రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు వివరణ కోరిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, తదుపరి విచారణ 24కు వాయిదా
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో ఉల్లంఘలనపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్..
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో ఉల్లంఘలనపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారంటూ పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం విచారణ చేపట్టింది. సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు జరపవద్దని ఎన్జీటీ జస్టిస్ రామకృష్ణన్, సైబల్‌దాస్ గుప్తా నేతృత్వంలోని చెన్నై ధర్మాసనం గతంలోనే ఆదేశించింది. ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయంటూ పిటిషనర్ మరోసారి ఎన్జీటీని ఆశ్రయించి, కంటెప్ట్ (ధిక్కార) పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాసిన అంశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో సవాలు చేయాల్సింది పోయి కేంద్ర పర్యావరణ శాఖకు అనుమతులు అవసరం లేదని లేఖ రాయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు.
ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని వాదించారు. తాము దాఖలు చేసిన కోర్టు ఉల్లంఘన కేసుపై నాలుగవసారి ఏపీ ప్రభుత్వం వాయిదా కోరుతోందని ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, ఈ విషయంపై తెలంగాణ నీటి పారుదల శాఖ కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు గత ఏడాది డిసెంబర్లో ఫిర్యాదు కూడా చేసిందని తెలిపారు. కృష్ణా బోర్డ్ ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు ఆపడం లేదని రాంచందర్ రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకట రమణి సుప్రీంకోర్టు కేసుల్లో బిజీగా ఉన్నందున కేసు విచారణ వాయిదా వేయాలని మరో న్యాయవాది మాధురి రెడ్డి కోరారు. తరచుగా వాయిదా కోరడాన్ని న్యాయవాది శ్రావణ్ కుమార్ తప్పుబట్టారు. అన్ని పక్షాల వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖపై వివరణ ఇవ్వాలని కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.