Mamatha Banerjee Delhi Tour: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఢీ కొట్టడం ఎలా? ప్రతిపక్షాల ముందున్న పెద్ద సవాలు ఇదే.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన కాంగ్రెస్ పార్టీ గత ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. దీంతో ఆ పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ నేతృత్యంలోని బీజేపీ సర్కారును అడ్డుకోవాలంటే అంతటి సామర్థ్యం, ఇమేజీ ఉన్న నేత అవసరం.. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బెంగాల్ సివంగి దీదీ మీద పడుతోంది..
2023 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ నిలదిక్కుకోవడం ఇక అసాధ్యమని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఆయా రాష్ట్రాల సరిహద్దులకే పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీకి యూపీకి, ఆర్జేడీ బీహార్‌కి పరిమితం కాగా.. మహారాష్ట్ర దాటితే ఎన్సీపీ, శివసేనకు బలం లేదు.. డీఎంకే తమిళనాడు నాడుకే పరిమితం.. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పరిమితులు ఉన్నాయి. అన్ని పార్టీలు పరస్పరం సహకరించుకున్నా జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దూరం పెట్టడం అసాధ్యమని భావిస్తున్నారు. కేరళ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపించే వామపక్షాలను కూడా కలుపుకొని పోకతప్పదు.
పశ్చిమ బెంగాల్‌కి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొని మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖులతో భేటీ అవుతున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ-అమిత్‌షాల ద్వయాన్ని ధైర్యంగా ఎదిరించే నాయకురాలు మమతా బెనర్జీయేనని స్పష్టంగా అర్థమైపోయింది. దీంతో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే కూటమికి ఆమెనే నాయకురాలిగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కూటమికి కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తూ.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సమర్వయ బాధ్యతలు చూస్తూ.. మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థిగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై ప్రశాంత్ కిశోర్ పలు దఫాలుగా కాంగ్రెస్‌తో చర్చలు జరిపారని తెలుస్తోంది.
బీజేపీకి ధీటుగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్ కిశోర్ ప్రాథమిక చర్చల తర్వాత మమతా దీదీ నేరుగా రంగంలోకి దిగేశారు. తాజాగా అమె ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమె వరుసపెట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవడం, అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇటీవలే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే నిర్ణయానికి ఇప్పటికే వచ్చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని వదులుకునేందుకు సిద్దపడి ప్రతిపక్ష కూటమిలోకి రాగలదా అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న..
మరోవైపు, దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై మమతా బెనర్జీ ఇప్పటికే తమ రాష్ట్ర పరిధిలో విచారణకు ఆదేశించారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశంపైపోరాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశమైన విపక్షాలు ఈ అంశంపై మోదీ సర్కారును నిలదీయాలని నిర్ణయించాయి. అయితే, తృణమూల్ ఎంపీలు ఈ భేటీకి దూరంగా ఉన్నారు. మమతతో సహా అందరి నాయకులతో కలిసి పోరాడతామంటున్నారు రాహుల్.
కాంగ్రెస్ అధినేత్రితో భేటీ అనంతరం బెంగాల్ సీఎం మమతా స్పందించారు. సోనియా గాంధీ టీ కోసం ఆహ్వానించారని, రాహుల్ కూడా అక్కడ ఉన్నారని మమతా బెనర్జీ తెలిపారు. తాము సాధారణంగా రాజకీయ పరిస్థితిని, పెగసాస్, కోవిడ్ పరిస్థితిపై చర్చించామన్నారు. అలాగే, ప్రతిపక్ష ఐక్యత గురించి కూడా చర్చించామన్నారు. భవిష్యత్తులో సానుకూల ఫలితం తప్పక రావాలని దీదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో అధికారంలోని బీజేపీని ఓడించడానికి అందరూ కలిసి రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. “ఒంటరిగా నేను ఏమీ కాదు.. అందరూ కలిసి పనిచేయవలసి ఉంటుందని.. నేను నాయకుడిని కాదు, నేను కేడర్‌ను. నేను సాధారణ వ్యక్తిని” అని మమతా బెనర్జీ ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తారా అని అడిగినప్పుడు ఈ సమాధానం ఇచ్చారు.
It is essential for everyone to come together in order to defeat BJP…Alone, I am nothing – everyone will have to work together. I am not a leader, I am a cadre. I am a person from the street: West Bengal CM & TMC leader Mamata Banerjee when asked if she will lead the Opposition pic.twitter.com/3AylKRJd75
— ANI (@ANI) July 28, 2021
మరోవైపు, పెగసాస్‌కు ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పార్లమెంటులో విధాన నిర్ణయాలు తీసుకోకపోతే, అక్కడ చర్చలు జరపకపోతే, అది ఎక్కడ జరుగుతుంది? ఇది టీ స్టాల్స్‌లో చేయలేదు, ఇది పార్లమెంటులో జరుగుతుందని అధికార బీజేపీపై పశ్చిమ బెంగాల్ సీఎం మండిపడ్డారు.
Why is the Govt not replying to Pegasus? People want to know. If policy decisions are not made in Parliament, if discussions are not held there, where will it take place? This is not done at tea stalls, this is done in the Parliament: West Bengal CM & TMC leader Mamata Banerjee pic.twitter.com/I2jbjGAWyG
— ANI (@ANI) July 28, 2021