
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో స్పీకర్లు నిర్ణయం తీసుకోకపోవడంతో గతంలోనూ కాలవ్యవధిని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు తాజా తీర్పులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగంలో పార్లమెంట్ (శాసన వ్యవస్థ), సుప్రీంకోర్టు, పాలన వ్యవస్థ మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇందులో వాటి అధికారాలు, పరిధులు వాటికున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం, పార్లమెంట్ రూపొందించిన చట్టాల ప్రకారం నడచుకోవాల్సి ఉంటుంది. కొత్తగా రూపొందించే చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించేలా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని, వాటిని రద్దు చేసే అధికారం ఉంది. ఈ క్రమంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. ఎవరు సుప్రీం అన్న ప్రశ్న ఎదురైంది. శాసన వ్యవస్థలో స్పీకర్ లేదా చైర్మన్ సుప్రీం అయినప్పటికీ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయని రాజ్యాంగం చెబుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును లోతుగా విశ్లేషిస్తే.. రాజ్యాంగ స్వరూపాన్ని మరోసారి గుర్తుచేసినట్టు అర్థమవుతోంది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నది వ్యాజ్యం. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని, లేదంటే నేరుగా అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలే యాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల) ఉన్నారు. వీరిలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ తరఫున బీ-ఫాం తీసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. మిగతా నేతలు పార్టీలు మారి కండువాలు కప్పుకోవడం లేదా విప్ బేఖాతరు చేయడం వంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని పిటిషనర్లు వాదించారు.
ఆ కేసు తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చేరుకుంది. సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదోపవాదనలు జరిగాయి. స్పీకర్‌కు గడవు నిర్ణయించి ఆ లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని స్పీకర్ తరఫు న్యాయవాదులు వాదించారు. గతంలో అనేక కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగంలోని కొన్ని అధికరణల ప్రకారం సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి అన్నది పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివరించారు. కోర్టు విచారణ సమయంలో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేల్లో గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాము పార్టీ మారలేదని, BRSలోనే కొనసాగుతున్నామని తెలిపారు. మొత్తంగా ఈ వాదనల అనంతరం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ఆ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన వద్దకు వచ్చిన అనర్హత వేటు పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా విచారణను మరింత జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తే, అనుమతించవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే.. ఆ ఎమ్మెల్యేకు ప్రతికూలంగా నిర్ణారణకు రావొచ్చని కూడా వెల్లడించింది.
Order passed in the facts and circumstances of the case
Court says that the Speaker shall not permit any of the 10 MLAs, against whom disqualification petitions were filed, to protract proceedings
Further, the Speaker shall draw adverse inference if any MLA tries to protract…
— Live Law (@LiveLawIndia) July 31, 2025
ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీల విషయంలో విచారణ జరిపి తీర్పు చెప్పే పనిని స్పీకర్లు (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు) లేదా చైర్మన్లు (రాజ్యసభ, శాసన మండలి)కి అప్పగించడం వెనుక పార్లమెంట్ ఉద్దేశాన్ని గమనించాలని కోర్టు పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.