BJP New Formula: ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికకు కమలదళం సరికొత్త ఫార్ములా.. దేశంలో తొలిసారిగా..

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీల్లో, నేతల్లో సందడే సందడి. అసెంబ్లీ ఎన్నికలైతే ఎమ్మెల్యే టికెట్ కోసం, లోక్‌సభ ఎన్నికలైతే ఎంపీ టికెట్ కోసం ఆయా పార్టీల్లోని ఆశావహులు అనేక రకాలుగా ప్రయత్నాలు సాగిస్తుంటారు. రాజకీయ పార్టీలు సైతం గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీలు సర్వేలు నిర్వహించి అభ్యర్థుల విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి.

BJP New Formula: ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికకు కమలదళం సరికొత్త ఫార్ములా.. దేశంలో తొలిసారిగా..
BJP
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 11, 2024 | 11:47 AM

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీల్లో, నేతల్లో సందడే సందడి. అసెంబ్లీ ఎన్నికలైతే ఎమ్మెల్యే టికెట్ కోసం, లోక్‌సభ ఎన్నికలైతే ఎంపీ టికెట్ కోసం ఆయా పార్టీల్లోని ఆశావహులు అనేక రకాలుగా ప్రయత్నాలు సాగిస్తుంటారు. రాజకీయ పార్టీలు సైతం గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీలు సర్వేలు నిర్వహించి అభ్యర్థుల విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహకర్తలను నియమించుకుని, వారి సలహాలు, సూచనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. జాతీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా పార్టీల సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC)లు లేదా అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కమిటీలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో పార్లమెంటరీ బోర్డు లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కోసం ముందు స్క్రీనింగ్ కమిటీలు వడపోసి రూపొందించిన జాబితాపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై.. అగ్రనాయకత్వం అభిప్రాయానికి మొగ్గుచూపుతూ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో అధినేత కుటుంబం చేతిలోనే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది. వారి మన్నన, ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే అభ్యర్థులగా బరిలోకి దిగుతుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే.. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థుల ఎంపిక కోసం సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది.

ఇన్నేళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందుగా రాష్ట్రస్థాయిలో అగ్రనాయకత్వం లేదా ఎలక్షన్ కమిటీ సమావేశమై ఒక్కో నియోజకవర్గం నుంచి ఆశావహులను వడపోసి జాబితాను తయారు చేస్తే, దాన్ని జాతీయ నాయకత్వం మరింత వడపోసి తుది అభ్యర్థిని ఖరారు చేసేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అంటే.. ప్రజాతీర్పును కోరడానికి ముందే ఆశావహులు పార్టీలో కార్యకర్తల ఓట్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ విధానాన్ని మనం చూస్తుంటాం. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేసే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు జరుపుతారు. వాటిలో ఎవరు గెలిస్తే వారే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగుతారు. ఇప్పుడు బీజేపీ త్వరలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈ విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి జాబితాను తయారు చేస్తుంది. వారిలో ఎవరు అభ్యర్థిగా ఉండాలన్న విషయాన్ని తేల్చే బాధ్యతను కార్యకర్తలకే అప్పగిస్తూ ఎన్నికలు నిర్వహించనుంది. కార్యకర్తల ఓట్ల ప్రకారం తొలి మూడు స్థానాల్లో నిలిచినవారి పేర్లను జాతీయ నాయకత్వానికి పంపిస్తుంది. ఆ ముగ్గురిలో ఎవరిని ఖరారు చేయాలన్న విషయంపై అగ్ర నాయకత్వం సామాజిక, ఆర్థిక తదితర సమీకరణాలను బేరీజు వేసుకుని ఖరారు చేస్తుంది. జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వడపోసే బాధ్యతల్ని ఇద్దరు పరిశీలకులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్యకర్తల అభిప్రాయ సేకరణ – ఎన్నికల ద్వారా ఆ ఇద్దరు పరిశీలకులు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఆశావహుల పేర్లతో జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది.

కార్యకర్తల ఆమోదానికే పెద్దపీట

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా సహా మరికొన్ని రాష్ట్రాల్లో తగిలిన ఎదురుదెబ్బలను ఆ పార్టీ అగ్రనాయకత్వం విశ్లేషించుకున్న తర్వాత ఓ విషయం వారికి అవగతమైంది. గెలుపు గుర్రాల వేటలో ఇతర పార్టీల్లోని నేతలను చేర్చుకుని టికెట్లు ఇవ్వడం వల్ల దశాబ్దాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం సేవలందిస్తూ వచ్చిన కార్యకర్తలు నొచ్చుకుంటున్నారని గ్రహించింది. కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయని తేటతెల్లమైంది. అందుకే ఈ సారి కార్యకర్తల అభిప్రాయాలకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ అంతర్గత ఎన్నికల ఫార్ములాను అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా చేయడం వల్ల స్థానికంగా కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా ఉంటుందని కమలదళం భావిస్తోంది. కార్యకర్తల సహాయ నిరాకరణ తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తున్నందున.. ఈసారి ఈ జాగ్రత్తలు చేపట్టింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి