MISSION DELHI: ఉద్ధవ్, పవార్‌లతో కేసీఆర్ అత్యవసర భేటీకి అసలు మతలబు అదేనా..?

|

Feb 22, 2022 | 1:22 PM

జాతీయ రాజకీయాలను మార్చేసే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ పెద్ద పోరాటమే మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదటి పర్యటన ముంబాయితో మొదలుపెట్టారు. ముంబాయిలో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో వరుస భేటీలు నిర్వహించారు.

MISSION DELHI: ఉద్ధవ్, పవార్‌లతో కేసీఆర్ అత్యవసర భేటీకి అసలు మతలబు అదేనా..?
Kcr, Uddhav, Pawar
Follow us on

CM KCR Mission Delhi: ఇంట గెలిచినం..ఇక రచ్చగెలవాలే..అన్న తీరుగా తెలంగాణ(Telangana) సమాజాన్ని సంసిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. జనం అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల(National Politics)పై.. భారతీయ జనతా పార్టీ(BJP) నుంచి కూడా గట్టిగానే రీసౌండు వస్తోంది. కేసీఆర్ కొత్తగా బంగారు బారతదేశం అంటూ కొత్త నినాదం అందుకంటే.. కేసీఆర్ అవినీతి బాగోతం అంటూ కమలం కొత్త నిందారోపణను సిద్ధం చేసింది. అంతేకాదు.. ఇన్నాళ్లు గుట్టుగా దాగున్న కేసీఆర్ గుట్టు.. గట్టుమీద పెట్టబోతున్నామని.. గట్టి హెచ్చరికనే చేస్తోంది కమలం.. ఇన్ని దినాలు.. దోచుకున్నడు కదా..దాన్ని దాచుకునే ప్లాన్‌లోనే ఈ జాతీయ ముచ్చట తీసుకొచ్చారని. ఇదంతా కేసీఆర్ డైవర్షన్ గేమ్ అని…అవినీతి పాలనపై ఫోకస్ పెరగకుండా.. జనం మైండ్‌ను పాలిష్ చేస్తున్నరంటూ కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌పై బండల మీద బండలేస్తోంది బీజేపీ.

అయినా గులాబీ బాస్ ఇవేమీ పట్టించుకోకోకుండా తనపని తాను చేసుకుపోతున్నరు ఫాస్ట్‌ ఫాస్ట్‌గా. అయినా మనకు జనం మనసులో ఏముందో తెలుసుకోవాలిగా.. కమలేమనుకుంటే మనకేంటి.. అంటూ సంగారెడ్డి జిల్లాలో మరోసారి జాతీయ రాజకీయాలపై గట్టిగా వినిపిస్తున్నారు కేసీఆర్. కులాల మధ్య..మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ దందా నడుపుతున్నరని…దాన్ని పారదోలే టైంమొచ్చిందంటూ బీజేపీ టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడ్డారు జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించబోతోందని..అభివృద్ధిలో మనం ఒకర్ని రోల్‌మోడల్‌గా కాదు…మనమే ఇతర దేశాలకు రోల్‌మోడల్‌గా ఉండాలని…భవిష్యత్‌లో అలాంటి అభివృద్ధిని చూడబోతున్నామని..అందుకు మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రజల మద్దతు కోరారు కేసీఆర్.

అయితే కేసీఆర్ జాతీయ ముచ్చటపై కమలం కస్సుబుస్సులాడటమే కాదు..అందుకు కారణాలు కూడా చెబుతోంది. అవినీతి డబ్బును దాచుకునేందుకు…ప్రజల ఫోకస్‌ను మరల్చేందుకు కేసీఆర్ తెలివిగా వేసిన ఎత్తుగడే జాతీయ రాజకీయాలంటూ సీరియస్ ఆరోపణలు చేస్తోంది. ఫ్రంటు అంటూ తిరిగే వాళ్లకు గతంలో ఎలాంటి గతి పట్టిందో చంద్రబాబును ఉదహరిస్తూ కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు బండి…ఫ్రంటు..ప్రంటు అంటూ టెంటులేసినోల్లంతా…ఇప్పుడా టెంటు కూడా లేకుండా పోయిందని….తుకడే గ్యాంగ్ సభ్యులతో కలిసి రాజకీయాలు చేస్తే దేశం పట్టించుకుంటుందా అంటూ ఎద్దేవా చేశారు బండిసంజయ్. అయితే బీజేపీ హెచ్చిరకలను గులాబీ దళం బేఖాతర్ చేయడంలేదు. మిషన్ తెలంగాణ కాదు.. ఇక మిషన్ ఢిల్లీ స్టార్ట్ అయిందంటూ రిటర్న్ గిఫ్ట్ పంపుతోంది గులాబీ దళం.

జాతీయ రాజకీయాలను మార్చేసే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ పెద్ద పోరాటమే మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదటి పర్యటన ముంబాయితో మొదలుపెట్టారు. ముంబాయిలో ముందుగా మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ ఠాక్రేతో రాజకీయ విందు జరిగింది. లోపల ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు పొక్కే అవకాశం లేదు. అయితే చర్చలు మాత్రం బ్రహ్మాండంగా జరిగినట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ కు పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పవార్ కూడా కేసీఆర్ పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు.

‘మహా’ ముఖ్యనేతలతోనూ కేసీఆర్ భేటీ సంతృప్తిగా ముగిసింది. అయితే, నిజానికి ముగ్గురి వ్యవహారాలను గమనిస్తే ప్రధాని మోడితో ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతోంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్పష్టమవుతోంది. ఠాక్రే ఇంతవరకు మోడీకి వ్యతిరేకంగా పెద్దగా చేసిన ప్రకటనలు కూడా ఏమీ లేవు. అలాగే శరద్ పవార్ అయితే అసలు మోడీ గురించి ఎప్పుడు పెద్దగా నోరు విప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, శరద్ పవార్ దృష్టంతా రాబోయే రాష్ట్రపతి ఎన్నికల మీదే ఉంది. గతంలోనూ రాష్ట్రపతి కావాలని భావించినా.. నిరాశే ఎదురైంది. ఒకపుడు ప్రధానమంత్రి అవుదామని కలలు కన్న పవార్ తాజాగా రాష్ట్రపతి అయితే చాలన్నట్లుగా సరిపెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే పవార్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఎవరినీ దూరం చేసుకోకుండా అలాగే ఎవరినీ నెత్తికెక్కించుకోకుండా అందరితోను కలివిడిగా రాజకీయ చక్రాలను తిప్పుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపేతర పార్టీలను ఏకం చేసేపనిలో పడ్డారు కేసీఆర్. 2024 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, భారత తదుపరి రాష్ట్రపతికి ఎన్నికలు జూన్-జూలైలో జరగనున్నందున రాష్ట్రపతి భవన్‌లోకి తమకు నచ్చిన వ్యక్తిని తీసుకురావాలని వారి తక్షణ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రపతి అభ్యర్దిత్వం కోసం కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్‌. ఎన్సీపీ అధినేత శరదపవార్‌ను అభ్యర్దిత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈ ఏడాది జులై నెలలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నిక బరిలో ప్రాంతీయ పార్టీల అభ్యర్థిగా శరద్ పవార్‌ను నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై వ్యతిరేకతను బలోపేతం చేసే ప్రచారంలో భాగంగానే ఈ స‌మావేశం జ‌రిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్రమంలోనే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మరోసారి చర్చించేందుకు.. త్వరలో హైదరాబాద్‌లో అందరం కలిసి .. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ముంబైలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే, రాష్ట్రపతి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కి స్పష్టమైన మెజారిటీ లేదని స్పష్టంగా సూచిస్తుంది. దీని మొత్తం బలం 10,98,882 ఓట్లు. 2017 ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేసినప్పుడు, తన ప్రధాన ప్రత్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌పై 65.65 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈరోజు దేశ రాజకీయ ముఖచిత్రంలో చాలా మార్పులు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని NDA అధికారాన్ని నిలబెట్టుకోగా, ఆ తర్వాత బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి అనేక కీలక రాష్ట్రాలను కోల్పోయింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో పొత్తు పెట్టుకునేలా కొన్ని ఎన్డీయేతర పార్టీలను బీజేపీ ఒప్పించకపోతే, రాష్ట్రపతి భవన్‌పై బీజేపీ గానీ NDA గానీ తమ నియంత్రణను కొనసాగించడం కష్టం. ప్రస్తుతం 5,43,062 ఓట్లతో NDA మెజారిటీ మార్కులో దాదాపు 0.05 శాతం తక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో అధికారంలోకి రాకుంటే..బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోతుందని అంచనా వేస్తే ఈ వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు, శిరోమణి అకాలీదళ్ (బాదల్), ఎన్‌డిఎలోని కొన్ని ఇతర చిన్న భాగస్వామ్యాలు ఇకపై ఎన్‌డీఏలో కొనసాగే అవకాశంలేన్నట్లయితే. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం లేదు.

ముఖ్యంగా, పార్లమెంట్‌లో కీలకమైన ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అతని పార్టీ.. అనేక సందర్భాలు గతంలో అండగా నలిచింది. బీజేపీతో కేసీఆర్ రహస్య పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ తరచుగా ఆరోపిస్తోంది. అయితే వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బీజేపీ బలపరీక్షలు టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టడంతో పాటు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. చివరిగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే ఏ వర్గమైనా ప్రభావవంతంగా ఉండాలంటే అందులో కాంగ్రెస్ భాగం కావాలి. ఇటీవలి కాలంలో మళ్లీ తెలంగాణ గడ్డపై యాక్టివ్‌గా మారిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో విబేధిస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ కూటమితో కలుస్తుందో లేదో అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలంటే కాంగ్రెస్‌తో గానీ, బీజేపీతో గానీ కలిసి పోవల్సిన అవసరం ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి జాతీయ రాజకీయాలపై తెలంగాణ కేంద్రంగా గరంగరం పాలిటిక్స్ గరంగా నడుస్తున్నాయి. ఓవైపు తెలంగాణ సమాజం మద్దతు కోరుతూ కేసీఆర్ జాతీయ రాజకీయలపై ఫోకస్ పెడితే…అవినీతి సొమ్ము అంటూ గులాబీ బాస్ దూకుడుకు బ్రేకులు వేసే పనిలో కమలం ఉంది. ఠాక్రేతో కేసీఆర్ సమావేశమైన తర్వాత బీజేపీ కేసీఆర్‌పై విమర్శల్లో వాడి ఇంకా పెంచింది. ఈసారి కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు జరగబోతోందని.. త్వరలోనే అందుకు తగ్గ సంకేతాలు తెంలగాణ సమాజానికి కనిపించబోతున్నాయన్న హింట్ బండి సంజయ్ మాటల్లో వినిపిస్తోంది. అంటే గులాబీ బాస్‌కు కేంద్రం అలర్ట్ సైరన్ ఇస్తోంది. ఇటు ఫ్రంట్ హెచ్చరికలు…అటు అవినీతి వార్నింగ్‌లతో తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది. మరి చూడాలి…కేసీఆర్ ఢిల్లీ పాలిటిక్స్‌ను కమలం ఏమేరకు బ్రేకులు వేస్తోందో..

Read Also…  అది అందరికీ తెలిసిందే కదా.. కాంగ్రెస్ నేత వీహెచ్ – సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ

UP Assembly Elections: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?

Sonu Sood: సోనూసూద్ పై కేసు.. నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగం.. అసలేం జరిగిందంటే..