Hyderabad Free Water: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకంలో ప్రజల సందేహాలు – సమాధానాలు : జలమండలి

|

Jun 15, 2021 | 8:27 PM

కేసీఆర్ సర్కారు తెచ్చిన ఉచిత తాగునీటి పథకానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ వాసుల్లో నెలకొన్న సందేహాల నివృత్తి కోసం జలమండలి ఈ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించింది... ఆ వివరాలు :

Hyderabad Free Water: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 వేల లీటర్ల ఉచిత నీటి  పథకంలో ప్రజల సందేహాలు - సమాధానాలు : జలమండలి
Hyderabad Water Supply
Follow us on

Free Twenty thousand liter drinking water supply scheme : హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలో నివసిస్తున్న వాటర్ కనెక్షన్ గృహ వినియోగదారులకు ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని అందించడానికి ప్రభుత్వ ఉత్తర్వులు 211, తేదీ 20-12-2020 న ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రతి గృహ వినియోగదారుడు తప్పనిసరిగా పనిచేస్తున్న వాటర్ మీటర్ కలిగి ఉండటంతో పాటుగా, వాటర్ కనెక్షన్ కన్స్యూమర్ అకౌంట్ నంబర్ తో వారి ఆధార్ కనెక్షన్ లింక్ చేసుకున్నవారికీ మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో స్పష్టం జరిగింది. డిసెంబర్ 2020 నుండి ప్రారంభమైన ఈ పథకం ద్వారా లబ్ది పొందడానికి పనిచేయని పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్ల ఏర్పాటు చేసుకోవడం కోసంతో పాటుగా, ఆధార్ లింకేజ్ కోసం ఏప్రిల్, 2021 వరకు ప్రభుత్వం నాలుగు నెలల సమయం ఇవ్వడం జరిగింది. కాగా, బస్తీల్లో, మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఈ పథకం పూర్తిగా వర్తిస్తుంది కనుక వారు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.

14 జూన్, 2021 నాటికీ హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కింద వున్న మొత్తం 9 లక్షల 73 వేల 977 కనెక్షన్స్ లో, 41 శాతం అంటే, 4 లక్షల 6 వేల 508 కనెక్షన్స్ తమ వాటర్ కనెక్షన్స్ ను ఆధార్ తో లింకేజ్ చేసుకోవడంతో పాటుగా పనిచేస్తున్న నూతన మీటర్లను ఏర్పాటు చేసుకోవడం వలన వీరందరికీ నెలకు 20 వేల లీటర్ల ఉచిత్ తాగునీటి పథకం కింద లబ్ది పొందారు. ఇందువలన 8 లక్షల 24 వేల కుటుంబాలు లబ్ది పొందాయి.

ఇదొక ప్రగతి. ఈ ప్రగతి వెనుక ఒకవైపు ప్రజలు ఈ పథకాన్ని వెంటనే వినియోగించుకోవాలనే ఉత్సాహంతో అన్ని వివరాలను సమర్పిస్తూ ముందుకు రావడంతో పాటుగా, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బంది కూడా వినియోగదారులకు సహకరించడం వలన కేవలం నాలుగు నెలల కాలంలోనే 41శాతం మంది ప్రజలు ఈ పథకాన్నివినియోగించుకోవడం వలన ఈ ప్రగతి సాధ్యమయింది.

ఉచిత తాగునీటి పథకాన్ని పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో వినియోగదారులకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకున్న చర్యలు :

మీటర్ బిగింపు ప్రక్రియను సులభతరం చేయడానికి మీటరింగ్ ఏజెన్సీల వివరాలను పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. తదనుగుణంగా బోర్డు 14 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్లలో మీటర్ బిగింపు కోసం ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. మీటర్ వివరాలతో పాటుగా బోర్డు వెబ్‌సైట్‌లో వివరాలను కూడా నమోదు చేసింది. వినియోగదారులకు ఎంపానెల్డ్ ఏజెన్సీల ద్వారా మీటర్లను బిగించు కోవడానికి అనుమతించడంతో పాటుగా జలమండలి ఆమోదించిన విధంగా వినియోగదారులు తమకు అనుగుణంగా మీటర్లను సేకరించుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ విధంగా, మీటర్ ఫిక్సింగ్ వివరాలను క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేయడంతో పాటుగా డేటాబేస్లో మీటర్ వివరాలను రికార్డ్ చేయడానికి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా సిద్ధం చేయడం జరిగింది.

డొమెస్టిక్ వినియోగదారులుకు, బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న వినియోగదారులకు, వివిధ కాలనీలలో నివసిస్తున్న వారికీ కూడా వేలి ముద్రల స్కానర్‌ల ద్వారా బయో మెట్రిక్‌ను విధానం ద్వారా, మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఆధార్‌ను అనుసంధానించడానికి తగిన సదుపాయం జలమండలి కల్పించింది. అలాగే, ఆన్‌లైన్ పోర్టల్ www.hyderabadwater.gov.in, మీ-సేవా కేంద్రాల ద్వారా కూడా.డొమెస్టిక్ స్లమ్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం కోసం జలమండలి సిబ్బంది ఇంటింటిని సందర్శించి అధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. అయితే, కొవిడ్ కేసుల పెరుగుదల ప్రభుత్వ ఆంక్షల కారణంగా, ఇంటింటికి వెళ్లే సందర్శనలు ఆపివేయబడ్డాయి.
కాగా, ఆన్లైన్ ద్వారా ఆధార్ అనుసంధాన ప్రక్రియను మాత్రం ప్రోత్సహించడం జరిగింది. ఈ విషయంలో ప్రజల సందేహాలను ఎప్పటికపుడు జలమండలి కస్టమర్ కేర్ 155313 తో పాటుగా, ప్రధాన కార్యాలయంలో కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ (సిఆర్‌ఎం సెల్) ను 30 లైన్లతో ఏర్పాటు చేసింది; కస్టమర్ అడిగే ప్రశ్నలను పరిష్కరించడం తో పాటుగా ఈ పథకం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి 9154170968 ను జలమందలి వాట్సాప్ చాట్‌బోట్ అందుబాటులో ఉంచింది. కనెక్షన్ల పేర్లు మరియు టెలిఫోన్ నంబర్లలో దిద్దుబాట్లును కూడా మార్చుకోవడానికి జలమండలి వెబ్‌సైట్‌లో అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం గురించి వినియోగదారులకు మరింత ప్రచారం కోసం ఎస్ఎంఎస్, సోషల్ మీడియా, టెలిఫోన్ ద్వారా వివరణలు, ఎఫ్ఎమ్ రేడియోలో ప్రచారం, టీవీ స్క్రోలింగ్, ప్రముఖ ప్రదేశాల్లో హోర్డింగ్స్, పోస్టర్ల ద్వారా మరింత అవగాహనా కల్పించడం జరిగింది.

సందేహాలకు సమాధానాలు:

ఉచిత తాగునీటి పథకానికి సంబంధించిన సందేహాలు ఇంకా ప్రజల్లో ఉండటం వలన వారి సందేహాల నివృత్తి కోసం జలమండలి ఈ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.

1. 20 కెఎల్ ఉచిత నీటి సరఫరా పథకం వర్తించేందుకు జి.హెచ్ ఎం.సి పరిధిగాని పక్కన వున్న మునిసిపాలిటీలు & కార్పొరేషన్లలో నివసిస్తున్న ప్రజల నుండి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం జిహెచ్‌ఎంసి పరిధి లో నివసిస్తున్న వారికీ మాత్రమే వర్తిస్తుందని ఈ సందర్బంగా తెలియచేయడం జరుగుతున్నది.

2. మరికొంత మంది ప్రజలు వారు తమ ఆధార్‌ను తమ్ క్యాన్ నంబర్ తో అనుసంధానించినప్పటికీ, మీటర్ కలిగి ఉన్నప్పటికీ, రిబేటు లేకుండా బిల్లు జారీ చేయబడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలు గమనించాల్సింది ఒకటి వుంది. అదేమిటంటే, మీటర్ అందుబాటులో ఉన్నప్పటికీ అది పని చేయాల్సిన అవసరం తప్పనిసరిగా వుంది. అందువలన, వినియోగదారులు తమ వాటర్ మీటర్లు పనిచేసే కండిషన్ లో వుండే విధంగా చూసుకోవాలి.

3. బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్స్ లు, వివిధ కాలనీలలో నివసిస్తున్న అన్ని ఫ్లాట్స్ లకు ఆధార్ తప్పనిసరిగా అనుసంధానించబడితే తప్ప, ఈ పథకానికి సంబంధించిన పూర్తి రిబేటు వారికీ వర్తించదు. ఆధార్ లింక్ చేసుకున్న ఫ్లాట్స్ యజమానులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కొంతమంది ఆధార్ లింక్ చేసుకుని, మరికొంతమంది ఆధార్ లింక్ చేసుకోకపోతే బిల్లు తప్పనిసరిగా వస్తుంది. అందువలన అన్ని ఫ్లాట్లు తమ ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి జలమండలి ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం జలమండలి కస్టమర్ కేర్ తమ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది.

4. మీటర్లకు, ఆధార్ తో అనుసంధానం చేసుకోవడం కోసం వినియోగదారులకు సౌకర్యంగా ఉండటానికి 01-12-2020 నుండి 30-04-2021 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. అయితే, గడువు దాటిన తరువాత మే 2021 నుండి అన్ని కనెక్షన్లకు ఒకేసారి బిల్లులు జారీ చేయబడ్డాయి, అర్హతగల కనెక్షన్లకు రిబేటును వర్తింపజేయడం, నెలకు సగటు మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లులు జారీ చేయబడ్డాయి. కాగా, ఎటువంటి జరిమానాలు లేదా వడ్డీ విధించబడలేదు.

5. ఏప్రిల్ 30, 2021 లోపు పనిచేస్తున్న మీటర్లు కలిగి వారి ఆధార్ కార్డును మీటర్లతో అనుసంధానించిన కనెక్షన్లకు, డిసెంబర్ 2020 నెల నుండి ఏప్రిల్ 2021 వరకు అయిదు నెలలకు సంబంధించిన రిబేట్ ఇవ్వడం జరిగింది. ఉచిత నీటికి అర్హతను ప్రస్తుతం ఆ కనెక్షన్స్ లు పొందుతున్నాయి. 1 మే, 2021 నుండి, ఆ తరువాత ఆధార్ లింక్ చేసుకున్న కనెక్షన్లకు, 5 నెలల బిల్లు ఇవ్వబడుతుంది, అనగా 01-12-2020 నుండి 30-04-2021 వరకు అయిదు నెలల బిల్లుతో పాటుగా 01-05-2021 నుండి వారికి నెలవారీ బిల్లు కూడా జారీ చేయడం జరుగుతుంది.

6. వినియోగదారులకు ఈ పథకం ఇప్పటికీ వర్తిస్తుందని ఈ సందర్బంగా స్పష్టం చేయడం జరుగుతున్నది. ఏప్రిల్, 2021 తర్వాత కూడా వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానించడం మరియు పనిచేస్తున్న మీటర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా లబ్ది పొందవచ్చును. అయితే, పని చేస్తున్న మీటర్లు కలిగివుంది, ఆధార్ తో అనుసంధానం చేసుకున్న రోజు నుండి మాత్రమే ఈ రిబేట్ వర్తిస్తుంది.

7. ఒక వినియోగదారుడు తమ ఆధార్ నంబర్ తో ఒక CAN కు మాత్రమే లింక్ చేసుకోవాలి.

8. జి.హెచ్ ఎం.సి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC ) సమర్పించని వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కాదు.

9. జలమండలి ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది, దీని పేరు “HMWSSB 20KL ఉచిత నీటి రిజిస్ట్రేషన్”. ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించి వినియోగదారులు తమ ఆధార్ నంబర్లను వారి CAN తో అనుసంధానించడం ద్వారా ఉచిత నీటి సరఫరా కోసం నమోదు చేసుకోవచ్చు. అనుకూలమైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ల వివరాలు మొబైల్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ పథకం వర్తించే విషయంలో మరింత స్పష్టత కోసం వినియోగదారులు 155313 కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.

Read also : Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో తొలగని ఉత్కంఠ.. హైకోర్టులో వాదోపవాదాలు.. చివరికి న్యాయ స్థానం ఏం చెప్పిందంటే..!