Brain Chip: ‘ఇస్మార్ట్’ కోతి..మెదడులో కంప్యూటర్ చిప్ తో వీడియో గేమ్స్ ఆడేస్తోంది!

మనిషి మేధస్సుకు అంతం లేదు. అనాగరికంగా అడవుల్లో తిరిగిన నాటి నుంచి కంప్యూటర్ తో ప్రపంచం మొత్తాన్ని చేతి వేళ్ళ పై తీసుకువచ్చినంత వరకూ.. ఒక్కోదశా మనిషి మేధస్సును మరింత పదును పెడుతూనే ఉంది. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న మనం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసే దిశలో పయనిస్తున్నాం.

  • KVD Varma
  • Publish Date - 5:24 pm, Sat, 10 April 21
Brain Chip: 'ఇస్మార్ట్' కోతి..మెదడులో కంప్యూటర్ చిప్ తో వీడియో గేమ్స్ ఆడేస్తోంది!
Neuro Link

మనిషి మేధస్సుకు అంతం లేదు. అనాగరికంగా అడవుల్లో తిరిగిన నాటి నుంచి కంప్యూటర్ తో ప్రపంచం మొత్తాన్ని చేతి వేళ్ళ పై తీసుకువచ్చినంత వరకూ.. ఒక్కోదశా మనిషి మేధస్సును మరింత పదును పెడుతూనే ఉంది. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న మనం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసే దిశలో పయనిస్తున్నాం. నిరంతరం జరిగే పరిశోధనల్లో పుట్టుకొచ్చే కొత్త ఆవిష్కరణలు మొదట విన్నపుడు వింతగా ఉన్నా.. తరువాత అవి అవసరాలుగా మారిపోతాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఒక పరిశోధనలో వస్తున్న ఫలితాలు మరో కొత్త ముందడుగుకు నాంది కాబోతున్నట్టు అనిపిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

కోతి నుంచి మనిషి వచ్చాడంటారు. మరి కోటి మెదడును నియంత్రించే కంప్యూటర్ చిప్ చేయగలిగితే.. అది మానవుల మెదడును కూడా నియంత్రించే అవకాశం ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చింది ప్రఖ్యాత ఔత్సాహిక వ్యాపార వేత్త ఎలన్ రీవ్ మస్క్ సంస్థ న్యూరో లింక్ సంస్థకి. ఆ దిశలో ప్రయోగాలు మొదలు పెట్టింది. మొదట ఒక ఆవిష్కరణ చేశారు. అది ఏమిటంటే.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ పేస్ ఇంప్లాంట్ దీనినే కంప్యూటర్ చిప్ గా చెప్పుకుంటాం. గతేడాది ఒక పందిపై ఈ చిప్ తో పరిశోధనలు చేశారు. అవి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఒక కోతికి ఈ చిప్ అమర్చారు. అది కూడా సక్సెస్ అయింది. ఈ చిప్ తో వారు సాధించిన విజయాన్ని మూడునిమిషాల వీడియోగా న్యూరో లింక్ షేర్ చేసింది. ( ఆ వీడియో కింద ఉంది)

ఈ ప్రయోగం ఎలా చేశారు..

‘పేజర్’ అనే పేరుగల తొమ్మిదేళ్ల మగ కోతిని తమ ప్రయోగాలకు ఎంచుకుంది న్యూరో లింక్ సంస్థ. దాని మెదడు రెండువైపుల చేయి, అరచేతిని నియంత్రించే మెదడు భాగం పొరల్లో రెండు న్యూరో లింక్ చిప్స్ ను ఆరు వారాల క్రితం అమర్చారు. కంప్యూటర్ చిప్ లను కోతి మెదడుతో అనుసంధానం చేసేందుకు దాదాపుగా 2000 సూక్ష్మమైన ఎలక్ట్రోడ్స్ ను ఉపయోగించారు. ఈ చిప్ లతో కంప్యూటర్ స్క్రీన్లకు వైర్ లెస్ మాధ్యమంగా అనుసంధానించారు. అదేవిధంగా ఈ కంప్యూటర్ చిప్ లతో బ్లూ టూత్ స్పీకర్ ద్వారా మైబైల్ ఆప్ కు అనుసంధానం చేసి దాని చర్యలను నియంత్రించారు.

ఇప్పుడు కోతి ఎలా ప్రవర్తించింది?

మొదటి దశలో.. కోతి ఎదుట స్క్రీన్ ను అమర్చి దాని చర్యలను రికార్డు చేశారు. వీడియో గేమ్ ఆడే సమయంలో.. కోతి జాయ్ స్టిక్ తో కర్సర్ ను అనుసరించింది.

రెండో దశలో.. అనంతరం జాయ్ స్టిక్ కనెక్షన్ ను తొలగించారు. అద్భుతంగా కోతి మునుపటివలే కర్సర్ ను తొలగించిన జాయ్ స్టిక్ తో అనుసరించింది. కోతి డీకోడెడ్ న్యూరల్ చర్యలతో కర్సర్ ను ఫాలో అయింది. ఈ  విషయాన్ని వీడియోలో గమనించవచ్చు.

మూడోదశలో.. జాయ్ స్టిక్ ను పూర్తిగా తొలగించారు. అప్పుడు కూడా కోతి పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా స్క్రీన్ పై కర్సర్లను అనుసరించింది. కోతి తన సంకల్పం, ఆలోచన అనుసరిస్తూ గేమ్ ఆడింది. స్క్రీన్ పై కర్సర్ల వేగం పెంచినప్పటికీ కోతి కూడా అంతే వేగంతో అనుసరించింది. ఇదంతా కోతి మెదడ్లో అమర్చిన చిప్ ల వల్ల సాధ్యమైందంటున్నారు పరిశోధకులు.

ఇది ఎలా సాధ్యమైందంటే..

ఈ చిప్ లతో అనుసంధానమైన ఎలక్ట్రోడ్లు మెదడు సంకేతాలను రికార్డ్ చేసి డీకోడింగ్ చేయడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడిస్తున్నారు. ఈ రికార్డింగ్, డీకోడింగ్ సంకేతాల తీరును వైర్ లెస్ గా కంప్యూటర్ స్క్రీన్ పై పరిశోధకులు రికార్డు చేశారు. దీన్ని కూడా వీడియోలో మనం పరిశీలించవచ్చు

దీనివల్ల మానవులకు ఏమిటి ప్రయోజనం..

భవిష్యత్తులో ఈ తరహాలోనే మనిషి మెదడులో చిప్ లను అమర్చి అల్జీమీర్స్.. డిమెంతియా, వెన్నెముకకు తగిలిన గాయాలకు చికిత్స, పెరాలసిస్.. తదితర వ్యాధులను నియంత్రించటానికి వీలవుతుందంటున్న న్యూరో లింక్ పరిశోధకులు. ఈ సాంకేతికతో మానవునికి కృత్రిమ మేదస్సును ప్రేరేపించడం, పెంచడం చేయవచ్చు అని చెబుతున్నారు.

మనిషిలో ఎలా అమరుస్తారు?

2020 ఆగస్టులో కూడా ఎలన్ మస్క్ ఒక పందిలో న్యూరోలింక్ చిప్ అమర్చి దాని చర్యలను నియంత్రించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించిన ఎలన్ మస్క్ ఒక నాణెం పరిమాణంలో ఉండే చిన్న చిప్ ను ప్రదర్శించారు. దీన్ని మనిషి మెదడులో అమర్చుతారని వెల్లడించారు. ఈ శస్త్ర చికిత్సను పెద్ద వాషింగ్ మిషన్ల పరిమాణంలో ఉండే రెండు రోబట్స్ చేస్తాయని తెలిపారు.
5 మైక్రాన్ల పలుచని, సన్నంగా ఉండే ఆరు మిల్లీమీటర్లు పొడువున్న కనెక్టర్లను అమరుస్తారు. ఇంకా చెప్పాలంటే అది అంగుళంలో 0.24 వంతు ఉంటుంది. ఈ చికిత్సలో రక్తం రాదని ఎందుకంటే రోబో సెన్సార్లు రక్త నాళాలను కట్ కాకుండా నియంత్రిస్తూ బ్లేడ్లను చర్యలను నియంత్రిస్తాయన్నారు. చిప్ ను అమర్చుకున్న వ్యక్తి కి ఎలాంటి అసౌకర్యం కలుగదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ పరిశోధనలన్నీ మనిషిపై జరపడానికి ముందస్తుగా సమాయత్తం చేయడానికి పరిశోధనలు జరుపుతున్నామని వెల్లడించారు.

మరి ఇబ్బందులు ఉన్నాయా?

ఈ పరిశోధనలపై కొంతమంది శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనిషిలో అత్యంత కీలకమైన భాగం తల దానికి శస్త్ర చికిత్స అంటేనే రిస్క్ తో కూడింది. అది కూడా ఒక యంత్రానికి మన మెదడు డాటాను రాయమని అప్పజెప్పడం మరింత ప్రమాదమనే వాదన వారు వినిపిస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు ఈ చిప్ ల భద్రత ఎంత వరకు ఉంటుంది అనే సందేహమూ వారు వ్యక్తం చేస్తున్నారు.  వీటిని హ్యాక్ చేయడం, వైరస్ లను చొప్పిస్తే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రతి విషయానికీ బొమ్మా బొరుసూ ఉంటుంది. ముఖ్యంగా సాంకేతిక ఆవిష్కరణలకు మంచీ.. చెడూ రెండూ ఉంటాయి. అంతమాత్రం చేత ప్రస్తుత ఈ పరిశోధన మంచిది కాదు అని.. నిర్ణయించడం సరైనది కాదు. ఎందుకంటే.. గతంలో పూర్తిగా శరీరం చచ్చుబడిపోయిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక లింక్ ద్వారా ఆయన భావాలను చదివి టైప్ చేయగలిగిన కంప్యూటర్ ను రూపొందించిన విషయం తెలిసిందే.. ఇదే రీతిలో ఎలన్ మస్క్ పరిశోధన సంస్థ రూపొందిస్తున్న కంప్యూటర్ చిప్ లు మానవాళికి ఉపయోగపడతాయని ఆశిద్దాం.

ఎలన్ మస్క్ ఘనత ఇదీ..
అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఎలన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ. ఎన్నో మైలు రాళ్లను ఈ సంస్థ సాధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కు ఒక ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్( అంతరిక్ష నౌక)ను పంపిన ఘనత స్పేస్ ఎక్స్ దే. అదే విధంగా నిర్ణీత కక్ష్యలోకి లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ ద్వారా స్పేస్ క్రాఫ్ట్ ను పంపి తిరిగి భూమికి తీసుకొచ్చిన తొలి ప్రైవేటు కంపెనీ కూడా స్పేస్ ఎక్స్ దే

ఈ ప్రయోగం వీడియో మీకోసం..

Also read: Spider Monkey: ఆ కొండముచ్చు కోసం ఊరు ఊరంతా ఏడ్చేసింది.. కారణం తెలిస్తే మీరూ అయ్యో అంటారు..

Monkey Stunts : అందుకేనేమో కోతిచేష్టలు అంటుంటారు.. ఈ కోతులు చేస్తున్న పని చూస్తే నవ్వాపుకోలేరు..