UKRAINE CONFLICT: ఉక్రెయిన్, రష్యాల మధ్య అదే ఉద్రిక్తత.. అమెరికా అధ్యక్షునితో భేటీ ఇప్పుడే కాదంటోన్న రష్యా

Russia-Ukraine Updates: అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య ముఖాముఖీ భేటీకి ఛాన్స్ వుందని ఓ వైపు మీడియా కథనాలు రాగానే రష్యా అందుకు భిన్నంగా స్పందించింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపాల్సిన తరుణం రాలేదని రష్యా ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఉక్రెయిన్ దేశానికి మూడు వైపులా సైన్యాన్ని మోహరిస్తోంది రష్యా.

UKRAINE CONFLICT: ఉక్రెయిన్, రష్యాల మధ్య అదే ఉద్రిక్తత.. అమెరికా అధ్యక్షునితో భేటీ ఇప్పుడే కాదంటోన్న రష్యా
Ukraine crisis
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 21, 2022 | 6:48 PM

UKRAINE CONFLICT INTENSIFIED RUSSIA REFUSED AMERICA PROPOSAL OF DIALOGUE: అసలు ఉక్రెయిన్, రష్యాల మధ్య ఏం జరుగుతోంది ? అమెరికా చెబుతున్నట్లు రష్యా యుద్ద సన్నాహాల్లో వుందా ? లేక రష్యా చెప్పుకుంటున్నట్లు కేవలం మిలిటరీ డ్రిల్స్ మాత్రమే జరుగుతున్నాయా ? చర్చల దిశగా ఓ అడుగు ముందుకు పడితే.. రెండడుగులు వెనక్కి పడుతున్నాయి. అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య ముఖాముఖీ భేటీకి ఛాన్స్ వుందని ఓ వైపు మీడియా కథనాలు రాగానే రష్యా అందుకు భిన్నంగా స్పందించింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపాల్సిన తరుణం రాలేదని రష్యా ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. మరోవైపు యుద్దం చేసే ఉద్దేశం లేదంటూనే ఉక్రెయిన్ దేశానికి మూడు వైపులా సైన్యాన్ని మోహరిస్తోంది రష్యా. మూడు వైపు నుంచి మొత్తం ఏడు మార్గాలలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడించేలా రష్యా ప్లాన్ చేసిందంటూ అంతర్జాతీయ మీడియా(International Media)వెల్లడించింది. ఇంతకీ యుద్దం అనివార్యమా ? లేక శాంతికి అవకాశం వుందా ? ఈ చర్చ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

ఇదిలా వుంటే.. రష్యా- ఉక్రెయిన్​ సరిహద్దు(Russia Ukraine conflict)లో మరోసారి కాల్పుల మోత మోగింది. దాంతో అన్ని దేశాలు అదిరిపడ్డాయి. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు ఫిరంగుల గర్జన. ఏక్షణమైనా యుద్ధం తప్పదనే సంకేతాలు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఆపేందుకు ప్రపంచ దేశాల యత్నాలు. మధ్యవర్తులు జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు చర్చల దిశగా సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు యత్నాలు చేస్తున్నాయి. దీనికి తోడు ఇపుడు అమెరికా కూడా ఇపుడు రంగంలోకి దిగింది. ఇంకోవైపు శాంతి చర్చలకు సిద్ధపుడుతూనే మరోవైపు ప్లాన్‌ బీ కి రష్యా పదును పెడుతుంది.వేర్పాటువాదుల దాడులతో కొద్ది రోజులుగా తూర్పు ఉక్రెయిన్‌ దద్దరిల్లిపోతోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న హై టెన్షన్‌తో రోజురోజుకూ ఆందోళన పెరిగిపోతోంది. ఆ దాడులు యుద్ధానికి దారి తీయకుండా..ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఆపేలా చర్చలు జరుపుతున్నాయి ఫ్రాన్స్‌, అమెరికా. ఫిబ్రవరి 16న రష్యా దురాక్రమణ మొదలవుతుందని అమెరికా హెచ్చరించిన తర్వాత జర్మనీ ఛాన్స్‌లర్ హుటాహుటిన రష్యా వెళ్ళి పుతిన్‌ని కలిశారు. దాంతో ఆనాటి దురాక్రమణ వాయిదా వేశారు పుతిన్. అయితే.. ఏ క్షణమైనా రష్యా దాడులు ప్రారంభించవచ్చని అమెరికా చెబుతూనే వుంది. ఇదిలా వుండగా.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రష్యన్ అనుకూల తీవ్రవాద సంస్థలు స్థానికులపైనా.. మిలిటరీ శిబిరాలపైనా కాల్పులు మొదలుపెట్టారు. వారిని నిలువరించేందుకు ఉక్రెయిన్ మిలిటరీ రంగంలోకి దిగింది. దీన్ని సాకుగా చూపించి పుతిన్ దాడులు ప్రారంభిస్తారన్న ప్రచారమూ జరిగింది.

తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు 2 గంటల పాటు చర్చించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక రెండు దేశాల విదేశాంగ మంత్రులు కూడా రానున్న రోజుల్లో భేటీ కానున్నారు. మరోవైపు పొరుగు దేశంపై రష్యా దండయాత్రను ఆపేందుకు..జో బైడెన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పూర్తిగా నివారించే దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భేటీ కానున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌజ్ ప్రతినిధి ప్రకటన చేశారు. ఫిబ్రవరి 24న రష్యా, అమెరికా విదేశాంగ శాఖా మంత్రులు ముందుగా భేటీ అవుతారు. అందులో ఏ మాత్రం సానుకూలత కనిపించినా బైడెన్, పుతిన్‌ల భేటీ ఖరారవుతుందని అమెరికా భావిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌- రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఉక్రెయిన్‌ అంశంపై చర్చలు జరుగుతాయనే ప్రకటనలను రష్యా ఖండించింది. శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించడానికి ఇది తగిన సమయం కాదన్నారు రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌. విదేశాంగ శాఖ మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి మాత్రమే అవగాహన కుదిరిందని చెప్పారు. అధ్యక్షుల స్థాయిలో సమావేశం నిర్వహించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని తేల్చిచెప్పాడు దిమిత్రి పెస్కోవ్‌. త్వరలో రష్యా అధ్యక్షుడు- అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ అంశంపై సమావేశమవుతారని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన గంటల్లోనే క్రెమ్లిన్‌ ప్రతినిధి దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణించారు. అంతేకాదు.. డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ సైన్యం జరిపే దాడులను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యుద్ధం ముప్పు తొలగిపోలేదని స్పష్టమవుతుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితిని ప్రమాదకర పరిణామంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. రష్యాను నిలువరించేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తుందని..తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా బలగాల మోహరింపు, ఫిరంగులు గర్జన, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాల గస్తీని గమనిస్తున్నామన్నారు. పుతిన్ తన యాక్షన్ ప్లాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లకుండా దౌత్య మార్గాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే పుతిన్ బైడెన్ భేటీ ఉంటుందని, అది డైరెక్టుగా లేదా వర్చువల్‌గా గానీ ఉండొచ్చని తెలిపారు. అంతిమంగా యుద్ధం ఆపడమే అమెరికా ముందున్న కర్తవ్యమన్నారు. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్దవిన్యాసాలను కొనసాగిస్తోంది. అణు క్షిపణులతో న్యూక్లియర్‌ డ్రిల్స్‌ చేస్తున్న రష్యా తాజాగా నేవీని కూడా రంగం లోకి దింపింది. బలప్రదర్శన చేసింది. నల్లసముద్రంలో రష్యా నేవీ రంగం లోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు తిష్టవేశాయి. ఉక్రెయిన్‌ మూడు సరిహద్దుల్లో రష్యా బలగాలు యుద్దానికి రెడీగా ఉన్నాయి. దాదాపు లక్షా 90 వేల మంది సైనికులను రష్యా రంగం లోకి దింపింది. ఏ క్షణంలోనైనా రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడడడానికి సిద్దంగా ఉన్నట్టు అమెరికా నిఘా వర్గాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి.

పుతిన్ తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుందని పశ్చిమ దేశాలు ఆగ్రహంతో వున్నాయి. పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదని చెబుతున్నాయి. బలగాలు వెనక్కి వెళుతున్న వీడియోలను విడుదల చేసి.. అదనంగా 7 వేల అదనపు బలగాలను బోర్డర్‌కు తరలించిందని నాటో దేశాలంటున్నాయి. మరోవైపు డాన్‌బాస్‌ ప్రాంతంలోని డోనెట్స్క్‌, లుహాన్స్‌ ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటు వాదులు దాడుల ఉధృతి పెంచారు. దీంతో మరోసారి రష్యా ఆక్రమణ భయాలు పెరిగిపోయాయి. తాజాగా బ్రిటన్‌ రక్షణ శాఖ రష్యా ప్లాన్‌ను మూడు రోజుల క్రితం మ్యాప్‌తో సహా ట్వీట్‌ చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించడానికి వీలుగా ఈ బలగాలను తరలించినట్లు బ్రిటన్‌ రక్షణ శాఖ రిపోర్టు పేర్కొంటోంది. బెలారస్‌, రష్యా మీదుగా ఏకకాలంలో కీవ్‌పై దాడి చేయడానికి దళాలు సిద్ధంగా ఉన్నాయి. బెలారస్ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ కేవలం 140 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొన్ని గంటల్లోనే రష్యా సేనలు రాజధాని కీవ్‌ను ఆధీనంలోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ను భారీగా భయపెడుతోన్న అంశం ఇదే. మరోపక్క యుద్ధ నష్టాలకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్‌ పేర్కొంది. అనుకున్నది సాధించే క్రమంలో వేల సంఖ్యలో ప్రాణనష్టానికి కూడా పుతిన్‌ వెనుకంజ వేయడంలేదని తెలిపింది. అదే సమయంలో దౌత్యాన్ని కూడా కొనసాగిస్తారని వెల్లడించింది. మాక్సర్‌ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా బలగాల మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే యుద్ధంలో చంపాల్సిన ఉక్రెయిన్ల జాబితాను రష్యా సిద్ధం చేసినట్లు అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని, మానవ హక్కులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ కు లేఖ రాసినట్టు సమాచారం. కిడ్నాప్‌లు, చిత్రహింసల వంటి దారుణాలు జరగవచ్చని, మత, జాతిపరంగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించింది.