Rahul Gandhi – AP Congress Leaders: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ అధిష్ఠానం సంకల్పించింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు తదితరులు బుధవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసిన సంగతి తెలిసిందే. రాత్రి వరకూ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళిక, తదితర అంశాలపై సీనియర్ నేతలు రాహుల్‌తో చర్చించారు.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశం ఇటీవల ఏపీ రాజకీయల్లో చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. చింతా మోహన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
అటు, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, తదితరులు అడపా దడపా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మళ్లీ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను కలవాలని రఘువీరాకు రాహుల్‌గాంధీ వర్తమానం పంపినట్టు సమాచారం. అయితే దీనిపై రఘువీరారెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇటీవల తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నీలకంఠాపురం వెళ్లి రఘువీరారెడ్డిని కలిశారు. పార్టీలకతీతంగా రాయలసీమ హక్కుల కోసం పోరాడుదామని కోరారు. కానీ, రఘువీరా మాత్రం తన మనసులోమాటను బయటపెట్టలేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోయిన వేళ.. కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో ఏ మేరకు పుంజుకుంటుందో వేచి చూడాల్సిందే!.
Read also: Heavy rain Warnings: తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకు పడబోతున్నాడు… తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరికలు