 2లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి
* 2020 డిసెంబర్-17న స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక పనులు
* 2021 ఫిబ్రవరి-11న‌ నాటికి స్పిల్‌వే లోని 52 పిల్లర్లు 52మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తి
* 2021 ఫిబ్రవరి-20న స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమర్చడం పూర్తి
* 2021 ఫిబ్రవరి-22న స్పిల్ వే రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక‌ పనులు
* 2021 ఫిబ్రవరి-26న స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తి
* 2021 మార్చి-25న స్పిల్ వే రేడియల్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం.
* 2021 మే-27న ఎగువ కాఫర్ డ్యాం అన్ని గ్యాప్‌ల‌ను పూడ్చి నదికి అడ్డుకట్ట
* 2021 జూన్ 11న అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే వైపు గోదావరి మ‌ళ్లింపు
* 2021 జూన్-23న రేడియల్ గేట్లు అమర్చిన తరువాత స్పిల్ వే నుండి గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

Read also: Manda Krishna: కత్తి మహేష్ మృతిపై సంచలన అనుమానాలు లేవనెత్తిన మందకృష్ణ మాదిగ