Uniform Civil Code: బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌… ఉమ్మడి పౌర స్మృతి? అందరికీ ఒకే ఫ్యామిలీ చట్టం సాధ్యమేనా?

| Edited By: Janardhan Veluru

Jul 12, 2021 | 2:20 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో దీర్ఘకాలంగా ఉన్న మూడు ప్రధానాంశాలు. ఈ మూడింటిలో మొదటి రెండు అంశాలు కొలిక్కి వచ్చాయి.

Uniform Civil Code: బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌... ఉమ్మడి పౌర స్మృతి? అందరికీ ఒకే ఫ్యామిలీ చట్టం సాధ్యమేనా?
Uniform Civil Code
Follow us on

అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో దీర్ఘకాలంగా ఉన్న మూడు ప్రధానాంశాలు. ఈ మూడింటిలో మొదటి రెండు అంశాలు కొలిక్కి వచ్చాయి. ఇక మిగిలింది ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) మాత్రమే. దీనికి కూడా బీజేపీ హైకమాండ్ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారా? ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మరో బీజేపీ కల నెరవేరే సమయం వచ్చిందా? ఉమ్మడి పౌరస్మృతిని 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది బీజేపీ. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రావాలంటూ ఇటీవలే (జూలై 7న) ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి ఒక ఆశగానే మిగిలిపోగూడదని జస్టిస్‌ ప్రతిభా సింగ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర న్యాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి…?
పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాలకు మన దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరుగా చట్టాలు ఉన్నాయి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్, పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి అమల్లో ఉన్నాయి. ముస్లిం పర్సనల్ చట్టాన్ని క్రోడీకరించలేదు. ముస్లింల మతపరమైన గ్రంథాలే వీటికి ఆధారంగా ఉన్నాయి.  ఈ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తూ,అన్ని మతాల వారికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా చేయడానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని వాదనలు చాలా కాలంగా వినిపిస్తోంది.

రాజ్యాంగంలో ఉందా?
రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో కామన్ సివిల్ కోడ్ ప్రస్తావన ఉంది. అధికరణం 44లో సాధారణ ప్రస్తావన చేశారు. దేశంలోని పౌరులందరికీ వర్తించేట్లు ఒకే చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి అని అధికరణం 44 పేర్కొంది. ఉమ్మడి పౌర స్మృతిని రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేడ్కర్‌ గట్టిగా సమర్ధించారు. కానీ నాడు హిందూ-ముస్లిం ఇరు వర్గాల నేతల నుంచీ ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైయ్యింది.

Supreme Court

సుప్రీంకోర్టు సూచనలు…
ఉమ్మడి పౌరస్మృతి తేవాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి  సుప్రీంకోర్టు సూచించింది. షా బానో కేసు, సరళా ముద్గల్‌ కేసు, జాన్‌ వల్లమట్టం కేసుల సందర్భంగా కామన్‌ సివిల్‌ కోడ్‌ అంశంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఉమ్మడి పౌరస్మృతిని పలు ముస్లీం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. వీటి ఆమోదం పొందడం కేంద్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు.

లా కమిషన్‌ ఏం చెప్పింది…?
ఉమ్మడి పౌరస్మృతి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా 2016లోనే లా కమిషన్‌ను మోడీ ప్రభుత్వం కోరింది. ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని 2018లో లా కమిషన్‌ చెప్పింది. ఇప్పుడున్న వివిధ చట్టాల్లో ఉన్న వివక్షను అంత మొందించి, సమానతకు తావిచ్చేలా మార్పులు చేయొచ్చునని సూచనలు చేసింది. మహిళల పట్ల వివక్ష అన్నది కేవలం ముస్లిం వైయక్తిక చట్టాల్లో మాత్రమే ఉందనుకోనడం పొరపాటుని పేర్కొంది. హిందూ, పార్సీ వైయక్తిక చట్టాల్లో సైతం ఇలాంటి ధోరణులున్నాయని ఎత్తిచూపింది. దాంపత్య పునరుద్ధరణ హక్కులు, సహభాగిత్వం, వివాహేతర సంబంధాల్లో జన్మించిన పిల్లల హక్కులు, దత్తత, సంరక్షకత్వం వగైరా అంశాల్లో ఎన్నో లోపాలున్నాయని తెలిపింది.

పార్సీ చట్టాల్లో కూడా కొన్ని సమస్యలున్నాయి. అన్యమతస్తుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు వారసత్వ హక్కు లేదు. పిల్లల సంరక్షణకు సంబంధించి కూడా వివిధ వైయక్తిక చట్టాల్లో వేర్వేరు విధానాలున్నాయి.బహు భార్యత్వం, వైవాహికేతర సంబంధాలు, నికా హలాలా వంటి అంశాలు పరిశీలించాల్సి ఉంది.

ఉమ్మడి పౌర స్మృతితో అనుకూలతలు
కులం, మతం, వర్గం, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా.
క్రిమినల్‌, సివిల్‌ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి.
ప్రస్తుత పర్సనల్‌ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు.
లైంగిక సమానత్వం సాధించవచ్చు, బహుభార్యత్వం నేరం
అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే చాన్స్‌

ఉమ్మడి పౌర స్మృతి ప్రతికూలతలు..
దేశంలో భిన్నత్వం వల్ల ఉమ్మడి పౌర చట్టంపై ప్రతిఘటన రావొచ్చు.
ఈ ఉమ్మడి చట్టం తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా కొన్ని వర్గాలు భావించే అవకాశం.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకి.
ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం.

-TV9 Telugu Research Dept

Also Read..

పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తూ ప్రకటన..

Kongu Nadu: దేశంలో మరోసారి తెరపైకి రాష్ట్ర విభజన అంశం.. తమిళనాట రాజకీయ రచ్చ

కోర్టు ‘కళ్ళు’ కప్పలేకపోయాడు..ప్రమోషన్ కొట్టేసినా.. చిక్కుల్లో పడి ఆ ఐఏఎస్ అధికారి అరెస్టయ్యాడు..ఎక్కడంటే ?