ఓరి నీ దుంపదెగ ఇదేం పిచ్చి.. దివ్యాంగుల కోటాలో MBBS సీటు కోసం కాలు నరికేసుకున్నాడు!
డాక్టర్ కావాలన్న కల ఎందరికో ఉంటుంది. ఊరికే కల కంటే ఏముంది..? దాన్ని సాకారం చేసుకోవడంలోనే కదా అసలు సత్తా తేలేది. కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే గమ్యం చేరువవుతుంది. అందుకు నిర్వహించే నీట్ పరీక్ష వడపోతలో నకిలీలు పడిపోతే.. నికార్సైన విద్యార్థులు ముత్యాల్లా మెరుస్తారు. వారికి మాత్రమే డాక్టర్ కల నెరవేరుతుంది..

జౌన్‌పుర్, జనవరి 24: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి మాత్రం ఎలాగైనా డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. వరుసగా 2 సార్లు నీట్ పరీక్షలో బోల్తా కొట్టడంతో ఈ సారి దివ్యాంగుల కోటాలో తేలికగా సీటు సంపాదించాలని తీవ్రంగా ఆలోచించి ఓ దారుణ నిర్ణయానికి వచ్చాడు. కనీవినని రీతిలో ఏకంగా తన పాదాన్ని తన చేతులోనే నరుక్కున్నాడు. ఇంతజేసి చివరకు పోలీసులకు దొరికిపోవడంతో మొత్తం నాటకం బెడిసికొట్టింది. అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌కు చెందిన సూరజ్ భాస్కర్ (20) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకోవడానికి 2 సార్లు ప్రయత్నించాడు. అయితే రెండు సార్లు విఫలమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో అతని కాలు తెగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు సూరజ్ సోదరుడు ఆకాష్ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సూరజ్ పొంతనలేని సమాధానాలు అనుమానం కలగడంలో అతడి ఫోన్ పరిశీలించారు. ఫోన్‌లో ఓ మహిళ నంబర్ డిలీట్ చేసి ఉంది. ‘నేను 2026 లో MBBS డాక్టర్ అవుతా’ అనిసూరజ్ తన డైరీలో రాసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అనుమానం మరింత బలపడింది. ఆ దిశగా దర్యాప్తు చేయగా షాకింగ్ విషయం వెల్లడైంది. ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తులో వెల్లడైన విషయాలను బుధవారం అదనపు పోలీసు సూపరింటెండెంట్ (నగరం) ఆయుష్ శ్రీవాస్తవ వెల్లడించారు.
రెండు సార్లు నీట్‌లో అర్హత సాధించని సూరజ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దివ్యాంగుల కోటాలో అయితే తేలికగా సీటు సాధించవచ్చని భావించి తన కాలును తానే నరుక్కుని, క్రిమినల్ దాడిగా చిత్రీకరించాడు. కట్టు కథతో దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో మొత్తం కథ అడ్డం తిరిగింది. ప్రస్తుతం సూరజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్ు లైన్ బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీష్ సింగ్ తెలిపారు. అయితే సూరజ్‌పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో తెలియడం లేదని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




