BORIS JOHNSON TOUR: కీలక సమయంలో బోరిస్ జాన్సన్ రాక.. యుకే, ఇండియా మధ్య కీలక ఒప్పందాలు.. మూడు ఎంఓయూలు మరింత కీలకం
బోరిస్ జాన్సన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య జరగనున్న ఒప్పందాలు చాలా కీలకం కానున్నాయి. రక్షణ రంగంలో టెక్నాలజీ బదలాయింపు ఈ ఒప్పందాలలో అత్యంత కీలకమని తెలుస్తోంది. యుకే రక్షణ రంగ నిపుణులు... ఇండియన్ డిఫెన్స్ ఇంజినీర్లతో కలిసి పని చేసేలా ఇండియా, యుకేల మధ్య ఒప్పందం జరగబోతోంది.

BORIS JOHNSON TOUR AT CRUCIAL TIME FIVE MOUs BETWEEN INDIA AND UK: బోరిస్ జాన్సన్.. చింపిరి జుట్టున్న ఓ అంతర్జాతీయ వీఐపీ. యునైటెడ్ కింగ్‌డమ్ (UNITED KINGDOM) ప్రధాన మంత్రి. అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి భారతదేశ పర్యటనకు వచ్చారు. అది కూడా చాలా కీలకమైన సమయంలో ఆయన రెండ్రోజుల పర్యటన కోసం ఏప్రిల్ 21న గుజరాత్ (GUJRATH) రాజధాని అహ్మదాబాద్ (AHMEDABAD) సిటీలో ల్యాండయ్యారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో ఓ సైడ్ తీసుకుని రష్యా (RUSSIA)ది దురాక్రమణే అంటున్న ఓ దేశం.. యుద్ధం పట్ల తటస్థ వైఖరిని అవలంభిస్తున్న భారత దేశానికి రావడం ఒకింత సర్‌ప్రైజ్ కిందే చెప్పుకోవాలి. నిజానికి బోరిస్ జాన్సన్ యుకే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు సార్లు ఇండియా (INDIA) టూర్ ఫిక్సయ్యింది. 2021 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా బోరిస్ జాన్సన్ రావాల్సి వుండింది. కానీ ఆ సమయంలో బ్రిటన్‌లో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వుండడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో మరోసారి జాన్సన్ ఇండియా టూర్ ఫిక్సయినా.. మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECONDWAVE) ప్రబలడంతో ఆయన రాలేదు. అయితే.. ప్రస్తుతం ఆయనొచ్చిన తరుణం మాత్రం ఎంతో ఆసక్తిని రేపుతూనే వుంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ (UKRAINE) యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా, యుకే పూర్తిగా ఉక్రెయిన్ పక్షాన నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా తీసుకునే ప్రతీ నిర్ణయంలోను యుకె భాగస్వామిగా వుంటూ వస్తోంది. ఉక్రెయిన్ దేశానికి ఆయుధాలను సరఫరా చేసే విషయంలోను అమెరికా ఆదేశాలకు అనుగుణంగానే యుకే నడుచుకుంటోంది. రష్యాపై ఆంక్షలు విధించింది. ఒకదశలో రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయాన్ని అమెరికా (AMERICA)తో కలిసి యుకే వ్యతిరేకించింది. అవసరమైతే ఇండియాపైన కూడా ఆంక్షలు విధిస్తామన్న స్థాయికి వెళ్ళింది. కానీ ఇండియా వైఖరి దృఢంగా వుండడం.. తాము తీసుకున్న తటస్థ వైఖరితో పలు దేశాలను భారత్ మెప్పించడంతో అమెరికా, యుకే సహా పలు యూరోపియన్ దేశాలు ఇండియా వైఖరిని ప్రశ్నించలేని స్థితిలో పడిపోయాయి. ఆంక్షలు విధిస్తామన్న నోటితోనే ఇండియా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని ప్రశ్నించలేమనే స్థాయికి చేరాయి.
బోరిస్ జాన్సన్ ఇండియా టూర్‌కు ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడింది ? దీనికి కారణం ఆయనొచ్చిన సందర్భమే. రష్యా, ఉక్రెయిన్ యుద్దం కీలక దశకు చేరుకున్న తరుణమిది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యా తన గుప్పిటిలోకి చేర్చుకుంటున్న సమయమిది. క్రిమియా నుంచి డాన్ బాస్ వరకు ఈస్టర్న్ ఉక్రెయిన్ రష్యా ఆధీనంలోకి వెళ్ళబోతోంది. ఏప్రిల్ 21న రష్యా చేసిన ప్రకటన నిజమే అయితే.. మరియుపోల్ అనే వ్యూహాత్మకంగా కీలకమైన సిటీ పుతిన్ ఆధీనంలోకి వెళ్ళింది. దాంతో క్రిమియా నుంచి డాన్ బాస్ ఏరియా వరకు రష్యా ఆధీన స్వేచ్ఛా ప్రాంతంగా ప్రకటించబోతోంది. అయితే.. ఇపుడు రష్యాను తరిమి కొట్టేందుకు ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు కావాల్సి వుంది. ఇండియాకు పయనమయ్యే ముందు సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావించారు బోరిస్ జాన్సన్. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తామన్న బోరిస్ జాన్సన్.. ఉక్రెయిన్ విషయంలో ఇండియాపై ఒత్తిడి తెస్తారా అన్న ప్రశ్నకు ససేమిరా అనేశారు. భారత దేశానిది స్వతంత్ర దౌత్య విధానం.. వారి ప్రయోజనాలు వారికి వుంటాయి.. సో.. భారత్‌పై ఒత్తిడి తేలేమని.. రష్యా, ఉక్రెయిన్ అంశాన్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో చర్చిస్తామని చెప్పారు. ఇలా చెప్పి ఇండియా వచ్చిన బోరిస్ జాన్సన్.. మనదేశంలో కీలక ఒప్పందాలకు రెడీ అయ్యారు. అహ్మదాబాద్ సిటీలో దిగిన వెంటనే అక్కడి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ వినియోగించిన చరఖాను తిప్పారు. ఆ తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్‌లో చోటు సంపాదించిన గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత అక్షర్ ధామ్ సందర్శించారు. ఏప్రిల్ 22న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లాంఛనంగా భేటీ అవుతారు. అనంతరం ఢిల్లీలోని బాపూ ఘాట్‌కు వెళ్ళి గాంధీకి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి ప్రొ. జయశంకర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో కీలక సమాలోచనలు జరుపుతారు. నిజానికి నరేంద్ర మోదీ సైతం బోరిస్ జాన్సన్‌తో భేటీ అవడం ఇదే తొలిసారి. పలుమార్లు వీరిద్దరు వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. బోరిస్ జాన్సన్ ప్రధాని అయిన తర్వాత మోదీ యుకే వెళ్ళలేదు. బోరిస్ జాన్సన్ కూడా ప్రధాని హోదాలో ఇండియా రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 22న మధ్యాహ్నం అయిదు ఎంఓయులపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారు. దీంతో బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ ముగియనున్నది.
బోరిస్ జాన్సన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య జరగనున్న ఒప్పందాలు చాలా కీలకం కానున్నాయి. రక్షణ రంగంలో టెక్నాలజీ బదలాయింపు ఈ ఒప్పందాలలో అత్యంత కీలకమని తెలుస్తోంది. యుకే రక్షణ రంగ నిపుణులు… ఇండియన్ డిఫెన్స్ ఇంజినీర్లతో కలిసి పని చేసేలా ఇండియా, యుకేల మధ్య ఒప్పందం జరగబోతోంది. ఇది మనదేశానికి రక్షణ రంగ పరంగా ఎంతో ఉపయుక్తం కానుండగా.. యుకేకు వాణిజ్య పరంగా ప్రయోజనకారిగా మారనున్నది. ఇక మరో కీలక ఒప్పందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కుదరబోతోంది. ఇందులో భాగంగా ఇరు దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కలిసి పని చేస్తాయి. ఆ తర్వాత మరో కీలక ఒప్పందం ఇండో-పసిఫిక్ రీజియన్‌కు సంబంధించినది. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని నిరోధించి.. క్వాడ్ దేశాలు (ఇండియా, ఆమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టేలా ఈ ఇండో-పసిఫిక్ ఒప్పందం వుండబోతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంధన వినియోగంపై ఇండియా, యుకేలు మరో ఎంఓయు కుదుర్చుకోబోతున్నాయి. ఈ నాలుగింటితోపాటు ఇరు దేశాల మధ్య మంజూరయ్యే వీసాల సంఖ్యను పెంచే చర్యలపై కూడా ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయబోతున్నారు. ఇలా కీలక ఒప్పందాల కోసమే బోరిస్ జాన్సన్ ఇండియా వచ్చారు. సందర్భం కాస్త సంక్లిష్టమే అయినా.. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత పరపతి దృష్ట్యా సున్నితమైన అంశాలను ప్రస్తావించకుండానే ఇండియాకు దగ్గరయ్యేందుకు యుకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రాధాన్యతనిచ్చారన్నది ఈ కచ్చితంగా చెప్పుకోవాల్సిన మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యుకే, ఇండియా మధ్య కుదరబోయే ఒప్పందాన్ని గేమ్ చేంజర్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో మెటావర్స్ ఆధారిత టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ అంతా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)దేనన్న అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తోంది. అందుకే ఈ విషయంలో జరగనున్న అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారని సమాచారం.
ఇండో-పసిఫిక్ రీజియన్లో యుకే, ఇండియా కలిసి పనిచేయాలన్న అంశం మనదేశానికే కాకుండా ఆ దేశానికి కూడా కీలకం కానున్నది. ఇండియాను ఇబ్బంది పెట్టే వ్యూహంలో భాగంగా హిందూ మహాసముద్రంలోకి చైనా భారీ ఎత్తున యుద్ద నౌకలను, జలాంతర్గాములను తరలించింది. ఓ సందర్భంలో అయితే.. హిందూ మహా సముద్రం మీదుగా ఇటు అరేబియా సముద్రంలోకి, అటు బంగాళాఖాతంలోకి కూడా చైనా జలాంతర్గాములు ప్రవేశించినట్లు నేవీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. భారత దేశానికి చుట్టూ వున్న దేశాలు శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్, మాల్దీవులు వంటి దేశాలకు రుణాలందిస్తూ.. వాటిని ఇండియాకు దూరం చేసేందుకు కూడా డ్రాగన్ కంట్రీ ప్రయత్నించింది. అందుకే చిరకాల మిత్ర దేశాలుగా వున్న శ్రీలంక, నేపాల్ ఓ దశలో పూర్తిగా చైనా గుప్పిట్లోకి చేరాయి. శ్రీలంకలోని హంబన్‌టోట, కొలంబో నౌకాశ్రయాలపై చైనా పెత్తనం ఇప్పటికీ నడుస్తోంది. అటు పసిఫిక్ ఓషియన్‌లో అయితే చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. వాటిని తమ కాలనీలుగా క్లెయిమ్ చేసుకుంటోంది. తద్వారా పసిఫిక్ ఓషియన్‌లోని చాలా భాగాలన్ని తమ సముద్ర జలాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ఇది అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు ఇబ్బందికరమైన అంశం. అందుకే ఈ దేశాలు ఇండియాతో కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడి చైనాకు చెక్ పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇదేతరుణంలో ‘ఆకస్’ (AUKUS) కూటమి పేరిట ఆస్ట్రేలియా, యుకే, యుఎస్ దేశాలు తమ ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయి. ఈ కూటమిలో కీలకంగా వున్న యుకే, ఆస్ట్రేలియా దేశాలు ఇండియాతో వ్యూహాత్మక ఒప్పందాలకు సిద్దమయ్యాయి. అందులో భాగంగానే యుకే, ఇండియా మద్య ఇండో-పసిఫిక్ ఒప్పందం కుదరబోతోంది. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ అంశాలలో భారత్ పాత్రను మరింత పెంచేందుకు దోహదమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే, రక్షణ ఒప్పందం విషయంలో మాత్రం యుకే ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన దేశం రక్షణ రంగంలో సుమారు 65 శాతం మేరకు రష్యాపై ఆధారపడి వుంది. డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో రష్యాతో మనకు నాలుగు దశాబ్దాలుకుపైగా ఒప్పందాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ డిపెండెన్సీని తగ్గించుకునేందుకు, మనమే స్వయంగా యుద్దరంగ అవసరాలను ఉత్పత్తి చేసుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగైదేళ్ళ క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ చర్యలు ఇపుడిపుడే ఫలప్రదమవుతున్నాయి. స్వదేశంలో తయారయ్యే పరికరాలు, యుద్ద విమానలు, జలాంతర్గాములు ఇపుడు కీలక ప్రయోగ దశకు చేరాయి. అదేసమయంలో బ్రహ్మోస్ వంటి మిస్సైళ్ళను మనం ఉత్పత్తి చేసి విదేశాలకు విక్రయించేందుకు కూడా రెడీ అవుతున్నాం. దేశీయంగా యుద్ద రంగ అవసరాలను ఉత్పత్తి చేసుకుంటూనే అభివృద్ధి చెందిన మరీ ముఖ్యంగా బలమైన ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, యుకే వంటి దేశాల నుంచి డిఫెన్స్ టెక్నాలజీని, కీలకమైన ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకుంటోంది. వాటి తయారీ విధానానికి సంబంధించిన టెక్నాలజీని కూడా పొందుతూ.. వాటిని దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది మోదీ ప్రభుత్వం. అదేసమయంలో ఇండియా వంటి దేశాలు రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించే వ్యూహంతో యుఎస్, యుకే, ఫ్రాన్స్ దేశాలు ఇండియాకు టెక్నాలజీ బదలాయింపుతో కూడిన ఆయుధ విక్రయ ఒప్పందాలకు సిద్దమవుతున్నాయి. తాజాగా బోరిస్ జాన్సన్ సమక్షంలో ఇరు దేశాలు సంతకం చేయబోయే డిఫెన్స్ ఒప్పందం కూడా అలాంటిదేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక తరుణంలో ఇండియా పర్యటనకు వచ్చిన బోరిస్ జాన్సన్ కీలక ఒప్పందాలతో పరస్పర సహకారాన్ని పెంచేందుకు ప్రాధాన్యతనివ్వడం వల్లనే ఈ కీలక తరుణాన్ని ఎంచుకున్నారనిపిస్తోంది.
