Landslides: కొండచరియలు విరిగపడడాన్ని ముందే గుర్తించగలమా? సెన్సర్ల ద్వారా సిస్మోమీటర్ టెక్నాలజీతో ఇది ఎంతవరకు సాధ్యం?
మామూలుగా అయితే కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించడం కష్టం. అయితే ఎక్కువ వర్షాలు పడే చోట, అలాగే కొండ నిటారుగా ఉన్న చోట నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎంతనష్టం వాటిల్లుతుందో చూసి.. దానిని బట్టి వాటిని జోన్లుగా విభజిస్తారు. వాటిని రెడ్ జోన్లుగా గుర్తిస్తారు. దీంతోపాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలను గుర్తించడానికి ప్రస్తుతం శాటిలైట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. తరువాత సెన్సర్ల ద్వారా సిస్మోమీటర్ టెక్నాలజీతో గుర్తించే వ్యవస్థ వచ్చింది. అది ఎలా పనిచేస్తుంది?

విజయవాడలోని మాచవరంలో కొండచరియలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఇప్పటికే వరద ముంపు నుంచి అతి కష్టమ్మీద బయటపడుతున్న బెజవాడ.. ఈ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ వర్షాలు, వరదతో సర్వస్వం కోల్పోయి ఆవేదన చెందుతున్న వేళ.. మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి అన్న మాట అక్కడివారిలో ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే ఆగస్టు నెల చివరిలోనే ఇలాంటి దారుణఘటన జరిగింది. విజయవాడ మొగల్రాజపురంలో జరిగిన ఆ ఘటన అందరినీ కలచివేసింది. ప్రకృతి విలయానికి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇదొక్కటే కాదు.. ఈమధ్యే విశాఖపట్నంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మాటతో వైజాగ్ కూడా షాకైంది. ఎందుకంటే వయనాడ్ విషాదం ఇంకా అందరి కళ్లముందూ కదలాడుతోంది. అలాంటి సమయంలో విశాఖలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరూ షాకయ్యారు. అల్లూరి జిల్లాలోనూ ఇలాంటి ఉదంతమే చోటుచేసుకుంది. వయనాడ్, విజయవాడ, విశాఖపట్నం, అల్లూరి జిల్లా.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఈ ప్రాంతాలన్నింటిలోనూ కొంతమంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోలేమా? దీనికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోలేమా? అసలు విశాఖలో ఏం జరిగిందంటే.. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కొండ ప్రాంతంలో ఉన్న ఇళ్లు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మట్టి కోతకు గురయ్యింది....
