71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా దేశ యువతకు తన అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. రాబోయే దశాబ్దం నవభారతం.. యువతరానిదేనన్నారు. రాబోయే నవతరం సైతం దేశ మౌలిక విలువలకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. లక్ష సాధనలో భాగంగా చేపట్టే ఆందోళనలు.. శాంతియుతంగా పోరాటం సాగించాలని.. రాజ్యాంగ విధానాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. మానవాళికి మహాత్మా గాంధీ ఇచ్చిన గొప్ప వరం అహింస అని గుర్తు చేశారు. ‘వసుధైక కుటుంబం’ అని భారతదేశం ఇచ్చే సందేశమే.. ఇతర దేశాలన్నింటితో మన సంబంధాలను మరింత పటిష్టంగా నిలుపుతుందన్నారు.
ప్రస్తుతం 21వ శతాబ్ధంలో ఉన్నామని.. కొత్త దశాబ్ధంలో నయా భారత్ అభివృద్ధితో పాటుగా.. నవతరం సరికొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నానన్నారు. దేశాభివృద్ధిలో కొత్తతరానికి చెందిన యువత భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇక మన దేశానికి సంబంధించిన మౌలిక విలువల విషయంలో.. నవతరం స్థిరమైన నిర్ణయంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. నేషన్ ఫస్ట్ అనేది చాలా ముఖ్యమని.. యువతతోనే న్యూ ఇండియా కలను సాకారం చేసుకోగలమంటూ దేశ యువతకు రాష్ట్రపతి సందేశాన్ని ఇచ్చారు.