
సార్వత్రిక ఎన్నికలకు ప్రీ-ఫైనల్స్‌గా మారిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక అసలు ఫలితాలు వెల్లడికావడమే మిగిలింది. ఈలోగా వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా రాజస్థాన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయంపై ఎగ్జిట్ పోల్ సంస్థలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించగా.. ఈ ఆనవాయితీని తిరగరాస్తూ వరుసగా మరోసారి కాంగ్రెస్ పార్టీయే అధికారాన్ని చేపడుతుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొందన్నది మాత్రం సుస్పష్టం. ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచినా ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ గెలిస్తే అశోక్ గెహ్లాట్, బీజేపీ గెలిస్తే వసుంధర రాజే అన్నట్టుగా ఈ ఇద్దరి మధ్యనే అధికారమార్పిడి జరుగుతూ వచ్చింది. పైపెచ్చు ఒకరి హయాంలో జరిగిన అవినీతిని మరొకరు వేలెత్తి చూపకుండా పరస్పరం లోపాయకారిగా సహకరించుకుంటూ వచ్చారన్న విమర్శలు కూడా ఇద్దరిపై ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా ఈ ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం కోసం 2018 నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2018లో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించి, గెలిపించినప్పటికీ సచిన్ పైలట్‌కు సీఎం సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం సీనియారిటీకే మొగ్గుచూపుతూ అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేసింది. సచిన్ పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టింది. అయినప్పటికీ కలహాల కాపురంగానే పాలన సాగుతూ వచ్చింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోనూ నాటి సీఎం కమల్‌నాథ్‌కు, యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య కూడా ఇదే తరహా ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో సహా బీజేపీలో చేరడంలో ప్రభుత్వం తలకిందులైంది. కాంగ్రెస్‌లో అసంతృప్తులనే ఆయుధంగా మలచుకుని ప్రభుత్వాలను మార్చే ‘ఆపరేషన్ లోటస్’ ఇక్కడ విజయవంతమైంది. రాజస్థాన్‌లోనూ సచిన్ పైలట్ అసంతృప్తిని ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంది. పైలట్ కూడా తన వర్గం నేతలతో తిరుగుబావుటా ఎగరేశారు. కానీ అశోక్ గెహ్లాట్ చాకచక్యంగా చక్రం తిప్పి ఈ తిరుగుబాటు నుంచి తన ప్రభుత్వం కుప్పకూలకుండా కాపాడుకోగలిగారు. ఆ సమయంలో సచిన్ పైలట్ బీజేపీలో చేరకుండా అధిష్టానం చేసిన మంత్రాంగం ఫలించింది. ఆ సందర్భంగా పైలట్‌కు అధిష్టానం నుంచి భరోసా కూడా దక్కింది.
కొన్నాళ్ల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అధ్యక్ష పీఠంపై గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే ఉండాలని గాంధీ కుటుంబం భావించింది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్‌కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించి, ఆ స్థానంలో పైలట్‌ను కూర్చోబెట్టాలని అనుకుంది. కానీ ఇక్కడ కూడా మరోసారి గెహ్లాట్ చక్రం తిప్పారు. చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించి తాను సీఎం కుర్చీ వదిలేది లేదని తేల్చి చెప్పారు. దాంతో అనివార్యంగా ఆ పదవిని మల్లికార్జున ఖర్గేకు అప్పగించాల్సి వచ్చింది.
ఇన్ని పరిణామాల అనంతరం ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం పదవి ఎవరికి ఇస్తారన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది హైకమాండ్‌కు అగ్నిపరీక్ష అనే చెప్పుకోవచ్చు. ఈసారి కూడా గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోడానికి ఏమాత్రం ఇష్టపడరు. అదే సమయంలో పార్టీలో సచిన్ పైలట్‌ను సీఎంగా చూడాలని ఆయన మద్దతుదారులు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ ఎవరివైపు మొగ్గుచూపుతుందన్నదే సర్వత్రా ఆసక్తి కల్గిస్తోంది. ఈసారి సచిన్ పైలట్‌కు అవకాశం ఇవ్వకపోతే మధ్యప్రదేశ్ తరహాలో ఆయన పార్టీని చీల్చి నష్టం కల్గిస్తాడన్న భయం ఓవైపు ఉంది. అలాగని అశోక్ గెహ్లాట్‌ను కాదంటే తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా అధిష్టానంలో ఉంది. గెహ్లాట్ మరియు పైలట్ ఇద్దరూ రాష్ట్రానికి బలమైన నాయకులు. ఇద్దరు నేతలూ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. గెహ్లాట్‌ను సోనియా గాంధీకి అత్యంత విశ్వసనీయులుగా పరిగణించగా, యువనేత పైలట్ అధిష్టానంలో యువనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సన్నిహితంగా ఉంటారు.
సీఎం పదవికి పోటీ పడుతున్నవారిలో అశోక్ గెహ్లాట్ ఇప్పటికీ మొదటివరుసలోనే ఉంటారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి రోజున, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎవరు సీఎం అవుతారని అశోక్ గెహ్లాట్‌ను ప్రశ్నించగా.. “సీఎం కుర్చీ నన్ను వదలలేదు, భవిష్యత్తులో కూడా వదిలిపెట్టదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1998 నుంచి 2003, 2008 నుంచి 2013, 2018 నుంచి 2023 వరకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అంతేకాదు, పార్టీలో సంస్థాగతంగా అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. రాజకీయ వ్యూహకర్తగా.. ఏ ఆట ఎప్పుడు ఆడాలో తెలుసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. గెహ్లాట్‌ను రాజకీయ మాంత్రికుడిగా కూడా పార్టీలో అభివర్ణిస్తారు.
గెహ్లాట్‌కు అతిపెద్ద ప్రత్యర్థి సచిన్ పైలట్. రాజస్థాన్‌లో ప్రభావవంతమైన గుర్జర్ సామాజికవర్గంలో పైలట్ అతిపెద్ద నాయకుడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సన్నిహిత నాయకులలో ఒకరు కావడం ప్లస్ పాయింట్. బహుశా ఈసారి రాజస్థాన్ పీఠాన్ని అధిష్టించే అవకాశం తనకు హైకమాండ్ ఇస్తుందని పైలట్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో పోలింగ్ రోజున ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పోస్టర్‌పై ఎవరి ముఖం ఉన్నా అందరూ కలిసి ఎన్నికల్లో పోరాడారని ఆయన అన్నారు. తద్వారా తన అభీష్టాన్ని చెప్పకనే చెప్పారు.
రొట్టె ముక్క కోసం రెండు పిల్లుల తగవులాటలో తీర్పు చెప్పిన కోతి లాభపడిన చందంగా ఈ ఇద్దరినీ కాదని మధ్యేమార్గంగా మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అవకాశాలు చాలా తక్కువే అయినప్పటికీ.. తనకు దక్కని పదవి తన వైరివర్గానికి దక్కకూడదు అన్న సహజ మానవ నైజాన్ని సంతృప్తిపరిచడానికి ఇదే సరైన మార్గమని కొందరు సూచిస్తున్నారు. కాంగ్రెస్ విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రఘు శర్మ, గోవింద్ సింగ్ దోటసార లేదా సీపీ జోషికి అవకాశం ఉంటుంది. వీరిలో బ్రాహ్మణ నేత రఘు శర్మ ముందంజలో ఉన్నారు. అతను గెహ్లాట్ ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి గా పనిచేశారు. అయితే గుజరాత్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా చేసిన ఆయన, అక్కడ పార్టీ ఓటమి తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. జాబితాలో మరో పేరు గోవింద్ సింగ్ దోటసార. ఆయన హైకమాండ్‌కు సన్నిహితంగా ఉన్నారు. ఈ జాబితాలో మూడో పేరు సీపీ జోషిది. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుంది… ఆ పరిస్థితి ప్రజలు కల్పిస్తున్నారా లేక ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారా.. అన్నది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..