BJP Chief: బీజేపీ జాతీయాధ్యక్షుడిపై కమలదళం కసరత్తు.. ప్రకటన ఎప్పడంటే..!

| Edited By: Balaraju Goud

Mar 19, 2025 | 2:48 PM

పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, విద్యార్థి దశ నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు, కార్యకర్తలకు మధ్య సమన్వయలోపం పెద్ద సమస్యగా మారింది. ఇది చివరకు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఆస్కారం కల్గించిందని కూడా పార్టీ అధినాయకత్వం, ఆర్ఎస్ఎస్ అంచనా వేసింది.

BJP Chief: బీజేపీ జాతీయాధ్యక్షుడిపై కమలదళం కసరత్తు.. ప్రకటన ఎప్పడంటే..!
Pm Modi Jp Nadda
Follow us on

భారతీయ జనతా పార్టీ (BJP)లో జాతీయాధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్ష పదవుల భర్తీ కోసం విస్తృతంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమవుతూ వస్తున్న కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను కొత్త హిందూ సంవత్సరంలో పూర్తి చేసి ప్రకటించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించిన తర్వాత జరిగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎంపికకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఈసారి బెంగళూరులో ఏప్రిల్ 18-20 తేదీల మధ్య నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈలోగా కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మార్చి 30 తర్వాత కొత్త హిందూ సంవత్సరం మొదలవుతుంది. ఏప్రిల్ 2వ వారంలో కొత్త జాతీయాధ్యక్షుడి పేరును ప్రకటించి, ఆ తర్వాత జరిగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు

బీజేపీలో జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం విస్తృతస్థాయి కసరత్తు ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. బీజేపీకి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మెట్రో నగరాల యూనిట్లు కలుపుకుని మొత్తం 36 రాష్ట్రాలున్నాయి. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయాలి. అలా ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించగా.. త్వరలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణ, ఒడిశా, హర్యానా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయిందని, ఇక కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించడమే మిగిలి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలకు సంస్థాగత ఎన్నికలను పూర్తిచేస్తేనే.. జాతీయాధ్యక్షుడి పేరును ప్రకటించాల్సి ఉంటుంది. త్వరలో ప్రకటించబోయే రాష్ట్రాలతో సగం రాష్ట్రాల సంఖ్యను పూర్తిచేసి, అప్పుడు కొత్త అధ్యక్షుడి పేరను ప్రకటించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమాయమత్తమైంది.

వారికే అధ్యక్ష పదవులు..!

బీజేపీ జాతీయాధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) పెద్దలతో పార్టీ అగ్రనాయకత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం బెంగళూరులో ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రతినిధి సభ సమావేశం జరుగుతోంది. నిజానికి ఈ కసరత్తు నవంబర్, డిసెంబర్ నెలల్లోనే జరగాల్సి ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ఆలస్యం కావడం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనాయకత్వం నిమగ్నమవడం వల్ల జాప్యం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తులో ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విభాగాలైన ఏబీవీపీ నేపథ్యం కల్గినవారికే అధ్యక్ష పదవులు అప్పగించాలని సమాలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో ‘సంఘ్’ నేపథ్యం కల్గినవారికే ప్రాధాన్యత లభించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవడంలో ఇది కూడా ఒక కారణమని నేతలు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుల విషయంలోనైనా, జాతీయాధ్యక్షుడి విషయంలోనైనా సరే ‘సంఘ్’ సిఫార్సులు, సూచనలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.

పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, విద్యార్థి దశ నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు, కార్యకర్తలకు మధ్య సమన్వయలోపం పెద్ద సమస్యగా మారింది. ఇది చివరకు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఆస్కారం కల్గించిందని కూడా పార్టీ అధినాయకత్వం, ఆర్ఎస్ఎస్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో.. పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేయగల్గిన సంఘ్ నేపథ్యం కలిగిన నేతలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అయితే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు సంఘ్ సూచనలు, బీజేపీ అగ్రనాయకత్వం సమాలోచనలు అందుకు భిన్నంగా ఉండడంతో ఆసక్తికర చర్చకు తెరలేపినట్టయింది..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..