Jammu and Kashmir: ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి నాలుగేళ్లు.. ఈ 4 సంవత్సరాలలో అక్కడ జరిగిందేంటి?
ఈ అధికరణాన్ని రద్దు చేయడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. రద్దు అనంతరం ఆ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నదే ప్రస్తుతానికి చర్చనీయాంశం. భూతలస్వర్గాన్ని తలపించే అందమైన ఆ లోయలో అడపా దడపా కాల్పుల మోత వినిపిస్తున్నప్పటికీ గతంలో పోల్చితే శాంతి, సుస్థిరత గణనీయంగా మెరుగుపడింది. ఆ కారణంగా పెట్టుబడులు,
భారతదేశంలో అంతర్భాగమైన జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి సరిగ్గా నేటికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ అధికరణాన్ని రద్దు చేయడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. రద్దు అనంతరం ఆ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నదే ప్రస్తుతానికి చర్చనీయాంశం. భూతలస్వర్గాన్ని తలపించే అందమైన ఆ లోయలో అడపా దడపా కాల్పుల మోత వినిపిస్తున్నప్పటికీ గతంలో పోల్చితే శాంతి, సుస్థిరత గణనీయంగా మెరుగుపడింది. ఆ కారణంగా పెట్టుబడులు, అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. వీటన్నింటి కంటే పర్యాటక స్వర్గధామంగా పేరొందిన కాశ్మీర్ లోయలో పర్యాటకుల సందడి పెరిగింది.
మూడు దశాబ్దాల అశాంతికి ముగింపు?
“కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో..” అంటూ సాగే పాట 80వ దశకం చివర్లో తెలుగునాట ఎంత ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1987లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ సినిమాలోని ఈ పాటతో పాటు సినిమాలో చాలా భాగం చిత్రీకరణ కాశ్మీరు లోయలో సాగింది. ఇదే కాదు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా సినిమా పాటల చిత్రీకరణకు కాశ్మీర్ ఒక గమ్యస్థానంగా ఉండేది. సినిమా షూటింగులు, పర్యాటకుల తాకిడితో సందడిగా ఉంటే కాశ్మీర్ లోయలో తుపాకుల మోతలు పెరిగాయి. వేర్పాటువాద ఉగ్రవాదం పెచ్చుమీరింది. రాజకీయం కూడా ఈ దుశ్చర్యలకు మరింత ఊతమిచ్చింది. ఫలితంగా మూడు దశాబ్దాల పాటు కాశ్మీర్ లోయ అశాంతికి నిలయంగా మారింది. అడుగడుగునా భద్రతా బలగాల పహారా.. తుపాకుల నీడలో రాజ్యపాలన సాగించే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఆ రాష్ట్ర ప్రగతి కుంటుపడింది. యువత పెడదారి పట్టి తుపాకులు పట్టింది. దీనంతటికీ కారణం అక్కడి వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోలేని పరిస్థితే కారణమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావించింది. అందుకే ఆర్టికల్ 370 రద్దు అనే అంశాన్ని తమ రాజకీయ ఎజెండాలో భాగంగా మార్చి, ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆర్టికల్ 370 రద్దు చేసింది.
రద్దయిన వెంటనే లోయలో అప్రకటిత నిర్బంధం అమలయింది. కొన్ని నెలలుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అదే సమయంలో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడింది. వరుస పరిణామాల అనంతరం లోయలో మెల్లమెల్లగా శాంతి, సుస్థిరత అడుగు పెట్టాయి. ఇంకా లోయలో వేర్పాటువాదాన్ని ఆశ్రయిస్తున్న యువత, ప్రేరేపిస్తున్న రాజకీయ శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ భద్రతా బలగాలు వాటిపని అవి చేస్తున్నాయి. సరిహద్దులు దాటి చొరబడుతున్న ఉగ్రవాదుల ఏరివేత నిత్యకృత్యంగా మారింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. వారి దృష్టి వేర్పాటువాదంపై మళ్లకుండా అభివృద్ధి పథంపై పడేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో శాంతి నెలకొందని చెప్పలేనప్పటికీ, గతంతో పోల్చితే గణనీయమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా 3 దశాబ్దాల అనంతరం లోయలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 2016 నుంచి ఆగస్ట్ 2019 మధ్యకాలంలో నిరసనలు, భారత ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, రాళ్ల వర్షం వంటి ఘటనల్లో 124 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగేళ్లలో రాళ్ల దాడుల ఘటనలు పెద్దగా చోటుచేసుకోలేదు. అలాగే భద్రతా బలగాల కౌంటర్ ఆపరేషన్లలో సామాన్యుల ప్రాణాలు బలైన ఘటన ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు. ‘శాంతి’ పునరాగమనానికి ఈ గణాంకాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 3న షోఫియాన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో వందల సంఖ్యలో విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు శాంతి, సుస్థిరత గురించి, ఆర్టికల్ 370 రద్దు తర్వాత చోటుచేసుకుంటున్న సానుకూల మార్పుల గురించి మాట్లాడారు.
పెట్టుబడులు.. ప్రాజెక్టులు..
ప్రపంచంలో ఎక్కడైనా సరే అశాంతి, అస్థిరత నెలకొన్న చోట పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు ఏ వ్యాపారవేత్త సాహసించడు. శాంతిభద్రతలు పకడ్బందీగా ఉన్నచోటనే అభివృద్ధి పరుగులు తీస్తుంది. కాశ్మీర్ లోయలో మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రగతికి అక్కడి వేర్పాటువాద ఉగ్రవాదమే ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదుల ఏరివేత ఒక యుద్ధంలా జరుగుతోంది. 2022లో 56 పాకిస్తానీలతో పాటు మొత్తం 186 మంది ఉగ్రవాదులు భద్రతాబలగాల ఆపరేషన్లలో హతమయ్యారు. గత ఏడాది ఆ సంఖ్య 120కి తగ్గింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 35 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లోయలో ఇంకా మిగిలిన ఉగ్రవాదుల ఏరివేత భద్రతాబలగాల రోజువారీ దినచర్యగా మారింది. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లతో పాటు సమాంతరంగా ప్రభుత్వం పెట్టుబడులు, ప్రాజెక్టులు, అభివృద్ధి దిశగా అడుగులు వేసింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత రూ. 81,122 కోట్ల విలువైన ప్రైవేటు పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్ము-కాశ్మీర్‌కు వచ్చిన ప్రైవేట్ పెట్టుబడులు రూ. 14,000 కోట్లు మాత్రమే. తాజాగా ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో భాగంగా వివిధ పరిశ్రమలు, యూనిట్ల స్థాపన కోసం కేటాయించిన 4,877 ఎకరాల్లో ఇప్పటికే 2,250 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవిగాక.. సరిహద్దు రాష్ట్రమైనందున రవాణా సదుపాయాలు మెరుగుపరిచే జాతీయ ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. హిమాలయాల్లో కిలోమీటర్ల పొడవైన సొరంగాలను తవ్వి రహదారులు నిర్మిస్తున్నారు. అన్నింటికంటే కాశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో నేరుగా రైలు ద్వారా అనుసంధానించే ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు కాశ్మీర్ లోయకు చేరుకోవాలంటే శ్రీనగర్ విమానాశ్రయం లేదంటే, రోడ్డు మార్గం మాత్రమే ఉన్నాయి. ఇక నుంచి దేశంలో ఏ మూల రైలు ఎక్కినా నేరుగా శ్రీనగర్‌లో అడుగుపెట్టవచ్చు.
ఊపందుకున్న పర్యాటకం..
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కోవిడ్-19 కారణంగా రెండేళ్ల పాటు పర్యాటకం దాదాపు పడకేసింది. కానీ 2022 నుంచి మెల్లమెల్లగా ఊపందుకుంది. గత ఏడాది ఏకంగా 1.88 కోట్ల మంది పర్యాటకులు జమ్ము-కాశ్మీర్‌ను సందర్శించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2 కోట్ల మార్కు దాటవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. కాశ్మీర్ సందర్శిస్తున్నవారిలో విదేశీ యాత్రికులతో పాటు స్వదేశీ యాత్రికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. యాత్రికులకు బస కల్పించే హోటళ్లు నిండిపోతున్నాయి. ‘హోం స్టే’ సదుయాపాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నీలం లోయలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు సమీపంలో సరిహద్దుల్లో ఉన్న కేరన్ గ్రామం కూడా సందర్శకుల తాకిడిని ఎదుర్కొంటోంది. ఆ గ్రామంలో స్థానికులు నిర్వహిస్తున్న ‘హోంస్టే’లు కూడా సరిపోవడం లేదని, యాత్రికులు పోస్టాఫీస్, బస్టాండ్లలోనే నిద్రిస్తున్న పరిస్థితి కూడా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. శాంతి తీసుకొచ్చి మార్పుతో ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరిగాయని అంటున్నారు.
ఇక నేరుగా శ్రీనగర్ వరకు చేరుకునే రైల్వే సేవలు మొదలైతే.. విమాన ప్రయాణం చేయలేని దిగువ మధ్యతరగతి సందర్శకుల తాకిడి కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి వేర్పాటువాదం వైపు ఆకర్షితులై రాళ్ల దాడుల్లో నిమగ్నమైన కాశ్మీర్ యువత ఇప్పుడు తమ కెరీర్ నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అక్కడి స్థానిక రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని మరికొన్ని రాజకీయ పార్టీలకు రుచించే అంశం కాకపోయినా.. రద్దు తర్వాత జరుగుతున్న సానుకూల మార్పులనైతే ఎవరూ విస్మరించలేరు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..