BJP Agenda: ఇరకాటంలో కమలదళం.. ఎజెండా నిర్దేశించడంలో విఫలం..

BJP Agenda: ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో భారతీయ జనతా పార్టీ కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా విఫలమైంది. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే బీజేపీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన...

BJP Agenda: ఇరకాటంలో కమలదళం.. ఎజెండా నిర్దేశించడంలో విఫలం..
Bjp

BJP Agenda: ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో భారతీయ జనతా పార్టీ కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా విఫలమైంది. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే బీజేపీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన ఎజెండాపై ప్రతిస్పందించాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. జాతి గౌరవం, దేశ భద్రత, అవినీతి, సాంస్కృతిక జాతీయవాదం, హిందుత్వం, రామ మందిరం వంటి అంశాలతో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలను ఎదుర్కొంది. గెలుపోటములను పక్కనపెడితే, బీజేపీ ఎన్నికల ఎజెండాపై ఎలా స్పందించాలో తెలియక రాజకీయ ప్రత్యర్థులు ఇబ్బందులు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాను ఎదుర్కొనే క్రమంలో రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, మమతా బెనర్జీ వంటి నేతలు ఆలయాల చుట్టూ పరుగులుతీయాల్సి వచ్చింది. అలాంటి కమలదళం జాతీయ రాజకీయ గమనాన్ని నిర్ణయించగలిగే ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాదు, మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎజెండాను నిర్దేశించలేకపోతోంది.

షెడ్యూల్‌కు ముందు పైచేయి..

షెడ్యూల్ ప్రకటించక ముందు వరకు ప్రచారంలో బీజేపీదే పైచేయిగా కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోది, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా కమళదళ అగ్ర నాయకులు పలు ప్రచార కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శించారు. అయోధ్య రామ మందిరం, కాశీ కారిడార్, మథుర శ్రీకృష్ణ జన్మస్థాన్ గురించి బీజేపీ నేతలు పదే పదే మాట్లాడారు. పూర్తిచేసిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టుల శంఖుస్థాపనలను చాలా అట్టహాసంగా చేస్తూ తమది కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఘనంగా చాటుకున్నారు. మొత్తంగా హిందుత్వ భావోద్వేగాన్ని ముడిసరుకుగా మార్చుకుని కులాలకు అతీతంగా హిందువుల్లోని అన్ని వర్గాల ఓట్లను పొందాలన్న ప్రయత్నం చేశారు.

నిజానికి 90వ దశకం తొలినాళ్ల నుంచి అయోధ్య రామమందిర అంశం ప్రతి ఎన్నికల్లోనూ అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది. పార్టీ గెలిచినా, ఓడినా ఈ నినాదాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అయితే నినాదాన్ని నిజం చేస్తూ మందిర నిర్మాణ పనులు చకచకా జరుగుతున్న వేళ ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. నిజానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే స్థానాన్ని సైతం అయోధ్యకు మార్చి ఊపు తెద్దామనుకున్న కమళనాథులు, చివరకు ఆయన సొంత ఇలాఖా గోరఖ్‌పూర్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. అప్పుడైతేనే యోగి మిగతా అన్ని నియోజకవర్గాలపై దృష్టి పెట్టడానికి వీలుపడుతుందని, లేదంటే మారిన స్థానంలో ప్రచారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అగ్రనాయకత్వం భావించింది. అయితే దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. యోగిని అప్పుడే ఇంటికి పంపించేశారంటూ ఎద్దేవా చేశారు.

ఒక్కసారిగా మారిన పరిస్థితి..

ఎన్నికల సమయంలో అసంతృప్తులు పార్టీలు మారడం చాలా చోట్ల కనిపించే విషయమే. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపేమీ కాదు. కాకపోతే ఏకంగా కేబినెట్ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు పెద్ద నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీని వీడడం, వీడినవారు తమ ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ క్యాంపులో చేరడం కమలదళాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యోగి కొలువులో మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీలు మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

దీంతో అప్పటి వరకు బీజేపీ నిర్దేశించిన రామమందిరం, కాశీ కారిడార్, మథుర శ్రీకృష్ణ జన్మస్థాన్ గురించి జరిగిన చర్చ కాస్తా బీజేపీలో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న అంశాలపైకి దారిమళ్లింది. పార్టీలోనూ ఆత్మపరిశీలన, పోస్టుమార్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కాషాయం వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే, ఇటువంటి పరిణామాలు సృష్టించిన ప్రతికూల రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ ఎదురొడ్డి పోరాడాల్సి ఉంటుంది.

రైతు ఆందోళనలతో మొదలైన గడ్డుకాలం..

జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో, తమ సొంత పార్టీగా భావించే రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్ఎల్డీ)ను కాదని జాట్లు గత ఎన్నికల్లో బీజేపీ వెంట పరుగులు తీశారు. ఇందుకు ముజఫర్‌నగర్ అల్లర్లు దోహదపడ్డాయి. ఈ అల్లర్లతో ఏర్పడ్డ జాట్-ముస్లిం విభజన బీజేపీకి లబ్ది చేకూర్చింది. అయితే ఈ అభిమానం రైతు ఆందోళనలతో ఒక్కసారిగా తలకిందులైంది. అత్యధిక శాతం వ్యవసాయదారులైన జాట్లు, బీజేపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. “ఆధి రోటీ ఖాయేంగే, బీజేపీకో జితాయేంగే” (తినేందుకు సగం రొట్టెలు దొరికినా చాలు, బీజేపీకి ఓటేస్తాం) అనే నినాదాలు గతంలో జాట్ల నుంచి వినిపించగా, రోజువారీ రొట్టెలు సంపాదించడమే సమస్యగా మారిందని జాట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కులం గోడలు దాటేనా??

2017 ఎన్నికల్లో కులాల గోడలు దాటి అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటేసినట్టు కనిపించినా, జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు కూడా కుల సమీకరణాలే ఆ పార్టీని గెలిపించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నాడు చాలా కులాలను బీజేపీ వెంట నడిచేలా చేయడంలో ఆయా కుల పార్టీలతో కూటమి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య వంటి బలమైన ఓబీసీ నేతలు ఎంతగానో లాభించిన అంశాలు. అయితే ఇప్పుడు వివిధ కుల సంఘాల నాయకులను, వెనుకబడిన కులాలు, దళితులకు ప్రాతినిధ్యం వహించే చిన్న పార్టీలతో సమాజ్‌వాదీ జతకట్టింది.

గతంలో తమ తమ కులాల ఓట్లను బీజేపీకి జతకలపడంలో కీలకంగా వ్యవహరించిన మౌర్య, సైనీ, ధారాసింగ్ చౌహాన్ వంటి మంత్రులు నిష్క్రమించారు. ఈ ఓట్లు ఇప్పుడు సమాజ్‌వాదీవైపు తిప్పుకోగలిగితే బీజేపీకి తీవ్ర ఇబ్బందులు తప్పవు. కులాల గోడలు దాటని యూపీ సమాజాన్ని హిందుత్వ భావోద్వేగంతో కలిపి ఒక గొడుగు కిందకు తీసుకురావడం అంత సులభం కాదని కమలనాథులకు ఇప్పటికే అర్థమైంది. ఈ దశలో ఏ ఎజెండాను నిర్దేశించలేక, ప్రత్యర్థి నిర్దేశించిన ఎజెండా వెంట పరుగులు తీస్తోంది.

-మహాత్మ కొడియార్,  టీవీ9, ఢిల్లీ బ్యూరో

Also Read: Rashmi Gautam: సంక్రాంతి స్పెషల్.. బ్లూటాప్‌లో రష్మి గౌతమ్ పరువాల విందు

PM Narendra Modi: దేశం కోసం నూతన ఆవిష్కరణలు చేద్దాం.. జనవరి 16న ‘స్టార్టప్‌ డే’గా జరుపుకుందాం: ప్రధాని మోదీ

Virat Kohli Steps Down As Test Captain: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ..!

Published On - 10:20 pm, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu