Mehbooba Mufti : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాడుతాం… 370 ఆర్టికల్ రద్దు అన్యాయం…
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370 అధికరణ పునరుద్ధరణపై దీర్ఘకాలిక, కఠినమైన రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధంగా...

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370 అధికరణ పునరుద్ధరణపై దీర్ఘకాలిక, కఠినమైన రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ అధికరణ రద్దు రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. 370 అర్టికల్ రద్దును ఈ ప్రాంతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ అధికరణ రద్దుతో పాటు, రాష్ట్ర హోదాను ఎత్తివేయడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. రాజ్యాంగం పరిధిలోనే సమస్యలను పరిష్కరించాలంటూ ఇంతవరకు వాదిస్తూ వచ్చిన జమ్మూ-కశ్మీర్ పార్టీలకు ఈ నిర్ణయం ఇరకాటంలో పెట్టిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దేశ సార్వభౌమాధికారంపై రాజీ పడకుండా దీనిపై ఉద్యమిస్తామని చెప్పారు.