School Dropouts: బడికి దూరమౌతున్న గ్రామీణ పేద విద్యార్థులు.. ఒక తరం పిల్లలపై ప్రభావం.. కారణమేంటంటే..
School Dropouts: కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా విద్యార్థులపై కూడా పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే..
School Dropouts: కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా విద్యార్థులపై కూడా పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల అకడమిక్ లెర్నింగ్‌పై కరోనా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో డిజిటల్ సాధనాలు అందుబాటులో లేని విద్యార్థులు బడికి దూరమయ్యారని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో గడచిన 82 వారాల్లో.. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్ల మూసివేతలో ప్రపంచంలోనే మన దేశం రెండవ స్థానంలో నిలిచింది.
గత సంవత్సరం UNICEF నివేదిక ప్రకారం.. 40% మంది విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్‌కు అవసరమైన ఎటువంటి సాధనాలు అందుబాటులో లేవని తేలింది. దీని కారణంగా మెుత్తం విద్యార్థుల్లో పదవ వంతు మంది బడికి దూరమయ్యారు. ఢిల్లీలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి పది మందిలో ఇద్దరికి మెుబైల్ లేదా లాప్ టాప్ లేకపోవటం వల్ల ఏడాది నుంచి రెండేళ్లలో తమ చదువును అర్ధాంతరంగా ఆపివేయవలసి వచ్చిందని తేలింది.
దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా రెండూ లేవు. పిల్లలు పరికరాలకు యాక్సెస్ కలిగి ఉన్నప్పటికీ, ఉపాధి లేని కారణంగా డేటా ఖర్చులు భరించడం కష్టమని తెలుస్తోంది. ఒంటరిగా సంపాదించే కుటుంబాలకు ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. బాలికల విషయంలో వారికి గాడ్జెట్ ఇంట్లో వారు ఇవ్వకపోవటం, ఇంటి పనులు పురమాయించటం వల్ల అసమానతలకు గురయ్యారు. ఇంట్లోని మగ పిల్లలకు గాడ్జెట్‌లను ఇచ్చేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. 38 శాతం మంది బాలికలు విద్యకు దూరమయ్యారని UNICEF ఇండియా నివేదిక చెబుతోంది. చాలా మంది పిల్లలు తిరిగి బడికి వెళ్లేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఒక తరం యువత విద్యకు దూరమయ్యారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లెర్నింగ్ పావర్టీ 70 శాతం పెరిగింది.