Election 2022: గెలుపు సరిపోదు.. భారీ ఆధిక్యంతో గెలవాల్సిందే.. బీజేపీ ముందున్న సవాల్..

| Edited By: Janardhan Veluru

Jan 17, 2022 | 4:55 PM

BJP - Assembly Elections 2022: పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి గెలిస్తే చాలు అనుకుంటారు. కానీ బీజేపీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా

Election 2022: గెలుపు సరిపోదు.. భారీ ఆధిక్యంతో గెలవాల్సిందే.. బీజేపీ ముందున్న సవాల్..
Bjp
Follow us on

BJP – Assembly Elections 2022: పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి గెలిస్తే చాలు అనుకుంటారు. కానీ బీజేపీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గెలుపు అందుకోడానికే ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న ప్రతికూల వాతావరణంలో, భారీ ఆధిక్యంతో గెలుపే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యం బీజేపీకి అంత అవసరంగా మారింది. దీనికి కారణం సార్వత్రిక ఎన్నికల కంటే ముందు.. ఇదే ఏడాదిలో జరిగే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలే. కేంద్రంలో వరుసగా రెండో సారి మరింత మెజారిటీతో మోడీ (PM Narendra Modi) ప్రభుత్వం ఏర్పాటవడంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానిదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు బీజేపీ (BJP)కి ప్రాణావసరంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే సవాలుగా మారగా, పంజాబ్‌లో తాము గెలిచినా, ఓడినా తమ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను గద్దె దించితే చాలు.. కమలనాథులకు అదే పెద్ద విజయం. కానీ ఏదీ అనుకున్నంత ఈజీ కాదు.

నాడు మోదీ వేవ్.. నేడు మారిన సీన్..
2014 నుంచి దేశంలో బీజేపీ సాధించిన విజయాల వెనుక ప్రధాన కారణం మోడీ వేవ్. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ విజయాలు ఆ వేవ్ ఫలితమే. అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ మోడీ మాత్రమే ముఖం. కానీ నేడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖాలు మారాయి. యూపీలో ప్రధాని మోదీ- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాలతో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రులెవరూ తమదైన మార్కు చాటుకోలేకపోయినా, యూపీలో యోగి ఆరంభం నుంచే తన మార్కును ప్రదర్శిస్తూ వచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే మాఫియా డాన్లు, క్రిమినల్ గ్యాంగులను వరుసపెట్టి ఎన్‌కౌంటర్లు చేస్తూ ఎన్‌కౌంటర్ రాజ్ అనే పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఈ ముఖాల అనుకూల, ప్రతికూల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికితోడు ఐదేళ్ల ప్రభుత్వ రిపోర్టు కార్డును కూడా ఓటర్లు పరిశీలిస్తున్నారు. అభివృద్ధి, పనితీరు గురించి పెద్దగా విమర్శలు లేకున్నా.. వ్యవహారశైలి గురించి యోగి విమర్శలు ఎదుర్కొన్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు పెద్ద నేతలు పార్టీని వీడడంతో కొత్త సవాల్‌ తలెత్తింది. ముఖ్యంగా ఓబీసీ వర్గం, కొంత వరకు బ్రాహ్మణ నేతలు యోగి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2017లో సాధించిన భారీ విజయంలో ఈ రెండు వర్గాల భాగస్వామ్యమే అత్యంత కీలకం. నాయకులు పార్టీలు మారడానికి వ్యక్తిగత కారణాలున్నప్పటికీ, ఈ వలసల ప్రభావం ఎన్నికలపై ఉండబోదని చెప్పడానికి వీల్లేదు. ఈ పరిణామాల నడుమ గెలుపు అంత సులభం కాదని కమలనాథులకు అర్థమవుతోంది. అయినా సరే, గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదల వారిలో మరింత పెరిగింది.

గెలుపు సరిపోదు.. ఆధిక్యం కావాల్సిందే
5 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజుల్లోనే మొదట రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేల సంఖ్య చాలా కీలకం. అధికార బీజేపీకి ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలుంటే, రాజ్యసభ ఎన్నికల్లో అన్ని ఎక్కువ సీట్లు సాధించగల్గుతుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎలక్ట్రోరల్ కాలేజిలో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యే కీలకం. పైగా 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు టీఆర్ఎస్, బీజేడీ పార్టీలు మద్ధతిచ్చాయి. యూపీఏ మిత్రపక్షాలు మినహా తటస్థ పార్టీలన్నీ ఎన్డీయే అభ్యర్థికి మద్ధతివ్వడంతో గెలుపు సునాయాసమైంది. గతంలో మద్ధతిచ్చిన టీఆర్ఎస్ సహా పలు తటస్థ రాజకీయ పార్టీలు ఈసారి మద్ధతిచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో సొంత బలం పుష్కలంగా ఉంటే తప్ప గెలుపు అంత సులభం కాదు. అందుకే 403 ఎమ్మెల్యే స్థానాలున్న యూపీలో గెలుపు బీజేపీకి అంత కీలకంగా మారింది. కేవలం బొటాబొటి మెజారిటీతో గెలిస్తే చాలదు, గతంలో మాదిరి భారీ ఆధిక్యత సాధించినప్పుడే తదుపరి జరిగే ఎన్నికల్లోనూ ఆధిక్యతను కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది.

-మహాత్మా కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ

Also Read:

BJP Agenda: ఇరకాటంలో కమలదళం.. ఎజెండా నిర్దేశించడంలో విఫలం..

Akhilesh Yadav: ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీలో చేర్చుకోం.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కీలక వ్యాఖ్యలు